కాటమరాయునిపైనే కుట్రా...?

Update: 2018-05-04 14:30 GMT

కాపురం గుట్టు..రాజకీయం రట్టు అని సామెత.. వ్యక్తిగతంగా ఉండే కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో నానకూడదు. గోప్యత పాటించాలి. అదే ప్రజాసమస్యలు, రాజకీయ అంశాలు ప్రజలతోనే ముడిపడి బాగా ప్రచారం పొందాలి. ఇది జనసేనాని విషయంలో రివర్స్ గేర్ లో సాగుతోంది. సెలబ్రిటీ కావడంతో ఆయన కుటుంబ వ్యవహారాలు, వివాహాల వంటివన్నీ చర్చనీయమవుతున్నాయి. సానుకూల,ప్రతికూల వాదనలతో హోరెత్తుతున్నాయి. అయితే జనసేన వ్యవహారాలు మాత్రం అత్యంత గుంభనంగా సాగిపోతూ పార్టీకి సవాల్ విసురుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ స్ట్రాటజిస్టు దేవ్ ఉదంతం. తనకు నచ్చాడు. అంతే తెచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ , పనితీరు, పదిమందితో సంప్రతింపులు వంటివన్నీ పక్కనపెట్టేశాడు పవన్. ఫలితంగా పార్టీ వ్యూహాల్లో లోపముందనే అంచనాకు వచ్చేశారు పరిశీలకులు. పార్టీమొత్తం మెచ్చి సహకరించి పనిచేయాల్సిన వ్యూహకర్త విషయంలోనూ అనుమానమేఘాలు కమ్ముకోవడం దురదృష్టకరం. దీనిని పెద్దగా చేసి చూపేందుకు అధికార తెలుగుదేశం ఆగమాగం చేస్తోంది. వివరణ ఇచ్చుకోవాల్సిన ప్రతికూల ప్రచారానికి నెట్టివేయబడుతోంది జనసేన.

అటు పీకే ..ఇటు దేవ్

నటుడు శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ వంటివి నమ్మశక్యం కాని అంశాలే. అంతటి కుట్రలను రాజకీయ పార్టీలు చేజేతులారా అమలు చేసి స్వయం వినాశనం తెచ్చుకోవు. కానీ కమలనాథులు ప్రధాన రాజకీయ పార్టీలను తమ గుప్పెట పెట్టుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారా? అన్న సందేహాలు మాత్రం తలెత్తుతున్నాయి. ప్రశాంతకిశోర్ 2014లో బీజేపీకి ప్రధాన వ్యూహకర్త. ప్రత్యేకించి నరేంద్రమోడీకి సన్నిహితంగా సలహాలు, సూచనలతో ప్రచారాన్ని హోరెత్తించారు. సోషల్ మీడియాను శాసించారు. కాంగ్రెసులో రాహుల్ టీమ్ బెంబేలెత్తిపోవడానికి ప్రధాన కారకుడు పీకేనే. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జెడీ, కాంగ్రెసుల కూటమికి పనిచేశారు. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేసినట్లు చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత జేడీయూ మళ్లీ మోడీ చెంతకు బీజేపీ గూటికి చేరడంలో ప్రశాంతకిశోర్ దౌత్యం నెరపారనేది హస్తిన వర్గాల సమాచారం. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పట్ల బీజేపీకి తొలుత పెద్దగా సానుకూలత లేదు. కానీ ఏడాదికాలంగా ఈ వైఖరిలో క్రమేపీ మార్పు వస్తోంది. టీడీపీ ప్రజల్లో పట్టుకోల్పోతోందన్న ఇంటిలిజెన్సు సమాచారంతో వైసీపీని మచ్చిక చేసుకోవాలనే ఆలోచన కొచ్చేసింది బీజేపీ. దాదాపు అదే సమయంలో ప్రశాంతకిశోర్ ను జగన్ తమ పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఎంపిక చేసుకున్నారు. బీజేపీతో అంతర్గత లైజనింగుకు పీకే తోడ్పడ్డారనేది టీడీపీ వర్గాల హేతుబద్దమైన ఆరోపణ. విజయసాయి రెడ్డి ప్రధానిని కలవడం, కేంద్రంపై వైసీపీ ఆరోపణల స్థాయిని తగ్గించడం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలపై మంత్రిత్వశాఖల స్థాయిలో విచారణకు ప్రధాని కార్యాలయం సూచనలు చేయడం వంటివన్నీ తర్వాత కాలక్రమంలో చోటు చేసుకుంటూ వస్తున్నాయి. భవిష్యత్తులో వైసీపీ, బీజేపీ కలవాల్సి వస్తే ప్రధాన అనుసంధాన కర్తగా పీకే సేవలు ఉపయోగపడతాయనే భావనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బహిరంగంగానే ఇందుకు సంబంధించి సంకేతాలు పంపుతోంది. టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది. వైసీపీ పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ రెండుపార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం అయిదులక్షలు మాత్రమే నంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పడంలోని ఆంతర్యమిదే.

దూరం పెంచిన కాలం...

పవన్ కల్యాణ్ పదినెలలుగా దేవ్ తనకు సలహాలు,సూచనలు ఇస్తున్నారంటూ ప్రకటించారు. అంతకుముందు తెలుగుదేశానికి అన్నివిషయాల్లోనూ అండగా ఉంటూ వస్తున్న పవన్ అప్పట్నుంచే దూరం జరుగుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచినంతకాలం జనసేనకు మనుగడ లేదనే విషయాన్ని దేవ్ నూరిపోసి ఉండవచ్చనేది ఆరోపణ. కనీసం ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ స్థానంలోకి రావాలనుకున్నప్పటికీ టీడీపీని టార్గెట్ చేయకుండా సాధ్యం కాదు. తెలుగుదేశంతో మిత్రపక్షంగా కొనసాగితే పదో పరకో సీట్లతో సంతృప్తి పడాల్సి ఉంటుంది. పైపెచ్చు పాలకపక్షంగా టీడీపీ చేసిన తప్పులన్నిటికీ జనసేన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే స్వతంత్ర పక్షంగా బరిలోకి దిగితే కచ్చితంగా కింగ్ మేకర్ గా ఆవిర్భవించవచ్చు. 2024 నాటికి అధికారానికి పోటీ పడే పార్టీగా జనసేన రూపుదాలుస్తుందని విశ్లేషణలున్నాయి. టీడీపీలో కొత్తతరం రాజకీయం ప్రవేశించలేదు. వారసుడు లోకేశ్ సామర్థ్యాన్ని చంద్రబాబు వ్యూహనైపుణ్యంతో పోల్చలేం. అదే సమయంలో వైసీపీపార్టీ జగన్ పై ఉన్న కేసుల చిక్కుల నుంచి బయటపడలేదు. ఇవన్నీ అధికార,ప్రతిపక్షాలకున్న ఇబ్బందులు. బలహీనతలు. ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ 2024 నాటికి పూర్తిస్థాయిలో బలహీనపడటం ఖాయమనేది రాజకీయ జోస్యం. ఈ స్థితిలో బలమైన సామాజిక సమీకరణతో ఉన్న జనసేన ఒక ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తుంది. దీనిని పసిగట్టిన తర్వాతనే పవన్ టీడీపీకి క్రమేపీ దూరమవుతూ సవాల్ విసరడం ప్రారంభించారు. దేవ్ ఆలోచనలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లోనే అధికారానికి వచ్చే అవకాశముందని తన బృందాల సర్వేల్లో తేలిందని దేవ్ పవన్ కు సాధికారికమైన గణాంకాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజానిజాల సంగతెలా ఉన్నప్పటికీ దేవ్ చెప్పిన స్ట్రాటజీ నచ్చడంతో పవన్ అతనితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ సలహాలు, సూచనలు పాటిస్తూ వచ్చారు. అయితే తాజాగా దేవ్ గతంలో బీజేపీకి వ్యూహకర్తగా కాకుండా ఒక కార్యకర్తగా పనిచేశారనే విషయం ప్రచారంలోకి రావడంతో జనసేన ఆత్మరక్షణలో పడిపోయింది. పవన్ కల్యాణ్ ను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి దేవ్ ను బీజేపీ ఒక అస్త్రంగా ప్రయోగించిందా? అనే అనుమానాలను టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెస్తోంది. ఇది జనసేనను భారీగానే డ్యామేజీ చేయవచ్చు. వ్యూహకర్తగా ప్రశాంతకిశోర్ కున్న రక్షణ దేవ్ కు కనిపించడం లేదు. పీకే ఏ పార్టీతోనూ నేరుగా మిలాఖత్ అయినట్లు ఆధారాల్లేవు. వృత్తిపరమైన సంబంధాలనే బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దేవ్ విషయంలో బీజేపీ శ్రేణులతో మమైకమైన వీడియోలు బయటికి వచ్చాయి. రాజకీయ గబ్బర్ సింగ్ దీనికి ఏం బదులిస్తారో వేచి చూడాలి. ఎలా తిప్పికొడతారో కాలమే తేల్చాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News