బరిలో గురి తప్పితే..?

పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు సహా తృణమూల్ వంటి పార్టీలు గురి తప్పినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో పెద్ద వేదికలు లోక్ సభ, రాజ్యసభలు. ఇక్కడ ప్రధాని [more]

Update: 2021-07-24 16:30 GMT

పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు సహా తృణమూల్ వంటి పార్టీలు గురి తప్పినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో పెద్ద వేదికలు లోక్ సభ, రాజ్యసభలు. ఇక్కడ ప్రధాని సహా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్టు సహా మిగిలిన ప్లాట్ ఫారాలపై లేని స్వేచ్ఛ చట్టసభల సొంతం. సర్కారును అడుగు ముందుకు వేయకుండా నిరోధించవచ్చు. అయితే ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. పార్టీల స్వార్థం, ప్రజలకు నేరుగా సంబంధం లేని అంశాలతో సమయం వృథా చేస్తే ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. పైకి ప్రభుత్వం మాట్టాడలేకపోతున్నట్టు కనిపించినప్పటికీ అంతిమంగా రిలీఫ్ ఫీలవుతుంది. ఎందుకంటే దేశాన్ని పట్టి కుదిపేసే అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. చాలా అంశాలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవు. వీటిపై ప్రజలను ఆలోచింప చేసేందుకు , ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పార్లమెంటు ను మించిన వేదిక లేదు. అయితే సమావేశాలు మొదలైనప్పట్నుంచి సీరియస్ గా సామాన్యుని అంశాలపై ప్రతిపక్షాలు దృష్టి పెట్టడం లేదు. రాజకీయ ప్రయోజనాలకు గురి పెడుతూ రచ్చ చేస్తున్నాయి. ఫలితంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రజాసమస్యలు అప్రాధాన్య అంశాల జాబితాలో చేరిపోయాయి.

గుడ్డెద్దు చేలో పడ్డట్టు…

తాజా సమావేశాల్లో ఫెగాసస్ నిఘా అనేది పెద్ద అంశంగా మారిపోయింది. దేశంలో వెయ్యి మందిపై నిఘా పెట్టినట్లు నిర్దరణ కాని వార్తలు వెలువడ్దాయి. అందులో కేవలం 22 మందికి సంబంధించిన అంశంలో ఆధారాలు ఉన్నట్లు కొన్ని సోషల్ మీడియా వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిని ఆధారంగా చేసుకుంటూ ప్రతిపక్షాలు గొడవ మొదలు పెట్టాయి. నిజానికి ఈ వ్యవహారం ప్రజలకు పెద్దగా సంబంధం లేదు. రాజకీయ పరమైన అంశం. దీనిని పూర్తిగా పరిశీలించేందుకు స్థాయి సంఘం సరిపోతుంది. పైపెచ్చు ఈ వ్యవహారాలు చూసే స్టాండింగ్ కమిటీకి కాంగ్రెసు నేత శశిథరూర్ నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖను, ఇంటిలిజెన్స్ వ్యవస్థను నిలదీసి ప్రశ్నించే అధికారం స్టాండింగ్ కమిటీకి ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఒక అంశంగా పార్లమెంటులో తీసుకుంటే ఫర్వాలేదు. కానీ మొత్తం దేశం అతలాకుతలమైపోతున్నట్లు దీనిపైనే దృష్టి పెడితే మిగిలిన కీలక విషయాలు మరుగున పడతాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమకు దొరికిన అవకాశాన్ని , వేదికను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్లే కనిపిస్తోంది.

కామన్ మేన్ కనెక్టు…

దేశంలోని ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిన అంశం పెట్రో ధరలు. రవాణాకు, సామాన్యుని జీవితానికి ఇంధనం తప్పనిసరి. సొంత వాహనాలు లేకపోయినా ధరల ప్రబావం పడుతుంది. కూరగాయలు మొదలు నిత్యావసరాల వరకూ పెరిగిపోయాయి. ఇందులో పెట్రోలియం రేట్ల ప్రభావం ఉంది. ఒక రకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ధరలను పెంచుకుంటూ పోయి దోపిడీ సాగిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపి చూస్తే నెలకు 50 వేల కోట్ల రూపాయల వరకూ పెట్రోలియం ఉత్పత్తుల నుంచి ప్రభుత్వాలకు లభిస్తున్నాయి. లీటర్ వంద రూపాయలు దాటిపోయింది. అలాగే కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్రం ఉదాసీనంగా ఉంటోంది. ఇవి ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలు. ప్రతిపక్సాలు పూనుకుని పార్లమెంటులో నిలదీస్తే ప్రజల్లోనూ ఆసక్తి వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలనుకుంటున్న ఉద్దేశానికి ప్రజామద్దతు లభిస్తుంది. ఫెగాసస్ లాంటి విషయాలపై ఎంతటి గొడవ చేసినా ప్రజలకు పట్టదు. పైపెచ్చు ఆయా పార్టీల వ్వవహారంలోనే ఏదో తేడా ఉందని బావించే ప్రమాదమూ ఉంది.

కమలం నవ్వులు…

విపక్షాల దుందుడుకు అజెండాతో కేంద్రం అంతర్గతంగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. పార్లమెంటును నడపాల్సిన బాధ్యత కేంద్రానిది. అందువల్ల ఇబ్బంది పడుతున్నట్లు నటించినా నిజానికి ప్రజా సమస్యలు తమను ఇబ్బందిపెట్టకపోవడం వారికి హ్యాపీనే. వ్యవసాయచట్లంపై బయట ఆందోళనలు సాగుతున్నాయి. విద్యుత్ సంస్కరణల చట్టం ఉరుమురిమి చూస్తోంది. రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. ధరలు, వాక్సినేషన్ ప్రక్రియలో జాప్యం, కరోనా ప్యాకేజీ అమలులో అవకతవకలు, అంకెల గారడీ వంటివి పార్లమెంటులో పెద్దగా చర్చకు రావడం లేదు. వస్తే కేంద్ర సర్కారుకు తడబాటు తప్పదు. ఒకవేళ సామాన్య ప్రజల అంశాలు పార్లమెంటును కదిలించకపోతే ప్రతిపక్షాలదే పెద్ద తప్పు అవుతుంది. ప్రభుత్వం ఎలాగూ తప్పించుకునే ధోరణిలోనే ఉంటుంది. అందువల్ల ప్రతిపక్సాలను ఆదరించాల్సిన ఒక అజెండాను కామన్ మేన్ ముందు ఉంచాలి. అందుకు వారి సమస్యలపై చట్టసభల్లో గళమెత్తడానికి మించిన ప్రచారాస్త్రం ఉండదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News