ఇక జనసేన జనం బాట.. అప్పటి నుంచే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఆరు నెలల నుంచి పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన సినిమాలు చేయడానికి అంగీకరించడంతో కొద్దికాలం షూటింగ్ లతో గడిపారు. [more]

Update: 2020-09-19 09:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత ఆరు నెలల నుంచి పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆయన సినిమాలు చేయడానికి అంగీకరించడంతో కొద్దికాలం షూటింగ్ లతో గడిపారు. తర్వాత కరోనా కారణంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. ముఖ్యమైన అంశలపై అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్ లు మినహా పార్టీ నేతలతో ఆయన కలసింది లేదు. క్షేత్రస్థాయిలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు కూడా లేవు.

క్యాడర్ లో నైరాశ్యం…..

దీంతో క్యాడర్ లో నైరాశ్యం నెలకొంది. ఒకవైపు అన్ని పార్టీలూ ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళుతున్నా జనసేన మాత్రం జనం బాట పట్టలేదు. మిత్రపక్షమైన బీజేపీ సయితం దూకుడుగానే ఉంది. వివిధ కార్యక్రమాలతో తాము ఉన్నామన్న సంకేతాలను ఇస్తుంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివిధ అంశాలపై ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాకుండా జిల్లాలను కూడా పర్యటిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

మిత్రపక్షంతో కలసి…..

జనసేన బీజేపీ పొత్తు ఖరారయిన తర్వాత ఇద్దరూ కలసి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. దీనికి కారణం కరోనా వైరస్ అని చెప్పాలి. దీంతో రెండు పార్టీల నాయకత్వం కలసిపోయినా, క్షేత్రస్థాయిలో మాత్రం క్యాడర్ కలవలేదు. ఈ విషయాన్ని సోము వీర్రాజు గ్రహించారు. దీనిని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సంయుక్తంగా కార్యక్రమాలను చేపడితేనే కార్యకర్తల్లో జోష్ పెరుగుతందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దసరా నుంచి……

దసరా పండగ తర్వాత నుంచి రెండు పార్టీలు కలసి కార్యక్రమాలను రూపొందించుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ కు కార్యాచరణ బాధ్యతను అప్పగించారు. దసరా నుంచి జనసేన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. సినిమా షూటింగ్ లు ఉన్నప్పటికీ మధ్యలో కార్యక్రమాల్లో పాల్గొనేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటారు. అంటే దసరా నుంచి ఇకజనసేన జనం బాట పట్టనుందట. చూద్దాం మరి.

Tags:    

Similar News