సీన్ క్లియర్...!

Update: 2018-08-10 15:30 GMT

గడచిన ఏడాదికాలంగా గడబిడగా తయారైపోయింది చట్టసభల నిర్వహణ. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మాత్రం సంతృప్తికరంగా సాగాయి. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఫలవంతమైన చర్చ ఒకటి కూడా లేకుండా ముగిసిపోయిన సెషన్లే ఎక్కువ. 25 లక్షల కోట్లరూపాయల నిధుల వినియోగానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలనే బరాబర్ జబర్దస్త్ గా ముగించేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల వరకూ ఇదే తంతు కొనసాగుతుంది. ప్రజాస్వామిక చర్చ కల్లే అనుకుంటున్న పరిస్థితిలో డెమొక్రటిక్ స్పిరిట్ నిలబెట్టింది ఈ సెషన్. అత్యున్నత వేదిక ఆరోగ్యదాయకమైన రీతిలో నడిస్తేనే ప్రయోజనం. ప్రభుత్వ వాదన వీగిపోతుందా? ప్రతిపక్షం వాదన పల్టీ కొడుతుందా? అన్నది కాదు ముఖ్యం. 130 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులైన ఎంపీలు కొంతైనా సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారా? లేదా ? అన్నదే ముఖ్యం. దీనికి సమాధానం చెప్పాయి వర్షాకాల సమావేశాలు. అనేక చట్టాలు చేశాయి. ప్రభుత్వ ప్రతిపక్షాల రాజకీయ బలాబలాల నిగ్గు తేల్చాయి. కొన్ని సందర్భాల్లో దారితప్పినట్లు కనిపించినా బిజినెస్ ఫలవంతం కావడం ప్రజాస్వామ్యానికి మేలు చేసే పరిణామమే.

అవిశ్వాసం ..పెంచిన ఆత్మవిశ్వాసం..

బడ్జెట్ సెషన్ లో అవిశ్వాస తీర్మానాన్ని పూర్తిస్థాయిలో ప్రతిఘటించింది అధికారపార్టీ. ప్రతిపక్షాలకు మైలేజీ ఇవ్వకూడదనే ఉద్దేశంతో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ వంటి పార్టీల సహకారంతో విజయవంతంగా అవిశ్వాసాన్ని నిరోధించగలిగింది. కానీ మొత్తం ఎత్తుగడ ప్రజల ముంగిట్లో బట్టబయలైంది. ప్రజాస్వామ్యం పరిహాసాస్పదంగా మారింది. వార్షిక వ్యయ ప్రణాళికపై వాదోపవాదాలు లేకుండా ప్రభుత్వం గంపగుత్తగా బిల్లులను గిలెటిన్ చేసుకోగలిగింది. పార్లమెంటు ప్రధాన విధిని బాధ్యతాయుతంగా నిర్వర్తించలేకపోయింది. దీనంతటికీ ప్రధాన కారణం బీజేపీ మొండివైఖరి. రాజకీయ పెంకితనం. తొమ్మిది పార్టీలు నోటీసులు ఇచ్చినా పక్కనపెట్టేయడం చిన్న విషయం కాదు. దీంతో స్పీకరు స్థానంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అధికార పార్టీ పట్టించుకోలేదు. ఈసారి అటువంటి నియంతృత్వ పోకడకు పోకుండా అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించి చర్చపెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ప్రతిపక్షాలకు లభించింది. తాము చేసిన ఘన కార్యాలను చెప్పుకునే అవకాశం బీజేపీకి దక్కింది. ఎవరేమిటో రానున్న ఎన్నికల్లో తేల్చేందుకు లిట్మస్ టెస్టులా ప్రజలకు ఉపయోగపడింది.

గోడ మీద పిల్లివాటంలా......

గోడమీద పిల్లివాటంగా తెలివితేటలు ప్రయోగిస్తున్న పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి. అధికారపక్షంతో అంటకాగుతూనే వేర్వేరు కారణాలతో తమకు కమలం పొడగిట్టదని చెప్పుకునేందుకు ఇష్టపడుతుంటాయి. ఆయా పార్టీల అసలు రంగు తేటతెల్లమైపోయింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ,టీఆర్ఎస్ లు బీజేపీతో వ్యవహరించే విషయాల్లో స్పష్టత కోల్పోయి కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు సానుకూలంగా ప్రవర్తిస్తూనే ప్రజల ముందు మరోలా నిరూపించు కోవాలనుకుంటున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాసం, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల ఘట్టాల్లో టీఆర్ఎస్ స్టాండ్ పూర్తిగా బయటపడిపోయింది. అవునన్నా కాదన్నా కమల నాథులతో వైరానికి సిద్దంగా లేదని తేలిపోయింది. కేంద్రానికి ఎటువంటి సాంకేతిక ఇబ్బంది తలెత్తినా తామున్నామనే భరోసానిచ్చింది. హైకోర్టు విభజన, రిజర్వేషన్లు, సెక్రటేరియట్ కు రక్షణశాఖ స్థలం, కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాల్లో కేంద్రం స్పందించడం లేదు. అయినా రాజకీయంగా లెక్కలు వేసుకుంటూ టీఆర్ఎస్ బీజేపీకి సహకరించింది. బీజేపీ దక్షిణాదిన ఒక పరోక్ష మిత్రుడుని సాధించుకోగలిగింది. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ లు కేంద్రంలో కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదనే సంకేతాలు ప్రబలంగా వెలువడ్డాయి. ఈ విషయంలో బీజేపీ కంటే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం. 12 శాతం పైచిలుకు ఉన్న ముస్లిం ఓట్లపై ప్రభావం పడవచ్చు. అయినా రిస్కుకు సాహసించి ముందడుగు వేసిందంటే పొలిటికల్ మైలేజీని మించిన అవసరాలున్నట్లే లెక్క.

వైసీపీకి వడ్డించిన విస్తరి కాదు...

ముందుగానే రాజీనామా చేయడంతో కేంద్రసర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం లేకుండా వైసీపీ గట్టెక్కింది. కానీ రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో మళ్లీ తలబొప్పి కట్టించుకుంది. అధికారపార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెసు కు మద్దతిస్తామంటూ ముందుగా ప్రకటించింది. దీనిపై బీజేపీ నుంచి గట్టిగానే హెచ్చరికలు జారీ అయినట్లు తెలిసింది. దాంతో స్టాండ్ మార్చుకుని తటస్థ వైఖరికి వచ్చేసింది. తద్వారా అధికారపక్ష అభ్యర్థికి సహకరించింది. ఇలా కుప్పిగంతులు వేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధికి వినియోగించుకుంది. బీజేపీని వ్యతిరేకించడం వైసీపికి రాజకీయావసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటును ఓటు బ్యాంకుగా మలచుకోవాలంటే ఇది తప్పనిసరి. కానీ బీజేపీని టార్గెట్ చేయడానికి వైసీపీ సాహసించడం లేదు. కమలం పార్టీ పరోక్షంగా జగన్ కు అస్త్రాలు అందిస్తున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేకపోతోంది. జగన్ కేసుల్లో భార్య భారతిపై ఈడీ కేసు నమోదు చేయడం వైసీపీకి పెద్ద దెబ్బే. కానీ బీజేపీతో సంబంధాలు లేవని వైసీపీ వాదించుకోవడానికి ఇదో బ్రహ్మాస్త్రం. కానీ కాంగ్రెసును, చంద్రబాబును ఈవిషయంలో కూడా తప్పు పట్టడం ద్వారా మరోసారి వైసీపీ మరోసారి పప్పులో కాలేస్తోంది. బీజేపీకి శత్రువుగా ప్రజలముందు తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతున్నప్పటికీ వైసీపీకి 2019 ఎన్నిక వడ్డించిన విస్తరి కాబోవడం లేదు. వర్షాకాల సమావేశాల్లో వైసీపీ కేంద్రం పట్ల వ్యతిరేకతను బలంగా నిరూపించుకోలేక తన పాత్రను తానే కుదించుకుంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News