అటు బీజేపీ..ఇటు టీడీపీ… మధ్యలో పవన్…?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ ఉంటారు. ఆయనది శోభన్ బాబు టైప్ రొమాంటిక్ హీరోయిజం కాదు. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ బంధాలు అనుబంధాలు [more]

Update: 2020-12-20 13:30 GMT

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ ఉంటారు. ఆయనది శోభన్ బాబు టైప్ రొమాంటిక్ హీరోయిజం కాదు. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ బంధాలు అనుబంధాలు అనంతం. పవన్ కళ్యాణ్ ఇపుడు రెండవసారి బీజేపీతో చెలిమి చేస్తున్నారు. తొలిసారి కంటే ఈసారి ఆదరణ తగ్గినా కూడా తాను ఎక్కడా తగ్గాలో తెలుసు అన్న మాటల మాంత్రికుడు త్రివిక్రం డైలాగ్ ని బట్టి పట్టీ మరీ ఓపికగా సర్దుకుంటున్నారు. కానీ ఏడాదిగా బీజేపీతో తగ్గడమే తప్ప నెగ్గడం మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎక్కడా కనిపించడంలేదట‌. దాంతో ఆయన‌ కమలదళం మీద గుస్సా అవుతున్నారట.

గ్రాఫ్ పెరిగిందా…?

గత సంక్రాంతికి వెలవెలబోయిన ఏపీ బీజేపీ ఈసారి సంక్రాంతికి మాత్రం కళకళలాడుతోంది. ఈ మధ్యలో జరిగిన అనేక రాజకీయ పరిణామాలే దానికి కారణం. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు వచ్చాక ఆ పార్టీ బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక దేశంలో మోడీకి చెరగని ఇమేజ్, వరస విజయాలు శ్రీరామ రక్షగా ఉంటే పొరుగు రాష్ట్రం తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ లో మూడవ వంతు సీట్ల గెలుపు కూడా ఏపీ బీజేపీ గ్రాఫ్ ని ఒక్కసారిగా పెంచేశాయి. దాంతో ఏపీ బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను జాగ్రత్తగా వెనక్కి నెట్టేస్తోంది.

పక్క వాయిద్యమేనట …..

బీజేపీతో ఏ పార్టీ జట్టు కట్టినా పక్క వాయిద్యంగానే ఉండాలి. అది రూల్ అని కమలనాధులు చెప్పకనే చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ తనకు ఆరు శాతం ఓట్లు ఏపీలో ఉన్నాయని ముచ్చట పడినా కాషాయదళం అసలు ఖాతరు చేయడంలేదు. తిరుపతిలో బీజేపీ పెద్దలు తాజాగా జరిపిన భేటీతో వచ్చే ఉప ఎన్నికల్లో అక్కడ ఆ పార్టీ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. సోము వీర్రాజు కూడా ప్రకటించారు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎంత మధనడినా దక్కేది ఏమీ లేదు అన్నది కూడా అంటున్నారు. పవన్ బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేయడమే ఇక మిగిలింది అంటున్నారు.

బాబు వైపేనా….?

ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఆగ్రహిస్తే తిరిగి చేరేది టీడీపీ శిబిరం వైపేనని కూడా ప్రచారం సాగుతోంది. పవన్ కి చంద్రబాబుకు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వచ్చినా అక్కడ సీఎం క్యాండిడేట్ గా బాబు, వెనకాలే చినబాబు కూడా ఉన్నారు. మరి రాజకీయంగా కాస్తో కూస్తో ఉనికి చాటాలంటే మాత్రం బాబుతో దోస్తీ తప్పదనుకుంటే ఇదే దారి అంటున్నారు. అయితే బీజేపీకి ఇప్పటికిపుడు పవన్ కళ్యాణ్ తలాక్ చెప్పరని, సమయం సందర్భం చూసుకుంటారని అంటున్నారు. బహుశా తిరుపతిలో కమలం పార్టీ పరపతి పోయాక ఉప ఎన్నికల్లో దారుణంగా ఫలితం ఆ పార్టీకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ తన తరువాత పొలిటికల్ స్టెప్ ఏంటో చూపిస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News