Paritala : చూసేవన్నీ నిజం కావు.. కళ్లు కూడా మోసం చేస్తాయ్

అద్భుతాలు ఎన్నైనా జరగొచ్చు. అవి మనకు సంతోషంగా కన్పించవచ్చు. కానీ చూసేవన్నీ నిజం కావు. విన్నవన్నీ వాస్తవాలు కాదు. రాజకీయాల్లో ఇది అక్షర సత్యం. నిన్న జేసీ [more]

Update: 2021-11-11 08:00 GMT

అద్భుతాలు ఎన్నైనా జరగొచ్చు. అవి మనకు సంతోషంగా కన్పించవచ్చు. కానీ చూసేవన్నీ నిజం కావు. విన్నవన్నీ వాస్తవాలు కాదు. రాజకీయాల్లో ఇది అక్షర సత్యం. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ ఆలింగనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకేముంది అద్భుతం జరిగిపోయిందంటూ అనుకూల మీడియా ఆకాశానికెత్తింది. అంతటితో ఆగలేదు. ఇక అనంతపురం జిల్లాలో టీడీపీకి తిరుగులేదన్న రీతిలో బిల్డప్ ఇచ్చింది.

గతంలోనూ ఇలాగే…

గతంలో ఎన్ని చూడలేదు. బద్ధ శత్రువులు కలుసుకున్న ఘటనలు అనేకం. కానీ ఏం లాభం. ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరివీ వేర్వేరు దారులే. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తిలను చంద్రబాబు స్వయంగా కలిపారు. ఇద్దరూ ఒకటైతే తిరుగుండదన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరపడినట్లే నని చెప్పారు. కానీ ఏమయింది? ఫలితాలు అలా వచ్చాయా? ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోక అందరూ ముఖానికి గుడ్డ వేసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు అక్కడ దిక్కేదీ?

జమ్మలమడుగులోనూ అంతే. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను కలిపామని, ఇక అక్కడ తమకు తిరుగుండదని చంద్రబాబు భావించారు. కానీ తర్వాత చంద్రబాబే చూశారు. ఇద్దరూ పార్టీని వీడిపోయారు. ఇప్పుడు జమ్మల మడుగులో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. ఇప్పుడు జేసీ బ్రదర్స్ పరిస్థితి కూడా అంతే. కాల్వ శ్రీనివాసులు ప్రాధాన్యత తగ్గించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సీన్ క్రియేట్ చేశారని అనేవారూ లేకపోలేదు.

టైం బాగా లేక….

కడుపులో కత్తులు.. నొసటిపైన నవ్వులు రాజకీయాల్లో మామూలే. జేసీ బ్రదర్స్ టైం ప్రస్తుతం బాగా లేదు. వారు పార్టీలో ఒంటరయ్యారు. తమకు పట్టు దొరికిందాకా కౌగిలించుకుంటూనే ఉంటారు. అందుకే పరిటాల శ్రీరామ్ ను జేసీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశారు. జేసీ మనస్తత్వమే అంత. అంతే తప్ప ఆ రెండు కుటుంబాలు రాజకీయంగా కలిసినా మనసులు కలవవన్నది జగమెరిగిన వాస్తవం. అందుకే చూసే ఫొటోలను నమ్మకండి. వెయిట్ చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది.

Tags:    

Similar News