కులం రొచ్చులో పవన్ ?

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టేముందు అందరి వాడు అని ఒక సినిమా తీశారు. అది సరిగ్గా ఆడకపోయినా ఆ టైటిల్ అర్ధం జనాలకు రీచ్ కావాలన్నదే ఆయన [more]

Update: 2020-08-17 15:30 GMT

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టేముందు అందరి వాడు అని ఒక సినిమా తీశారు. అది సరిగ్గా ఆడకపోయినా ఆ టైటిల్ అర్ధం జనాలకు రీచ్ కావాలన్నదే ఆయన తాపత్రయం. తాను ఒక వర్గం మనిషిని కాదని, అందరి వాడినని మెగాస్టార్ అలా తన సినీ మాధ్యమం ద్వారా చెప్పుకుని మరీ రాజకీయ అరంగేట్రం చేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీలో చేరిన వారు, పెత్తనం చేసిన వారు అంతా కాపులే, ఇక పార్టీ విధానాలు ఎలా ఉన్నా బయటకు హైలెట్ అయింది మాత్రం కాపులకు ఒక పార్టీ అని. అది చివరకు బూమరాంగ్ అయింది. కాపులే మద్దతుగా నిలిచి ఓటు వేసినా వారు కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేని స్థితి. మొత్తానికి సినీ రంగాన అందరివాడుగా వెలిగిన చిరంజీవి రాజకీయాల్లోకి అచ్చి ఒక వర్గానికి నాయకుడుగా మిగిలిపోవడం చేదు అనుభవం.

జనసేనా అలాగే ….

ఆ చేదు అనుభవాలు పవన్ కల్యాణ్ జనసేనను కూడా వెంటాడాయి. ప్రజారాజ్యం టూ అంటూ వ్యతిరేక మీడియా నుంచి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం దాకా కధ నడిచింది. ఇక పవన్ కల్యాణ్ పార్టీలో సైతం కీలక పదవుల్లో ఉన్న వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం, పవన్ కూడా తాను పోటీ చేసే రెండు సీట్లలోనూ కాపులు ఎక్కువ ఉండే చోటునే ఎంపిక చేసుకోవడం ఇవన్నీ కలసి జనసేన పుట్టె ముంచాయి. పోనీ ఓడిన తరువాత అయినా జనసేన ఏమైనా మారిందా అంటే ఇప్పటికి ఏదీ లేకుండా ఉంది.

కంపు చేస్తున్నారా…..

ఇక జాతీయ భావాలు ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని మంచి పని చేశాను అని పవన్ కల్యాణ్ సంతోషించినంతసేపు పట్టలేదు, పేరుకు జాతీయ పార్టీ కానీ బీజేపీ కూడా కుల రాజకీయం చేస్తోంది. పైగా కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీని పూర్తిగా కాపుల పార్టీగా మార్చే పనిలో బిజీ అవుతున్నారు. ఆయన వరసగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను కలిశారు. అంతటితో ఆగకుండా ముద్రగడ పద్మనాభం, జేడీ లక్ష్మీ నారాయణ వంటి వారిని కూడా కలుస్తాను అంటున్నారు. అంటే కాపుల ఓట్ల కోసమే అని బాహాటంగా చెప్పేసుకుంటున్నారు. ఇది నిజంగా పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్ పార్టీకి ఇరకాటమే.

అదే భావనా…?

గోదావరి జిల్లాల్లో పూర్తిగా కాపులే లేరు, బీసీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. వారికీ కాపులకూ అక్కడ పడదని అంటారు, ఇక దళితులు కాపుల ఆధిపత్యాన్ని సహించలేరు అని చెబుతారు. ఇపుడు రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాటలను ఈ కోణంలో నుంచి చూడాలి. జనసేన ఒక వర్గం పార్టీ అని ఆయన చేసిన హాట్ కామెంట్స్ పవన్ కల్యాణ్ కి నేరుగానే తగులుతాయి. కాపుల పార్టీ అని రాపాక ముద్ర వేశారన్న మాట. కాపుల పార్టీగా బీజేపీని తీర్చిదిద్దుతున్న సోము వీర్రాజు చేసిన రచ్చకు ఈ రొచ్చు తోడు అయితే జనసేన పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లే. నిజానికి ఏపీలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీకైనా కులం ఓట్లు సరిపోవు, మిగిలిన సామాజిక వర్గాలూ సహకరించాలి. కమ్మ, రెడ్లకు పెద్దగా జనాభా లేదు కానీ సోషల్ ఇంజనీరింగ్ లో స్పెషలిస్టులు కాబట్టే బాబు, జగన్ నెగ్గగలిగారు. వారి పార్టీల మీద కుల ముద్ర ఉన్నా బాహాటంగా కనబడదు, కానీ బీజేపీ తాను కులం రంగు పూసుకుంటూ జనసేనకు అంటిస్తోంది. ఇది పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు అసలు మంచిది కాదు, మరి జనసేనాని దీన్ని ఎలా అడ్డుకుంటారో చూడాలి.

Tags:    

Similar News