ఆట ఆపిన పవన్....జడిపిస్తున్న జగన్...!

Update: 2018-06-13 15:30 GMT

రాజకీయ క్రీడలో కసి,పట్టుదల నిలువెల్లా ఉండాలి. ప్రజాసేవ చేయడానికే కాదు, తాను పదవిని అధివసించడానికి సైతం పంతం పట్టాలి. రాజకీయం సన్యాసం కాదు. ఔదార్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను చూసీ చూడనట్లు పోవడానికి. కొత్తగా రంగంలోకి దిగిన జనసేన లో ఆ దృఢ నిశ్చయమే కరవు అవుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చి ఎట్టకేలకు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టిన జనసేనాని పక్షం రోజులకే చాప చుట్టేయడం తో చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతోంది. రంజాన్ వేడుకల వంటి సాకులు చెబుతున్నప్పటికీ పర్యటన షెడ్యూలు ఖరారు చేసుకున్నప్పుడు ఈ విషయం తెలియదా? అనే వెక్కిరింతలు వినవస్తున్నాయి. రాజకీయం పులిజూదం వంటిదే . ఒకసారి ఎక్కిన తర్వాత గెలుపు సాధించేవరకూ స్వారీ చేస్తూనే ఉండాలి. లేకపోతే ఆ రాజకీయమే పార్టీ అడ్రస్ ను గల్లంతు చేస్తుంది. ప్రజారాజ్యం విషయంలో జరిగిందదే. ప్రజారాజ్యానికి , జనసేనకు స్థూలంగా కొన్ని పోలికలు, అంతరాలు ఉన్నాయి. నష్టదాయకమైన పోలికలను వదిలించుకుని బలం చేకూర్చే అంతరాలను పటిష్టం చేసుకుంటే పార్టీ బలోపేతమవుతుంది.

పగలు,రాత్రి బాబే...

సీజన్డ్ పొలిటీషియన్ చంద్రబాబునాయుడిలోని రాజకీయవేత్త పూర్తి స్థాయిలో నిద్ర లేచాడు. బీజేపీని వదిలించుకోవడం మొదలు తెలుగుదేశం వ్యవహారాలను చక్కదిద్దుకునే వరకూ అంతా ప్లాన్ ప్రకారం చేసుకుపోతున్నారు. ప్రజలు ఇంకోవైపు ఆలోచించకుండా పోరాట దీక్షలు, నవనిర్మాణాలు, మహాసభల పేరిట టీడీపీ హడావిడి మొదలు పెట్టేసింది. తాము చాలా కష్టపడు తున్నామన్న భావనను బలంగా ప్రజల్లోకి పంపుతున్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోతోందని చంద్రబాబు ప్రతిసభలోనూ పేర్కొంటున్నారు. 75 సభలకు రూపకల్పన చేశారు. వేలాది దీక్షలు సాగుతున్నాయి. ఇవన్నీ ఎన్నికలను ఉద్దేశించినవే. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం సాగిస్తున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేదు. నిరంతరం మథనం సాగుతోంది. నియోజకవర్గాల వారీ పార్టీలోని విభేదాలపై దృష్టి సారించారు. ఈ ఎన్నికలు పార్టీకి ఎంత అవసరమో నాయకులకే కాదు, కార్యకర్తలకు సైతం నూరిపోస్తున్నారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమంటూ ప్రజలనూ పరోక్షంగా ప్రలోభపెడుతున్నారు. నిధుల సమీకరణ, పార్టీ వ్యూహాల అమలు ఎలాగూ ఉంటుంది. సందర్భానికి, సమయానికి తగిన విధంగా ఎత్తులు, పొత్తులలో చంద్రబాబు దిట్ట. గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఆ ఎత్తుగడలే టీడీపీని గట్టెక్కించాయి. 2019కి కూడా ఆ రకమైన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాజకీయ యుద్ధంలో నాయకునిలో ఎంతటి పట్టుదల ఉండాలో చంద్రబాబును చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

జగన్ జడిపిస్తున్నాడు.....

మరోవైపు ప్రతిపక్షనాయకుడు జగన్ కాలికి బలపం కట్టుకుని ఊరూరూ తిరుగుతూ పరిస్థితులకు ఎదురీదుతున్నాడు. తన పాదయాత్రకు కోర్టుల నుంచి పూర్తిస్థాయి సహకారం లభించకపోయినా వెనుదిరగలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ, మళ్లీ మరుసటి రోజు ఉదయానికే ప్రజల మధ్య ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పాదయాత్ర విషయంలో ఒక కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇదంతా అధికారం కోసమేననేది నిర్వివాదాంశం. ప్రజల్లోకి వెళ్లే కొద్దీ వారి ఆలోచనలతో నాయకుడు మమైకమై పోతాడు. వై.ఎస్. విషయంలో 2003లో జరిగిందదే. ఇప్పుడు జగన్ కూడా అంతటి పట్టుదలతో పాదయాత్రను సాగిస్తున్నాడు. రాయలసీమలో ఎలాగూ పార్టీకి ఆదరణ ఉంది. అందువల్ల భారీ ప్రజాస్పందన సహజమే. కానీ ఉభయగోదావరి జిల్లాల్లో జగన్ కు జనం హారతి పట్టడం రాజకీయ పరిశీలకులకు సైతం అంతుచిక్కడం లేదు. ఈ జిల్లాలను రానున్న రాజకీయ ప్రభావాలకు దిక్సూచిగా చెబుతుంటారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు జనసేన, టీడీపీ గోదావరి జిల్లాలను శాసిస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ జగన్ పాదయాత్ర పట్ల ప్రజాస్పందన పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసేలా కనిపిస్తోంది. పర్యటనలో కనిపిస్తున్న ఉత్సాహం, ఉత్సుకత ప్రజల మూడ్ కు అద్దం పడుతోంది.

పార్టీ నిర్మాణమెక్కడ..?

కొత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చేందుకు అపూర్వ అవకాశం కలిగిన పార్టీ జనసేన. అధికార, ప్రతిపక్షాలు రెంటిలోనూ కొంత బలహీనత నెలకొంది. తెలుగుదేశం పార్టీ ప్రజలు ఆశించిన స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపలేకపోయింది. అవినీతి పెచ్చరిల్లింది. ఎన్నికల హామీల విషయంలోనూ వైఫల్యం కనిపిస్తోంది. విపక్ష వైసీపిని అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. దాని నాయకుడు జైలుకు వెళ్లకతప్పదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు భారీగానే నమ్ముతున్నారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు ఈ రెండు పార్టీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మిగిలిన సామాజిక సమీకరణలు కూడికలు తీసివేతలుగా ఉంటున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు జనాభా సంఖ్య రీత్యా చూస్తే పెద్ద ఎక్కువేమీ కాదు. కానీ జనసేనకు అండగా నిలుస్తుందని భావిస్తున్న కాపు సామాజిక వర్గం జనాభా 15 శాతం పైచిలుకు ఉంది. జనసేనకు ఇవన్నీ కలిసొచ్చే అంశాలు. కానీ ఇంతవరకూ పార్టీ నిర్మాణం లేదు. పవన్ పర్యటించినప్పుడు చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఓటరు కాదు. విషయ అధ్యయనం , సాంకేతిక పరిశీలనల వంటివి మేధావులు , పార్టీలోని ఆలోచన పరులు చూసుకోవాల్సిన అంశాలు. నాయకుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి. వారి నాడి పట్టుకోవాలి. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటూ , హామీలిస్తూ ప్రజలను ఆకట్టుకోవాలి. తన పార్టీ లోని మేధావులు ఇచ్చే సూచనల కంటే ప్రజలనుంచి వచ్చే స్పందనలే నాయకునికి ఆయువుపట్టు. జనసేన ఈ అంశాన్ని మిస్ అవుతోంది. వైసీపీ, టీడీపీలు పోల్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. పవన్ మొదలు పెట్టిన పోరాట యాత్రనూ మధ్యలో వాయిదా వేసుకున్నారు. పార్టీకి ఇది పెద్ద నష్టపూరిత చర్య. నాయకుడు ఎండ్ చూసేవరకూ విడిచిపెట్టకూడదు. ఆట ఆగితే సీట్లు గల్లంతవుతాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News