‘దేవ్’డొచ్చాడే......?

Update: 2018-05-02 15:30 GMT

ఇంతవరకూ ఒక స్థిరమైన రాజకీయ ముద్ర వేసుకోలేకపోతున్న జనసేన తాజాగా డ్రమటిక్ వ్యూహానికి తెర తీసింది. ఒక్కసారిగా వ్యూహకర్తను పరిచయం చేసింది. ఇక 2019 ఎన్నికలకు ఆయనే దిశానిర్దేశం చేస్తారంటూ పవన్ ప్రకటించేశారు. పార్టీలోనూ, ప్రజల్లోనూ అసలింతకీ ఈ దేవ్ ఎవరనే చర్చ మొదలైంది. జనసేన అధిపతికి మినహా మరెవరికీ ఇంతవరకూ పరిచయం లేని క్యారెక్టర్ ఇది. పదినెలలుగా ఆయన పార్టీకి సేవలందిస్తున్నారని పవన్ చెప్పేశారు. ఇంతవరకూ మేము ఆయన మొఖం కూడా చూడలేదే అంటూ ఆశ్చర్యపోవడం జనసేన ప్రథమశ్రేణి నాయకుల వంతయింది. ఇతని చర్యలు ఊహాతీతం అని సినిమాలో డైలాగ్ మాదిరిగానే తంతు సాగిపోతోంది. చంద్రబాబు నాయుడిపై పవన్ తిరుగుబాటు చేసిన తొలిదశలో కనిపించిన ఊపు నిలుపుకోవడంలో జనసేన కొంత వెనకబాటుకు గురైంది. దీనిపై పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఇటీవల చేయతలపెట్టిన చిత్తూరు,గుంటూరు జిల్లా పర్యటనల అంశంలో వాయిదా పార్టీని డీలాపడేలా చేసింది. సెంట్రల్ ఇంటిలిజెన్సు నుంచి వచ్చిన సమాచారం మేరకు పర్యటన వాయిదా వేసుకున్నట్లుగా సాగుతున్న ప్రచారమూ పార్టీని ఇరకాటంలో పడేస్తోంది.

ముందు జాగ్రత్త ముదిరిపోయింది...

జనసేన పార్టీ కార్యకలాపాలను సీరియస్ గా పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు చేస్తున్న విమర్శ ఒకటే. పార్టీ అధినేత తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు పార్టీ ముందడుగు వేసేందుకు ఆటంకంగా పరిణమిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన సందర్బంగా మిత్ర, పరకాల ప్రభాకర్, ఉపేంద్ర వంటి వారు కీలక పాత్ర పోషించారు. కానీ వారంతా ప్రజారాజ్యాన్ని దెబ్బతీశారనే భావన పవన్ లో నెలకొంది. అందుకే ఇప్పుడు నాయకులను విశ్వసించడం మానేశారాయన. తన చుట్టూ తిరుగుతున్న వ్యక్తులతో తన వ్యూహాలు, పర్యటనలు, ఆలోచనలకు సంబంధించిన విషయాలను పంచుకోవడం లేదు. అప్పటికప్పుడు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేసేస్తున్నారు. ముందుగా తీసుకున్న నిర్ణయాలను సైతం చివరి వరకూ ప్రకటించకుండా గోప్యతను పాటిస్తున్నారు. అంతటా అనుమానం, సందేహం నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను ఉపసంహరించుకున్నారు. వీరి ద్వారా తన పార్టీ కార్యకలాపాలు, తన వ్యక్తిగత పర్యటనలు , సమావేశాలు లీక్ అయిపోతున్నాయనే అనుమానంతో ఈ చర్య తీసుకున్నారు. ఆ తర్వాత కూడా పార్టీలో ఈ సందేహం తొలగిపోలేదు. నిజానికి పవన్ కల్యాణ్ ను ఎవరైనా కలవాలంటే అంత సులభం కాదు. ముందుగా అనుమతి తీసుకోవడమే కాకుండా తనిఖీల తర్వాత మాత్రమే కార్యాలయం లోనికి అనుమతిస్తారు. సమావేశానికి ముందుగానే మొబైల్ ఫోన్ల సహా అన్నిటినీ స్వాధీనం చేసుకున్న తర్వాతనే సమావేశమవుతారు. ఇదంతా రొటీన్ పొలిటికల్ పార్టీ యాక్టివిటీకి భిన్నమైనది. భద్రతచర్యలు తీసుకోవడం తప్పుకాదు, కానీ రాజకీయ పార్టీలో లీడర్ కు , క్యాడర్ కు మధ్య గ్యాప్ ఉండకూడదు. చలనచిత్ర రంగంలో సెలబ్రిటీ స్టేటస్ మెయింటెయిన్ చేస్తూ అభిమానులను దగ్గరికి రాకుండా చూసుకుంటారు. కానీ రాజకీయాల్లో నేతలే ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ మౌలికమైన తేడాను ఇంకా జనసేన గుర్తించలేదు.

పదకొండు నుంచి పక్కా...

ఈనెల పదకొండో తేదీ తర్వాత పర్యటనలకు పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ హడావిడి మొదలుపెట్టాయి. నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు జిల్లాల వారీ సభలకు ప్రణాళిక సిద్దం చేశారు. వైసీపీ నాయకుడు జగన్ పాదయాత్రలతో ప్రజల్లోనే ఉంటున్నారు. దానికి తోడు టీడీపీ ఎత్తుగడలను పరిశీలిస్తూ ప్రతివ్యూహాలతో ఉద్యమాలు చేసేందుకు విజయసాయి రెడ్డి నేతృత్వంలో కార్యబ్రుందాన్ని సిద్దంగా ఉంచారు. ఇలా ద్విముఖ కార్యాచరణతో వైసీపీ ముందుకు వెళుతోంది. టీడీపీ విషయానికొస్తే పార్టీ కి, ప్రభుత్వానికి తేడా తెలియకుండా కలగాపులగంగా నిరసన కార్యక్రమాలు, దీక్షలను కలిపేసింది. మొత్తం వాతావరణమంతా హాట్ హాట్ గా మారిపోయింది. నిజం చెప్పాలంటే జనసేన ఆలస్యంగా రంగంలోకి దిగుతున్నట్లుగానే చెప్పాలి. అనుభవం తక్కువని ఇప్పటికే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రెండు ఎన్నికల అనుభవం మా కార్యకర్తలకుందంటూ తాజాగా పవన్ వివరణ ఇచ్చారు. వ్యూహకర్త దేవ్ రంగప్రవేశంతో యాక్టివిటీ పుంజుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

దేవ్ దిశానిర్దేశం...

ఇప్పటికి పదినెలలుగా పవన్ తో టచ్ లో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్టు దేవ్ ప్రధానంగా బ్రిటిష్ ఎన్నికల విధానాలపై అధ్యయనం చేసినట్టుగా సమాచారం. భారత ఎన్నికల విధానాలపై పెద్దగా పనిచేయలేదు. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం అంతంతమాత్రమేనని తెలుస్తోంది. సైద్దాంతికంగా పవన్ ఆదర్శవాదాన్ని ఇష్ట పడి అసోసియేట్ కావాలనుకుంటున్నానని ఆయనే స్వయంగా సంప్రతించినట్లు సమాచారం. ఇంగ్లండ్ లో ఉన్నతస్థానాల్లో ఉన్న పవన్ అభిమానులు దేవ్ ను జనసేనానికి పరిచయం చేశారు. అకడమిక్ క్వాలిఫికేషన్ తోపాటు ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ , భవిష్యత్తు మార్గ నిర్దేశం తన ఆలోచనలకు దగ్గరగా ఉందని చీఫ్ స్ట్రాటజిస్టుగా ఎంపిక చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద పవన్ ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించాల్సిన బాధ్యత దేవ్ పై పడింది. 2019 ఎన్నికలకు పార్టీని బ్యాక్ ఎండ్ లో నడపాల్సింది దేవ్ మాత్రమే. విజన్, స్ట్రాటజీ, రోడ్ మ్యాప్ లకు సంబంధించిన విది విధానాలను ఒక వారంలో రూపకల్పన చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి సంబంధించి దార్శనిక పత్రం లో తాము అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నారో చెబుతారు. దాదాపు ఎన్నికల ప్రణాళికను తలపించేలా వివిధ అంశాలపై జనసేన విధానాలపై ఇప్పటికే కసరత్తు చేశారు. వీటిని ఆసరా చేసుకుంటూ జనసేన వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల లక్ష్యాన్ని చేరుకోవడానికి రోడ్ మ్యాప్ ( ప్రచారం, సభలు, ప్రజలతో అనుసంధానం కావడం, బూత్ లనుంచి నియోజకవర్గాల వారీ గా అనుసరించాల్సిన ఎత్తుగడలపై క్యాడర్ కు శిక్షణ) పై కసరత్తు చేసేందుకు టీమ్ లను దేవ్ నేతృత్వంలో సిద్దం చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద జనసేనలో వేడి పుట్టించారు దేవ్.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News