పవన్ మిస్ చేసుకుంటున్నారా …?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు కులాల నడుమ ఆధిపత్య పోరుగా మారిన తరుణంలో మూడో శక్తి గా ఆవిర్భవించాలన్న జనసేన ప్రయత్నం ఎప్పటికి నెరవేరుతుందన్నది ప్రశ్న గానే మిగిలిపోతుంది. [more]

Update: 2020-08-02 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు కులాల నడుమ ఆధిపత్య పోరుగా మారిన తరుణంలో మూడో శక్తి గా ఆవిర్భవించాలన్న జనసేన ప్రయత్నం ఎప్పటికి నెరవేరుతుందన్నది ప్రశ్న గానే మిగిలిపోతుంది. సినీ స్టార్ ఇమేజ్, అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న కులం అండగా ఉన్నా జనసేనాని పవన్ కల్యాణ్ దానిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారడంలో వైఫల్యం చెందుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 నుంచి రాజకీయం మొదలు పెట్టి 2014 ఆ తరువాత 2019 ఎన్నికల అనుభవాలను పొందారు పవన్ కల్యాణ్. అయినా ఆయన ధోరణిలో క్యాడర్ ఆశించిన మార్పులు కానరాకపోవడం పై చర్చ నడుస్తుంది. పార్టీ నిర్మాణాన్ని బలంగా రూపొందించే ప్రక్రియ పై నేటికీ జనసేనాని ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న ప్రశ్న అలాగే మిగిలిపోతుంది.

ప్రజారాజ్యం ముద్ర …

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లతో బాటు బలమైన ఓటు బ్యాంక్ నే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూపించగలిగారు. అయితే ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన తీరు నాడు పీఆర్పీ ని నమ్ముకున్న వారి ఆశలు గల్లంతు చేసింది. ఆ ప్రభావంతో మొదలైన జనసేన 2014 ప్రస్థానం గమ్యం చేర్చదని గుర్తించే పవన్ కల్యాణ్ బిజెపి, జనసేన లకు జై కొట్టి పోటీ కి దూరమయ్యారు. నాడు ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది, కానీ పార్టీ మాత్రం ఎదుగు బొదుగు లేకుండా పోయింది. ఇది గుర్తించకుండా తన బలాన్ని అంచనా వేసుకునే క్రమంలోనే అంతకు ముందు జత కట్టిన బిజెపి, టీడీపీ లను కాదని ఆయన కామ్రేడ్ లతో కలిసి 2019 ఎన్నికల బరిలోకి దిగి ఒక్క సీటు తో బాటు 7 శాతం ఓట్లకు పరిమితమై దెబ్బయిపోయారు. అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే కానీ చిత్రంగా మరోసారి ఆయన కమ్యూనిస్ట్ లను ఎన్నికల తరువాత విడిచి పెట్టి కమలం తో దోస్తీ కట్టేశారు. ఇలా నిలకడ లేని రాజకీయ అడుగులతో ఎందుకు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరితో విడిపోతారో తెలియని అయోమయం గందరగోళాన్ని పవన్ కల్యాణ్ సృష్టించేశారు.

ఇప్పటికి అవకాశాలు పవన్ కే …

ఎపి లో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి నుంచి ఆయన పార్టీ నిర్మాణం పై సీరియస్ గా దృష్టి పెట్టడంతో బాటు ప్రజాసమస్యలపై తనదైన పోరాట మార్గాన్ని అనుసరించాలిసి ఉంటుంది. కోటరీ కి పరిమితం కాకుండా జన బాహుళ్యం లోకి తరచూ వెళుతూ జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీల నియామకం చేపట్టాలిసి ఉంది. బిజెపి తో పొత్తు ఉంది కదా అని గతంలోలాగే పార్టీ నిర్మాణాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో చూసుకుందామనే ధోరణి అనుసరిస్తే గత అనుభవాలే పవన్ కల్యాణ్ ను వెంటాడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేతలతో టచ్ లో ఉండటం ద్వారా సేవా కార్యక్రమాలు, సమస్యలపై పోరాటాలను జనసేన ఉధృతం చేయాలిసి ఉంది. దానితో బాటు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చెదిరి పోకుండా పూర్తిగా తన వైపు టర్న్ చేసుకుంటూనే మిగిలిన వర్గాలను కలుపుకు వెళ్లాలని రాజకీయా విశ్లేషకుల సూచనలను జనసేనాని ఏ మేరకు పాటిస్తారో చూడాలి.

Tags:    

Similar News