పాలిటిక్స్ లో పట్టాభి ఒక ఎగ్జాంపుల్

రాజకీయాల్లో ఎదగాలంటే విపక్షంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తన సత్తా ఏంటో చాటి చెప్పాలన్నా అది అప్పోజిషన్ లో ఉన్నప్పుడే వీలవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. అదే [more]

Update: 2021-09-02 09:30 GMT

రాజకీయాల్లో ఎదగాలంటే విపక్షంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తన సత్తా ఏంటో చాటి చెప్పాలన్నా అది అప్పోజిషన్ లో ఉన్నప్పుడే వీలవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. అదే విపక్షంలో సరైన రీతిలో స్పందిస్తూ ఉంటే రాజకీయంగా ఎదుగుదల సాధ్యమవుతుంది. టీడీపీ నేత పట్టాభిరామ్ విషయంలో ఇది కరెక్ట్ అని చెప్పాలి. తక్కువ కాలంలో అంటే కేవలం రెండేళ్లలోనే పట్టాభి టీడీపీలో కీలక నేతగా మారారు. వైసీపీ పంటి కింద రాయిలా మారారు.

అనేకమంది సీనియర్లున్నా…

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కానీ ఎవరూ వైసీపీ ప్రభుత్వంపైన విరుచుకుపడే, విమర్శలు చేసే సాహసం చేయలేదు. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన టీడీపీ నేత పట్టాభిరామ్ మాత్రం దూకుడుతో వ్యవహరిస్తున్నారు. పట్టాభి నిజంగా రాజకీయాల్లో చాలా జూనియర్. ఆయనకు పార్టీలో పదవులు తప్ప ఎలాంటి ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దక్కలేదు. అయినా విపక్షంలోకి వచ్చిన తర్వాత పట్టాభి చూపిస్తున్న తెగువను చంద్రబాబు సయితం మెచ్చుకోకుండా ఉండేలేకపోతున్నారు.

కొద్ది కాలంలోనే….

పట్టాభి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన విజయవాడలో సెటిల్ అయ్యారు. తొలుత టీడీపీ సానుభూతిపరుడిగా ఉన్న పట్టాభి తర్వాత పార్టీలో క్రియాశీలకంగా మారారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పట్టాభి పెద్దగా ఎదగలేకపోయారు. ఆయన పేరు కూడా పెద్దగా ఎక్కడా వినపడేది కాదు. కానీ ఎప్పుడైతే అధికారాన్ని టీడీపీ కోల్పోయిందో అప్పటి నుంచే పట్టాభి పేరు ప్రముఖంగా పార్టీలో విన్పించడం స్టార్టయింది.

పక్కా లెక్కలతో….

మీడియా సమావేశాలు కాని, టీవీ డిబేట్లలో కాని పట్టాభి లేవనెత్తుతున్న ప్రశ్నలు కొంత ఆలోచన కల్గించేవిగా ఉన్నాయి. ఆయన విమర్శలు చేసినా పక్కాగా, లెక్కలతో సహా చెబుతుండటం పార్టీ నేతలను సయితం ఆకర్షిస్తుంది. ఒక అంశంపై మాట్లాడే ముందు పట్టాభి దానిపై పూర్తిగా కసరత్తు చేసి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబు కంటే ముందు పట్టాభిని టార్గెట్ చేస్తుండటం విశేషం. రాజకీయాల్లో అతి తక్కువ కాలంలో ఎదగడానికి ఏం చేయాలన్న దానికి పట్టాభి ఉదాహరణగా చెప్పుకోవాల్సిఉంటుంది. భవిష్యత్ లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి పదవి లభిస్తుందన్న కామెంట్స్ పార్టీ నేతల నుంచే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News