పీకే లెక్క పక్కానా?

Update: 2018-07-10 15:30 GMT

ఆంధ్ర్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ సంచలనం సృష్టిస్తాడా? ప్రజారాజ్యం తరహాలోనే జనసేన పడకేస్తుందా? ఎవరి ఓటు బ్యాంకు కు చిల్లు పెడతారు? కింగ్ మేకర్ గా ఆవిర్భవిస్తారా? అదృష్టం కలిసొస్తే కర్ణాటకలో కుమారస్వామి తరహాలో కింగ్ గా రూపుదాలుస్తారా? అన్నీ ప్రశ్నలే. జనసేన కదులుతున్న తీరు, పార్టీ నాయకత్వం ఆలోచన, క్షేత్రస్థాయిలో బలం వంటివాటిని దృష్టిలో పెట్టుకుని రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిన్నామొన్నటివరకూ హైదరాబాదుకు పరిమితమైన కార్యకలాపాలను జనసేన ఏపీలో విస్తృతం చేస్తోంది. బలగాలను సమీకరించుకోవడం, స్థానిక నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తోంది. ఇందులో పక్కా ఎత్తుగడలతోనే వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలుగుదేశాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. వైసీపీ నేత జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీజేపీ విషయంలో తొలుత కనబరిచిన దూకుడు మందగించింది. వామపక్షాలతో సంబంధాలు పటిష్టపరచుకొనే క్రమంలో భాగంగా సెప్టెంబరు నుంచి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టాలనుకుంటున్నారు.

‘దేశం’ పై దూకుడు...

తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను మేగ్జిమమ్ తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని జనసేన చూస్తోంది. వైసీపీ,బీజేపీ పై విమర్శలు చేయడం లేదంటూ తెలుగుదేశం విరుచుకుపడుతోంది. ట్రాప్ లోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. జనసేన కాన్సంట్రేషన్ ను పక్కదారి పట్టించాలని టీడీపీ చూస్తోంది. అయితే ఈ వలలో చిక్కుకుంటే కొన్ని వర్గాలకు దూరమయ్యే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. టీడీపీ ని గెలిపించడంలో తన పాత్ర ఉంది కాబట్టి ఇప్పుడు తప్పుల విషయంలోనూ నిలదీయాల్సిన కర్తవ్యం తనపై ఉందంటున్నారు. బీజేపీకి ఇక్కడ పెద్దగా పాత్ర లేదు కాబట్టి దాని వ్యతిరేక ఓట్లు పట్టుకోవాలనే వ్యూహం ఫలించే అవకాశం లేదనేది జనసేన అంచనా. కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర బలహీన వర్గాలను ఆకట్టుకునే దిశలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బాదితులుగా మిగిలిపోయిన వారిని చేరువ చేసుకునేందుకు పవన్ స్వయంగా వారిని కలుస్తున్నారు. ఈ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటే ఓట్ల పర్సంటేజీ బాగా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రభుత్వ బాధితవర్గాలను కలవడంపై పవన్ ఎక్కువగా దృష్టి సారించారు.

జగన్ తో జర జాగ్రత్త...

వైసీపీ విషయంలో జనసేన సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ జనసేన వైసీపికి మద్దతు ఇస్తుందని బహిరంగంగానే ప్రకటన చేశారు. జనసేన దానిని ఇంతవరకూ ఖండించలేకపోయింది. వరప్రసాద్ తో ఒక సందర్బంలో చిట్ చాట్ లో తనకు జగన్ పై ఎటువంటి వ్యతిరేకత లేదని పవన్ చెప్పారు. దానిని ప్రాతిపదికగా తీసుకుంటూ ఈ తాజా మాజీ ఎంపీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. జనసేన దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. జనసేనకు 30 నుంచి 35 స్థానాలు లభిస్తాయని ఆ పార్టీ అంతర్గతంగా అంచనా వేసుకుంటోంది. టీడీపీ, వైసీపీలు 60 నుంచి 80 లోపు స్థానాలకు పరిమితమైతే జనసేన కీలక రాజకీయ శక్తిగా మారుతుందని భావిస్తున్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ పరస్పరం ఆగర్భశత్రువులుగా మారిపోయిన వాతావరణం నెలకొంది. త్రిశంకు శాసనసభ ఏర్పడితే పవన్ ప్రాముఖ్యం పెరిగిపోతుంది. పెద్దగా షరతులు లేకుండానే జనసేనను భుజాలమీదకు ఎక్కించుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో టీడీపీ కంటే వైసీపీ నే బెటర్ అనే ఉద్దేశం జనసేనలో ఉంది. టీడీపీ, వైసీపీ రాజకీయ అవసరాల కోసం జనసేనను ఆశ్రయించాల్సిందేనంటున్నారు. ఈలోపు జగన్ పార్టీ పట్ల ఆచితూచి వ్యహరించాలనేది పవన్ ఉద్దేశంగా చెబుతున్నారు.

కమలానికి కామ్రేడ్ల చెక్ ...

బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతలో ఎంతో కొంత భాగం జనసేనకూ అంటకట్టాలనే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. తద్వారా జనసేన దూకుడుకు కళ్లెం వేయాలనేది ఎత్తుగడ. అయితే కమ్యూనిస్టు పార్టీలు అండగా ఉన్నంతకాలం బీజేపీతో సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించరనే భరోసా వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. కామ్రేడ్లకు కమలం వాసన కూడా గిట్టదు. నిజానికి ఏడాది క్రితం వరకూ వైసీపీతో కొంత సన్నిహితంగా మెలిగేందుకు వామపక్షాలు ప్రయత్నించాయి. టీడీపీ, బీజేపీ కాంబినేషన్ ను రాష్ట్రంలో దెబ్బతీయాలంటే వైసీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పదనే అంచనాకు వచ్చారు. వైసీపీ చేపట్టిన అనేక కార్యక్రమాలకు మద్దతు పలికారు. ఆందోళనల్లోనూ పాల్గొన్నారు. అయితే ఏడాది కాలంగా వైసీపీ , బీజేపీకి చేరువ అవుతోందన్న సూచనలు కనిపించడంతో దూరం జరగడం మొదలు పెట్టారు. ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే జనసేన తో చెట్టాపట్టాలు వేసుకోవడం మొదలు పెట్టాయి వామపక్షాలు. సీపీఐ, సీపీఎంలు తనతో కలవడమే బీజేపీ నుంచి తనను రక్షించే కవచంగా పవన్ భావిస్తున్నారు. టీడీపీ విమర్శల దాడి తనను తాకకుండా వామపక్షాలు కాచుకొంటాయనే భరోసా తో ఉన్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News