‘పవర్’...మెంటార్ కేటీఆర్...!!

Update: 2018-10-20 15:30 GMT

రాజకీయాల్లో ఒక గమ్యం చేరుకోవడానికి దారులుంటాయి. గాడ్ ఫాదర్లను నమ్ముకోవడం కావచ్చు. వారసత్వం కావచ్చు. కష్టపడి ప్రజల్లో పనిచేసి నాయకత్వస్థాయికి చేరుకుని పగ్గాలు అందుకోవడం కావచ్చు. దేనికైనా ఒక రూట్ తప్పదు. తెలంగాణలో అధికారపార్టీ అయిన టీఆర్ఎస్ రెండు ప్రధానపార్టీలపై కన్నేసినట్లుగా గుప్పుమంటోంది. ఆ రెండు పార్టీలకు రాజకీయ క్షేత్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో వాటి వాటా బాగా తక్కువ. కానీ వాటి ప్రాబల్యం, ప్రాముఖ్యం మాత్రం తీసిపారేయదగినది కాదు. అందులోనూ ఈరెండు పార్టీలు బరిలో లేకపోతే తెలంగాణలో అధికారపార్టీకి లాభసాటిగా ఉంటుంది. పోటీకి తలపడితే టీఆర్ఎస్ కు రావాల్సిన ఓట్లకు చీలిక ఏర్పడుతుందేమోననే భయం వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీలను తెలంగాణలో మచ్చిక చేసుకునే పనిలో పడింది టీఆర్ఎస్ అధిష్ఠానం. వాటిని తెలివిగా అక్కున చేర్చుకుని అవసరమైతే విపక్షాలపైకి ప్రయోగించాలనే ఎత్తుగడలు వేస్తోంది. ప్రతిపక్షకూటమి బలంగా ఉన్నచోట్ల వాటి సంఘటిత ఓటు చీలిపోయే అస్త్రంగా వినియోగించాలనే దిశలో సైతం ఆలోచన సాగుతోంది. ఈ పొలిటికల్ గేమ్ ప్లాన్ లో లాభనష్టాల అంచనాలు , సమీకరణలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

కితాబు..కిరికిరి.....

పవన్ కల్యాణ్ ఎక్కడో ధవళేశ్వరంలో జనసేన కవాతు నిర్వహించారు. తెలంగాణ అధికారపార్టీ టీఆర్ఎస్ కు దీనితో సంబంధమే లేదు. అయినా కేసీఆర్ వారసుడు కేటీఆర్ ఫోన్ చేసి మరీ పవన్ ను అభినందించినట్లు సమాచారం. ఇదే వేగంతో ఏపీలో ప్రచారం నిర్వహిస్తే ప్రభావవంతంగా పార్టీ తయారవుతుందని సూచన చేసినట్లుగా జనసేనవర్గాలు చెబుతున్నాయి. పార్టీని ఒక బలమైన శక్తిగా మార్చడానికి కొన్ని టిప్స్ కూడా పవన్ కు చెప్పినట్లు ప్రచారమవుతోంది. ప్రత్యేకించి ప్రస్తుత జనసేనకు ఒక ఉద్యమ స్వరూపం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను అనుసరించాల్సిన పంథా, పథం, రాజకీయ వ్యూహంపై తన ఆలోచనలను పవర్ స్టార్ తో పంచుకున్నట్లుగా విశ్వసనీయవర్గాలు వెల్లడిస్తున్నాయి. జనసేనలో పూర్తిస్థాయి రాజకీయ నిర్మాణం జరగలేదు. ఆర్థిక వనరుల పరిమితులూ ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ ప్లాన్ విషయంలోనూ తడబాటు కొనసాగుతోంది. వీటిని సరిదిద్దేందుకు మెంటార్ పాత్రలో కేటీఆర్ సహకరిస్తారని జనసేన ఆశిస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రమే ఈ రోల్ లోకి రంగప్రవేశం చేసే అవకాశం ఉంది.

చేతులు కలిపేనా...?

ఇచ్చిపుచ్చుకోవడాలు రాజకీయాల్లో సహజం. ఏ విషయంలోనూ ఉచితం ఉండదు. జనసేనకు కొంత రాజకీయ పటిమ, బలిమి సమకూర్చడానికి టీఆర్ఎస్ ముందుకు వస్తోంది. అయిదు నెలల క్రితం కేసీఆర్ ను పవర్ స్టార్ కలిశారు. రైతు బంధు , ఇతర సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. అప్పట్లోనే జనసేనానికి, కేసీఆర్ కు మధ్య వ్యక్తిగత అనుబంధం ఏర్పడింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో జనసేన ఇక్కడ ఎటువంటి పాత్ర పోషిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణలో సైతం పవన్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. నిరుద్యోగ భృతి వంటివాటిని ప్రవేశపెట్టి యూత్ లో కొంతమేరకు ఓటు బ్యాంకు సృష్టించుకోవడానికి తాజాగా మేనిఫెస్టోలో టీఆర్ఎస్ గాలం వేసింది. పవన్ కల్యాణ్ వంటివారు రంగంలో ఉంటే యువత మొగ్గు అటువైపే ఉంటుంది. అదే పోటీలో లేకుంటే, అందులోనూ టీఆర్ఎస్ కు అనుకూలంగా పోటీ నుంచి తప్పుకున్నట్లు సంకేతాలు పంపగలిగితే ప్రయోజనం ఉంటుంది. తాజాగా టీఆర్ఎస్ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ని కూడా పోటీలో లేకుండా చూడాలని యత్నిస్తోంది. అయితే ఈరెండు పార్టీలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పోటీకి దూరంగా ఉంటాయా? లేదా ? అన్నది వేచి చూడాల్సిన పరిణామం.

ఏ ప్రయోజనాల కోసం?

ఒకవేళ వైసీపీ, జనసేనలు అధికారపార్టీకి అనుకూలంగా రంగంలోంచి తప్పుకుంటే రాజకీయంగా అనేక సందేహాలకు, అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపై ఉంటుంది. వైసీపీకి ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో సామాజిక వర్గ మద్దతు ఉంది. వైఎస్సార్ అభిమానులున్నారు. తమ పార్టీ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీ నాయకులు తమ పార్టీ బరిలో నిలవాలని డిమాండు చేస్తున్నారు. అభిమానులైతే ఏయే ప్రాంతాల్లో జనసేన పోటీ చేయవచ్చునో జాబితా సిద్దం చేసేశారు. ఈరెండు పార్టీలు తమ వారికి సమాధానం చెప్పాలి. బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ అంటకాగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక ముద్ర వేసేసింది. తాజా పరిణామాలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తాయి. వీటిని తిప్పికొట్టకపోతే ఆంధ్రాలో వైసీపీకి నష్టం వాటిల్లుతుంది. జనసేనకు ఆదరణ కరవు అవుతుంది.తెలంగాణలో టీఆర్ఎస్ లాభం కోసం తమ సొంత రాష్ట్రాల్లో తమ పార్టీల ప్రయోజనాలను పణంగా పెడతారా? అందుకు తగిన ప్రతిఫలం ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆయా పార్టీల్లో చర్చనీయమవుతోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News