పవన్… ఏక్ నిరంజన్ ?

సినిమాల్లో ఆయన ఒంటి చేత్తో విలన్లను చావగొడతాడు. కానీ రాజకీయాలలో మాత్రం ఒంటరి పోరు చేయడం కష్టమే. పొత్తుల ఎత్తులతో 2019లో చిత్తు అయ్యాక బీజేపీ తో [more]

Update: 2020-10-19 03:30 GMT

సినిమాల్లో ఆయన ఒంటి చేత్తో విలన్లను చావగొడతాడు. కానీ రాజకీయాలలో మాత్రం ఒంటరి పోరు చేయడం కష్టమే. పొత్తుల ఎత్తులతో 2019లో చిత్తు అయ్యాక బీజేపీ తో కలసి నడవడం సేఫ్ జోన్ గా భావించిన పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేశాడు. సరే ఇదంతా కుదిరింది ఈ ఏడాది సంక్రాంతి తరువాతనే. ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు ఇంతలో ఈ పొత్తుల మీద నీలి నీడకు కమ్ముకునేలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఇపుడు వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాల ముందు విపక్ష రాజకీయం బెదురుతోంది. చంద్రబాబు టీడీపీ అయితే ఒక్క లెక్కన కంగారు పడుతోంది. దానిని మించి పవన్ కల్యాణ్ జనసేనలో ఇపుడు అలజడి రేగుతోందిట.

అయితే.. నిజమైతే…..

పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ ఇంకా వీధులల్లోకి రాలేదు. కలసి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. కరోనా వచ్చి పుణ్యకాలమంతా కరిగించేసింది. ఇంతలోనే రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారుతున్నాయి. వైసీపీ కేంద్ర క్యాబినెట్ లోకి చేరుతుందని ఊహాగానాలు ఢిల్లీ స్థాయిలోనే వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే మొదటి దెబ్బ గట్టిగా తగిలేది పవన్ కళ్యాణ్ కేనని అంటున్నారు. పవన్ బీజేపీ అండ చూసుకునే నిబ్బరంగా ఉన్నారు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి రాజకీయాన్ని కమలనాధుల చేతుల్లో పెట్టేశారు. అటువంటిది రాజకీయంగా తాను బద్ధ విరోధిగా భావించే జగన్ ఎండీయే కూటమిలోకి వస్తే ఇక పవన్ కి అక్కడ చోటు ఉంటుందా?

పొత్తులకు దారేదీ…..

ఇది నిజంగా పవన్ కల్యాణ్ కి సంక్లిష్టమైన సమస్యగానే చూడాలి. అచ్చం చంద్రబాబు మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులను ఎడా పెడా వాడేసుకున్నారు. ఏపీలో ఉన్న వామపక్షాలు, తెలుగుదేశం లతో పవన్ పొత్తులు ఎపుడో కుదిరి ముగిసాయి. ఇక బీజేపీతో కూడా ఇది రెండవసారి కలయిక. ఇక్కడ కాదు అనుకుంటే బయట ఎవరితో పవన్ పార్టీ స్నేహం చేయాలో అర్ధం కాని స్థితి. చంద్రబాబు రెడీగానే ఉంటారు. కానీ ఆయనతో కలిస్తే రాజకీయంగా పవన్ మరింతగా ఇబ్బందులో పడుతారు. ఇపుడు పవన్ మీద ఎర్రన్నలు గుర్రుగా ఉన్నారు. వారితో తిరిగి కలిస్తే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది.

విషమ పరీక్ష ……

బీజేపీతో ఉంటే కడుపులో చల్ల కదలకుండా హాయిగా రాజకీయం చేయవచ్చునని తలచిన పవన్ కల్యాణ్ కి వైసీపీ అడ్డు వస్తోంది. బీజేపీ వారికి తమ రాజకీయమే కావాలి. జగన్ తో కలిస్తే రాజకీయంగా వచ్చే లాభం గరిష్టం. అంతే కాదు. 2024 ఎన్నికల్లో కూడా జగన్ కొమ్ము కాయకపోతే కేంద్రంలో జాతీయ కూటమికి అధికారం దఖల్ పడదు, ఇక ఇప్పటికిపుడు కూడా కొత్త మిత్రులు కావాలి. ఇవన్నీ ఆలోచించుకున్న మీదటనే జగన్ ని మోడీ అమిత్ షా దువ్వుతున్నారు. అందువల్ల రెండు చోట్లా ఓడిన పవన్ కల్యాణ్ ని బీజేపీ పెద్దగా పట్టించుకోదు జగన్ అవసరం వారికి అంతలా ఉంది. మరి . పవనే ఈ స్థితిలో సర్దుకుపోవాలి. మరి జగన్ ఉన్న చోట పవన్ ఉండగలారా. అలా కాదనుకుని బయటకు వచ్చినా ఏం చేయగలరు. మొత్తానికి జగన్ ఢిల్లీ రాజకీయంతో పవన్ ఏక్ నిరంజన్ గా మారుతారా అన్న చర్చ అయితే ఏపీ రాజకీయాల్లో ఉంది.

Tags:    

Similar News