డీల్ అదే నటగా

అందరు అనుకున్నట్లే బిజెపి – జనసేన దోస్తీ కట్టేశాయి. వీరి పొత్తు పొడుపు కోసం గత కొద్ది నెలలుగా ఇరు పార్టీల్లో చర్చలపై చర్చలే నడిచాయి. కలిసి [more]

Update: 2020-01-16 14:30 GMT

అందరు అనుకున్నట్లే బిజెపి – జనసేన దోస్తీ కట్టేశాయి. వీరి పొత్తు పొడుపు కోసం గత కొద్ది నెలలుగా ఇరు పార్టీల్లో చర్చలపై చర్చలే నడిచాయి. కలిసి ప్రజాసమస్యలపై పోరాటం, ఉద్యమాలు పైకి ఇరు పార్టీలు చెప్పే మామూలు మాటలే. కానీ అంతర్గతంగా పొత్తు ఇంతకాలం సెట్ కాకపోవడానికి అనేక రీజన్స్ చెబుతున్నారు విశ్లేషకులు. తమతో దూరమైన పవన్ కల్యాణ్ పార్టీని కలుపుకోవడానికి కమలం ఏమీ ఉత్సహం చూపించలేదు. అయితే వైసిపి తో పెరిగిన వైరం కాషాయం తో కలిస్తే కానీ ముందుకు వెళ్లలేని అనివార్యతను పవన్ కల్యాణ్ కి కల్పించాయి.

యువ ఎంపీలతో భేటీ అందుకే …

అందుకోసం తనకున్న సోర్స్ అన్నింటిని పవన్ కల్యాణ్ ఉపయోగించారు. బెంగళూరు ఎంపి సూర్య తేజస్వీ, మైసూర్ ఎంపి ప్రతాప్ సింహ ఇటీవల పవన్ అభిమానులమంటూ ఆయన ఆహ్వానం పై వెళ్లారు. వారిద్దరూ సెల్ఫీలకు వచ్చారంటూ పైకి రెండు పక్షాలు ప్రకటించినా అంతర్గతంగా బిజెపి అధిష్టానం వద్ద అపాయింట్ మెంట్ కోసమే పవన్ కల్యాణ్ ప్రయత్నం చేశారన్నది తేలిపోయింది. అనుకున్నట్లే యువ ఎంపిలు పార్టీ అధ్యక్షుడు నడ్డా తో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారు. అందుకే బిజెపి ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ తో పాటు సూర్య తేజస్వీ కూడా జనసేనాని నడ్డాను కలిసినప్పుడు దగ్గరే వున్నారు.

డీల్ లో మాకిది మీకిది …

బిజెపి అధిష్టానం జనసేన ముందు తమ ప్రొపోజల్స్ ఉంచింది. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు ఎక్కువ మొత్తంలో తమకు అసెంబ్లీ స్థానాలు అధిక సంఖ్యలో జనసేనకు వదిలి పెట్టడం డీల్ లో ప్రధాన అజండా గా ప్రచారం నడుస్తుంది. అసెంబ్లీలో కూడా కొన్ని స్థానాల్లో కమలం బరిలోకి దిగేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కడ బలం వుందన్నది గుర్తించి అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని కమలం అధిష్టానం సూచించినట్లు టాక్. అలాగే టిడిపి, వైసిపి లతో సమానదూరం ఉంటుందని వారితో జతకట్టే అవసరం ఇరు పార్టీలకు ఉండకుండా ఎదగాలన్నది అంతర్గత సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

తెలంగాణాలోనూ ….

తెలంగాణ లో సైతం ప్రధాన శక్తిగా బిజెపి అవతరించేందుకు పవన్ కల్యాణ‌ తోడు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుస్తుందని భావించే ఈ డీల్ ను కమలం అధిష్టానం తెచ్చిందంటున్నారు విశ్లేషకులు. వీటన్నిటికీ పవన్ కల్యాణ‌్ ఒకే చెప్పేయడంతో ఆలస్యం లేకుండా ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకు తిరగాలని నిర్ణయించారని అంటున్నారు. తమ మధ్య ఒప్పందం అయిపోయినా మమ అనిపించుకోవడానికి రాష్ట్ర బిజెపి నాయకత్వంతో కో ఆర్డినేషన్ కి ఒక సమావేశం నిర్వహించుకోవాలని కమలం పెద్దల సూచనలను ఇరు పార్టీలు అమల్లో పెట్టి తంతు పూర్తి చేశారు. ఇప్పుడు వీరి ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News