పరిటాలకు ఫ్యామిలీ ప్యాక్.. ఓకే అన్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల వ్యూహాన్ని మార్చనుంది. ప్రధానంగా రాయలసీమలో పట్టు సంపాదించడం కోసం చంద్రబాబు కూడా మెట్టు దిగివస్తున్నట్లే కనపడుతుంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పరిటాల [more]

Update: 2021-04-28 03:30 GMT

తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల వ్యూహాన్ని మార్చనుంది. ప్రధానంగా రాయలసీమలో పట్టు సంపాదించడం కోసం చంద్రబాబు కూడా మెట్టు దిగివస్తున్నట్లే కనపడుతుంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ టీడీపీకి తొలి నుంచి అండగా ఉంటూ వస్తుంది. గత ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లోనే పరిటాల ఫ్యామిలీ చంద్రబాబును రెండు సీట్లు అడిగినా ఆయన తిరస్కరించారు.

రెండు సీట్లు ఇచ్చేందుకు….

అయితే ఈసారి పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వచ్చిన సంకేతాలతో పరిటాల కుటుంబం మళ్లీ యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడులో ఈసారి తాను పోటీ చేయనున్నట్లు పరిటాల సునీత సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది.

ధర్మవరం నుంచి….

అదే సమయంలో పరిటాల శ్రీరామ్ సయితం ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతగా ఉన్న వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో అక్కడి ఇన్ ఛార్జిగా చంద్రబాబు పరిటాల శ్రీరామ్ ను నియమించారు. ఈసారి ఎన్నికల్లో పరిటాల కుటుంబంలో ఇద్దరికీ టిక్కెట్లు ఇస్తామన్న చంద్రబాబు ఇచ్చిన హామీతో పరిటాల సునీత తిరిగి రాప్తాడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

సునీత అయితేనే?

పరిటాల సునీతకు సానుభూతి పనిచేస్తుందని, ఆమె అయితేనే అక్కడ విజయం సాధిస్తుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. అందుకే రెండు నియోజకవర్గాలపై దృష్టి పెట్టి క్యాడర్ ను బలోపేతం చేయాల్సిందిగా పరిటాల సునీతకు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికలలో పరిటాల సునీత పోటీకి దూరంగా ఉండి, తనయుడు శ్రీరామ్ కోసం టిక్కెట్ ను త్యాగం చేశారు. ఈసారి మాత్రం పరిటాల సునీత పోటీకి సిద్దమయ్యారని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఈసారి పరిటాల ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ సిద్ధం చేశారు.

Tags:    

Similar News