పవన్ కి సీన్ లేదంటున్న మాజీ మిత్రుడు ?

పవన్ కళ్యాణ్ ఇదే సమయం, ఇంతకు మించిన తరుణం లేదు అని పాడుకుంటూ రాజకీయాల్లో దూకుడు చేస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత పవన్ [more]

Update: 2021-01-05 12:30 GMT

పవన్ కళ్యాణ్ ఇదే సమయం, ఇంతకు మించిన తరుణం లేదు అని పాడుకుంటూ రాజకీయాల్లో దూకుడు చేస్తున్నారు. నిజానికి 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చాప చుట్టేస్తారు అని అంతా అనుకున్నారు. ఎందుకంటే పవన్ లాంటి మాస్ హీరో, బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తే రెండింటా ఓడిపోయాడు అంటే ఇక రాజకీయం ఏం చేస్తారు అన్న వారూ ఉన్నారు. 18 సీట్లు 70 లక్షల ఓట్లు తెచ్చుకున్న చిరంజీవికే రాజకీయాలు చేయడం కాని పని అన్న నిరాశ వస్తే ఒక్క సీటు ఆరు శాతం ఓట్లు వచ్చి తాను ఓడిన పవన్ కళ్యాణ్ కి అంత కంటే సినిమా ఉంటుందా అన్న వారూ ఉన్నారు.

బీజేపీయే దిక్కుగా…

ఏ దిక్కూ లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా బీజేపీనే పవన్ కళ్యాణ్ తరువాత నమ్ముకున్నారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు పిలిస్తే పలకని పవన్ తరువాత తనంత తానుగా పొత్తు పేరిట మిత్రుడిగా మారారు. కానీ ఈ కూటమి ఏంటో దాని కధ ఏంటో ఏడాది అయినా రెండు పార్టీలకూ అయోమయమే. పవన్ కళ్యాణ్ ది అతి విశ్వాసం అయితే బీజేపీది అతి రాజకీయ ఆరాటం. మొత్తానికి ఈ రెండు పార్టీలు కలసినా జనంలో మాత్రం పెద్దగా పాజిటివ్ రియాక్షన్స్ అయితే ఇప్పటికి లేవు.

జోస్యం చెప్పేశారుగా…?

ఇక పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న ఎర్రన్న సీపీఐ నారాయణ అయితే పవన్ రాజకీయ సినిమా అసలు ఆడదు అని జోస్యం పలికేశారు. ఆయన తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తాజాగా మాట్లాడుతూ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ని కూడా కలిపేసి సినిమా నటులకు రాజకీయాలు చేయడం కుదరని వ్యవహారమని తేల్చేశారు. అంతే కాదు, ఎన్టీయార్, ఎమ్జీయార్ ల కాలంతోనే అది పోయిందని కూడా విశ్లేషించారు. చిరంజీవిని కూడా గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గాలి నిండా తీసేశారు. సినిమాలు చేసుకోమని కూడా నారాయణ సలహా ఇచ్చేశారు.

అందులో నిజముందా…?

రాజకీయాలు చేయడం ఇప్పటి రోజుల్లో చాలా కష్టం. ఇక నాయకులు కూడా ఒక పద్ధతిగా ఉండడంలేదు. అటూ ఇటూ సీట్లతో కాస్తా ఎడ్జ్ వస్తే చాలు జంప్ చేయడానికి కూడా భయపడడంలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి కాకుండా పోయారు. ఇది అధికార రాజకీయం కధ అయితే జనం కూడా గెలుపు గుర్రాల వైపే చూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చూసుకుని మరీ ఓట్లు వేస్తున్నారు. అలా అనుకుంటే ఇప్పటికీ ఏపీలో వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. జగన్ వీక్ అయితే కచ్చితంగా చాన్స్ చంద్రబాబుకే వస్తుంది. ఇది అనేక సర్వేలు చెబుతున్న నగ్న సత్యం. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మరో చాన్స్ చూడాలనుకుంటున్నట్లుగా ఉంది. 2024 ఫలితాలు కూడా నిరాశపరిస్తే మాత్రం ఆయన రాజకీయ సినిమాకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి. అపుడు నారాయణ చెప్పిన జోస్యమే నిజమని నమ్మాలి.

Tags:    

Similar News