పవన్ అందుకోసమేనటగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న బిజెపికి ఇప్పుడు తోడు జనసేన రూపంలో దొరికేసింది. అత్యంత ప్రజాకర్షణ కలిగిన సినీ స్టార్ గా, బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా [more]

Update: 2020-01-14 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్న బిజెపికి ఇప్పుడు తోడు జనసేన రూపంలో దొరికేసింది. అత్యంత ప్రజాకర్షణ కలిగిన సినీ స్టార్ గా, బలమైన సామాజికవర్గ ప్రతినిధిగా వున్న పవన్ కళ్యాణ్ తనంత తాను గా కోరివస్తే కమలం కాదని ఎందుకు అంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని కలలు గంటున్న కాషాయం పార్టీకి నమ్మకమైన నేస్తం కోసం ఎదురు చూస్తుంది. 2014 లో తమ పార్టీకి సహకరించిన జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు మరోసారి కలిసి నడుద్దాం అని స్పష్టం చేయడంతో ఎపి రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేచింది. ఢిల్లీ లో తమ అధినేత డీల్ సెట్ చేయడంతో ఇప్పుడు జనసైన్యం లో ఆనందం వెల్లివిరుస్తుంది.

స్థిరంగా ఉంటారా …?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటారు. అది నిజం కూడా. బిజెపి తో ముందు జత కట్టి ఆ పార్టీ తో ప్రత్యేక హోదా విషయంలో విభేదించి, టిడిపి ని నాలుగేళ్లపాటు సమర్ధించి, ఎన్నికల ముందు వ్యతిరేకించి చివరికి ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే సాధించి చతికిల పడింది జనసేన. అలాగే టిడిపి, జనసేన లతో జట్టు కట్టి ఎంతో కొంత లాభపడి ఆ తరువాత సొంతంగా ఎదగాలనే వ్యూహంతో ఒంటరిగా పోటీ చేసి జీరో అయిపొయింది బిజెపి. ఇప్పుడు అటు కమలానికి ఇటు టీ గ్లాస్ కి పొత్తు అనివార్యంగా పెట్టుకోక తప్పని పరిస్థితిని తాజా రాజకీయాలు కల్పించేశాయి. ఇద్దరు క్షేత్ర స్థాయిలో గట్టి పట్టు లేని పార్టీలే. అయితే ఈ రెండు పార్టీల్లో బిజెపి ఏపీ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగిన పార్టీ. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన అయితే ఇంకా మొగ్గ దశలోనే నడుస్తుంది.

పవర్ పాలిటిక్స్ షూరూ అవుతాయా …

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎపి లో ఏమి చేయలేని పరిస్థితుల్లోనే బిజెపి సాగుతుంది. తమ సత్తా చాటేందుకు వున్న అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కమలానికి పవన్ కల్యాణ్ అవసరం వరంగా మారింది. అదే రీతిలో పవన్ కల్యాణ్ కి ఇప్పుడు బిజెపి ఆశీస్సులు అత్యవసరం. జగన్ సర్కార్ దూకుడు తట్టుకోవాలంటే చేతిలో ఏదో ఒక పవర్ తక్షణ అవసరం గా గుర్తించి టిడిపి తో లాభం లేదని పవన్ కల్యాణ్ సైకిల్ దిగే నిర్ణయానికే ఆమోదం తెలిపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసం ఆయన చేసిన ఢిల్లీ ప్రదక్షిణాలు మొత్తానికి ఫలితం ఇచ్చినట్లే కనిపిస్తుంది. ఇద్దరి పొత్తు ఉభయకుశలోపరి గా ఉంటుందని లెక్కేసిన బిజెపి అధిష్టానం ఇక జనసేన దిశా దశా నిర్ణయించనుంది. జనసేన – బిజెపి దోస్తీ ఇప్పుడు ఏపీ లో ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందన్నది వేచి చూడాలి. ఈ రెండు పార్టీలు వచ్చే స్థానిక ఎన్నికలకు కలిసి నడిచే వాతావరణం స్పష్టం అవుతున్న నేపథ్యంలో ప్రజలు దీన్ని ఏ మేరకు ఆమోదిస్తారో ఫలితాలు చెప్పనున్నాయి.

Tags:    

Similar News