ఇన్నాళ్లకు గుర్తించావా… పవనూ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తాను ఎక్కువగా ఊహించుకున్నారు. తాను తృతీయ శక్తిగా ఏపీ రాజకీయాలను శాసిస్తానని భావించారు. తాను కింగ్ మేకర్ అవుతానని కూడా [more]

Update: 2021-02-08 08:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తాను ఎక్కువగా ఊహించుకున్నారు. తాను తృతీయ శక్తిగా ఏపీ రాజకీయాలను శాసిస్తానని భావించారు. తాను కింగ్ మేకర్ అవుతానని కూడా భావించారు. కానీ పవన్ కల్యాణ్ కు ఏపీ రాజకీయాల పరిస్థితి ఇప్పుడు పూర్తిగా అవగతమయింది. అవతల బలంగా ఉన్న వైసీపీ, జనసేనలను తట్టుకుని తాను రాజకీయంగా ఎదగలేనన్న నిర్ణయానికి పవన్ కల్యాణ్ వచ్చినట్లే కనపడుతుంది.

తనవల్లనే గెలిచిందన్న…..

పవన్ కల్యాణ్ 2014కు ముందే జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చినట్లు ప్రకటించారు. అవే రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన వల్లనే బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చాయన్న భ్రమల్లో కొంతకాలం పవన్ కల్యాణ్ గడపగలిగారు. అయితే అది కూడా కాదని 2019 ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు స్పష్టంగా తెలిసింది. 2019 ఎన్నికల్లో ఒక్క స్థానం గెలిచి అవమానాన్ని ఎదుర్కొన్నారు.

ఎవరి మద్దతు ఆశించకుండా….

2019 ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ‌్ ఎవరి మద్దతును కోరలేదు. తన అన్న చిరంజీవిని సయితం అప్పట్లో ఆయనను ప్రచారానికి రావాలని, మద్దతు తెలపాలని ఆశించలేదు. ఎందుకంటే తన బలంపై తనకు అంత నమ్మకం ఉంది. కానీ ఫలితాల తర్వాత తన బలం తెలిసి పోవడంతో వెంటనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ ఒక నిర్ణయం పై నిలబడకుండా రాజకీయాల్లో అరటిపండుగా మారారన్నది వాస్తవం.

ఇప్పుడు మాత్రం….

ఇక ఇప్పుడు తాజాగా ఆయనకు తన బలం అర్థమయినట్లుంది. ఒంటరిగానూ, బీజేపీతోనూ కలసి జగన్ ను నిలువరించడం కష్టమని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే చిరంజీవి ప్రస్తావన తెచ్చారంటున్నారు. చిరంజీవి మద్దతు ఉందని తెలిస్తే కొంత చేరికలు కూడా పార్టీలో కనపడతాయని పవన్ కల్యాణ‌్ ఆశిస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకూ కాపు సామాజికవర్గ సమస్యలపై దృష్టి పెట్టని పవన్ కల్యాణ‌్ వారితోనూ చర్చిస్తానని చెప్పడం ఇందుకేనంటున్నారు. కేవలం తనను చూసి, తన ప్రసంగాలను చూసి ఓటు వేయరన్న విషయాన్ని పవన్ కల్యాణ‌్ ఇన్నాళ్లకు గుర్తించారు.

Tags:    

Similar News