ఆయనొక్కడు చాలట.. అంతా చూసుకుంటాడట

జగన్ కి ఇపుడు పట్టిందల్లా బంగారంలా సాగిపోతోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ పొలిటికల్ గా చూస్తే జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో [more]

Update: 2020-03-11 02:00 GMT

జగన్ కి ఇపుడు పట్టిందల్లా బంగారంలా సాగిపోతోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ పొలిటికల్ గా చూస్తే జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం ఖాయమని అన్ని సర్వేలూ, విపక్షాలు సైతం ఘోషిస్తున్న నేపధ్యంలో జగన్ జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. జగన్ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురి అభ్యర్ధులలో పరిమళ్ నత్వాని ఒక్కడు చాలు జగన్ ని రాజకీయ అదృష్ట పీఠంపైన చాన్నాళ్ళు కూర్చోబెట్టడానికి అని విశ్లేషణలు వస్తున్నాయి. పరిమళ్ నత్వాని అతి సాధారణంగా కనిపించినా దేశ రాజకీయాలను ఒంటిచేత్తో తిప్పగలిగే సత్తా ఉన్న నేతగా చెబుతున్నారు. ఓ విధంగా జాతీయ రాజకీయాల్లో బిగ్ ఫిగర్ అంటున్నారు.

ఆధారమేనా…?

జగన్ ఎక్కడో ఏపీలో ఉన్నారు. మోడీ ఢిల్లీలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన బంధం కుదిర్చే దారం, ఆధారం నత్వానీ అంటున్నారు. ఆయన గుజరాత్ కి చెందినవారు. పైగా దశాబ్దాలుగా మోడీ, అమిత్ షాలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన వారు. ఆ ఇద్దరి దగ్గర నత్వానికి ఉన్నంత చనువు ఎవరికీ లేదని అంటారు. ఆయన ఇపుడు వైసీపీ టికెట్ మీద ఎంపీ అవుతున్నారు. అంటే జగన్ మనిషిగా ఆయన‌ పెద్దల సభలో ముద్ర వేసుకుంటున్నారు. ఇది జగన్ కి ఎంతో లాభకరమైన పరిణామమని అంటున్నారు. జగన్ కి డైరెక్ట్ గా మోడీ, షాలతో నత్వానీ ద్వారా గట్టి బంధమే పడిపోయిందని చెబుతున్నారు.

రాజకీయంగా….

ఏపీ వరకూ చూసుకుంటే బాబు సీఎంగా ఉన్నా, ఇపుడు జగన్ ఉన్నా కూడా రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా రాష్ట్రం అనాధగా మారింది. ఎటువంటి లాబీయింగులు మోడీ, అమిత్ షాల వద్ద నడవవు అన్న సంగతి బాబు తెలుసుకునే సరికి పుణ్యకాలం గడచిపోయింది. ఇక జగన్ కి ఈ సంగతి మొదట్లోనే అర్ధమైంది. అయినా తన ప్రయత్నం మేరకు హస్తిన వెళ్ళి వస్తున్నాడు. ఇపుడు ఆయనకు నత్వానీ రూపంలో మంచి మధ్యవర్తి దొరికారు. జగన్ కి మోడీ, షాలకు రాయబారిగా నత్వాని ఉండబోతున్నారు. ఇది రాజకీయంగా జగన్ కి ఎంతో బలంగా ఉంటుందని అంటున్నారు.

ఏపీకి కూడా….

ఇక దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సన్నిహితుడు, భాగస్వామి నత్వాని కావడంతో పెట్టుబడులకు కూడా ఏపీకి ఇకపైన ఢోకా లేకపోవచ్చు. జగన్ వచ్చాక పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్ళిపోతున్నాయన్నవిపక్షాల ఆరోపణలకు నత్వానీ గట్టి సమాధానం కానున్నారు. నత్వాని, అంబానీ అండగా ఉంటే ఏపీకి వెల్లువలా పరిశ్రమలు రావడం ఖాయం. తాను ఏపీకి సేవ చేస్తానని, మాట నిలబెట్టుకుంటాన్ని ఇప్పటికే నత్వాని ప్రకటించిన నేపధ్యంలో ఏపీకి కూడా ఈ ఎంపిక శుభవార్త కానుంది. మొత్తం మీద చూసుకుంటే ఆయన‌ ఒక్కడు చాలు అన్నట్లుగ జగన్ కి నత్వాని అన్ని రకాలుగా కొండంత బలంగా మారనున్నారు. రానున్న రోజుల్లో జగన్ జాతీయంగా కూడా సత్తా చాటేందుకు నత్వాని దోస్తీ ఉపకరిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News