పుల్లన్న రాజీ ప్రయత్నాలు మొదలెట్టారా?

టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కంటికి కన్పించడం లేదు. తమ చేత భూములిప్పించడంలో కీలక పాత్ర పోషించి కీలక సమయంలో థోకా ఇచ్చాడని రాజధాని రైతులు [more]

Update: 2020-09-17 03:30 GMT

టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కంటికి కన్పించడం లేదు. తమ చేత భూములిప్పించడంలో కీలక పాత్ర పోషించి కీలక సమయంలో థోకా ఇచ్చాడని రాజధాని రైతులు సయితం విమర్శలు చేస్తున్నారు. పత్తిపాటి పుల్లారావు గత కొంతకాలంగా నియోజకవర్గానికి, జిల్లాకు దూరంగా ఉంటున్నారు. ఐదేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన పత్తిపాటి పుల్లారావు తనపై ఎలాంటి కేసులు లేకుండా ఉండేందుకు రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

భూ సమీకరణలో…..

పత్తిపాటి పుల్లారావు ఐదేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు, లోకేష్ కు సన్నిహితులుగా ఉన్నారు. ప్రధానంగా అమరావతి రాజధానిలో భూ సమీకరణ విషయంలో పత్తిపాటి పుల్లారావు కీలక పాత్ర పోషించారు. రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలను రాజధానికి ఇవ్వడంలో పత్తిపాటి పుల్లారావు ముఖ్య భూమిక పోషించారు. రైతులతో ఆయన తరచూ సమావేశమై ఒప్పించగలిగారు. అలాంటి పత్తిపాటి పుల్లారావు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైసీసీ సీనియర్ నేతతో….

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పత్తిపాటి పుల్లారావు వైసీపీలో ఉన్న సీనియర్ నేతతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయనతో రాజీ ఒప్పందం కుదుర్చుకున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది. ఇప్పటికే పత్తిపాటి పుల్లారావుపై రాజధాని భూముల విషయంలో కేసులు నమోదయి ఉన్నాయి. తనను కేసుల నుంచి తప్పించాలని, తాను పార్టీకి దూరంగా ఉంటానని రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీలోనే చర్చ జరుగుతోంది.

కేసులకు భయపడేనా?

మరోవైపు పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. తనను ఎన్నికల్లో టీడీపీలోని ఒక వర్గం ఓడించిందని అభిప్రాయంలో ఉన్నారు. ఆర్థికంగా కూడా నష్టపోయిన పత్తిపాటి పుల్లారావు టీడీపీ పరిస్థితి బాగా లేదని గ్రహించి దూరంగా ఉన్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. రెండు సార్లు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన పత్తిపాటి పుల్లారావు ఇప్పుడు పార్టీని పట్టించుకోక పోవడం చర్చనీయాంశమైంది. కేసులకు భయపడే పత్తిపాటి పుల్లారావు బయటకు రావడం లేదని కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News