బరిలో ఖాయమట… వాళ్లకే వదిలేశారట

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని దాదాపు ఆరు నెలలు పైగానే అవుతుంద.ి అయితే రెండు పార్టీలూ ఇప్పటి వరకూ కలసి పనిచేసిన సందర్బాలు లేవు. [more]

Update: 2020-10-18 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని దాదాపు ఆరు నెలలు పైగానే అవుతుంద.ి అయితే రెండు పార్టీలూ ఇప్పటి వరకూ కలసి పనిచేసిన సందర్బాలు లేవు. పొత్తు ప్రకటించిన తర్వాత కరోనా వైరస్ రావడంతో పవన్ కల్యాణ్ సయితం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు సయితం హైదరాబాద్ వెళ్లి పవన్ ను కలసి వచ్చారు. ఇలా రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ కలసి ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

పొత్తు విషయాన్ని ప్రకటించే ముందు పవన్ కల్యాణ్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని చెప్పారు. కానీ కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరుగుతాయో తెలియదు. కరోనా తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ముందు రానుంది.

పోటీ చేయాలని…..

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడానికి రెడీ అవుతుంది. జనసేన, బీజేపీ కలసి పోటీ చేసే తొలి ఎన్నిక ఇదే కావడం విశేషం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, తిరుమలలో ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ వివాదం వంటివి తమకు కలసి వస్తాయని బీజేపీ నమ్ముతుంది. నిజానికి తిరుపతి ప్రాంతంలో బీజేపీ కన్నా జనసేన బలంగా ఉంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేనకే కొద్దోగొప్పో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది.

బీజేపీ అభ్యర్థికే…..

అయితే ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థినే బరిలోకి దింపాలని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారని తెలిసింది. ఉప ఎన్నిక పార్లమెంటుకు సంబంధించింది కాబట్టి తమకు బలం ఉన్నా బీజేపీ అభ్యర్థికే వదిలేయాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. రెండు పార్టీలూ కలసి పోటీ చేయాలని, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని కూడా పవన్ కల్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది. మొత్తం మీద రెండు పార్టీలు కలిసిన తర్వాత జరగనున్న తొలి ఎన్నిక ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News