పరిటాలకి అంత ఈజీ కాదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని హాట్ సీట్లలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ మొదటిసారి [more]

Update: 2019-03-25 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోని హాట్ సీట్లలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు పోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ ను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన పరిటాల కుటుంబంపై పోటీలో ఉండటం ఇది మూడోసారి. గత రెండు ఎన్నికల్లో ఆయన పరిటాల సునీతపై పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా రాప్తాడులో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆయన కంకణం కట్టుకున్నారు. ఇక, పరిటాల రవి వారసుడు శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తుండటంతో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పరిటాల సునీతతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. జనసేన సహా మిగతా పార్టీల ఉనికి ఇక్కడ పెద్దగా లేకపోవడంతో ఈ ఇద్దరు మధ్యే పోటీ హోరాహోరీగా ఉండనుంది.

మళ్లీ పాత కుటుంబాల మధ్యే పోరు

పెనుగొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు పరిటాల రవి, సునీత విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వారికి స్వంత మండలం రామగిరితో పాటు వారికి ఎక్కువ పట్టున్న ప్రాంతాలు రాప్తాడు నియోజకవర్గంలో చేరడంతో పరిటాల సునీత ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. 2009లో ఆమె అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డిపై 1,707 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా ఆయనపై సునీత 7,774 ఓట్లతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఇక్కడ పరిటాల కుటుంబంతో పాటు తోపుదుర్తి కుటుంబం కూడా బలంగా కనిపిస్తోంది. దీంతో మరోసారి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండనుంది. పరిటాల సునీత మంత్రిగా ఈ ఐదేళ్ల కాలం నియోజకవర్గంలో అభివృద్ధి బాగా చేయగలిగారు. నియోజకవర్గానికి సాగునీరు తీసుకువచ్చారు. దీంతో పాటు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు కలిసొస్తాయని భావిస్తున్నారు. పరిటాల వారసుడిగా శ్రీరామ్ మొదటిసారి పోటీ చేస్తున్నందున రవిపై ఉన్న అభిమానాన్ని ప్రజలు శ్రీరామ్ పైన చూపుతారని భావిస్తున్నారు.

కుటుంబ పాలన అనే ఆరోపణలు

అయితే, కుటుంబ పాలన చేస్తున్నారని, సునీత సోదరుల ఆధిపత్యం ఎక్కువైందనే ఆరోపణలు పరిటాల శ్రీరామ్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది. పలువురు నేతలు వీరి కుటుంబ ఆధిపత్యాన్ని నిరసిస్తూ బయటకు వచ్చేసి వైసీపీలో చేరిపోయారు. ప్రచారంలో టీడీపీ నేతల వైఖరి కూడా ఇటీవల వివాదాస్పదమైంది. పలువురు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ ను గెలిపించకపోతే ఇబ్బందులు ఎదుర్కుంటారని ప్రజలను బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. ఇవి కూడా శ్రీరామ్ కు నష్టం చేసే అవకాశం ఉంది. ఇక, వైసీపీ అభ్యర్థి ప్రకాశ్ రెడ్డికి రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఉంది. ఆయన అధికారంలో లేకున్న ఫౌండేషన్ స్థాపించిన సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రజల్లో గుర్తింపు పొందారు. బోర్లు వేయించడం, మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం ఆయనకు మేలు చేయవచ్చు. పలువురు టీడీపీ నేతలు వైసీపీలోకి రావడం కలిసొచ్చే అవకావం ఉంది.

బీసీలు ఎటు వైపు ఉంటారో..?

కాగా, పరిటాల కుటుంబంతో ఢీ అంటే ఢీ అనే తోపుదుర్తి సోదరుల వ్యవహారశైలి పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. ఇక, నియోజకవర్గంలో కమ్మ సామాజకవర్గం ఎక్కువగా ఒకరి వైపు, రెడ్డి సామాజకవర్గం ఎక్కువగా మరొక అభ్యర్థి వైపు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. కురబ, ఇతర బీసీ సామాజకవర్గాలు ఎక్కువగా ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. ఎప్పుడూ టీడీపీ వైపే ఎక్కువగా ఉండే బీసీల్లో వైసీపీకి కొంత ఆధరణ పెరిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి మొదటి ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు.

Tags:    

Similar News