ఆ ఎంపీ కూడా రూటు మార్చినట్లుందే?

ఎంపీలతోనే ఏ పార్టీకైనా తలనొప్పులు వస్తాయి. నిజానికి వీరంతా గెలిచిన తరువాత ఢిల్లీలో ఉంటారు. వారి లాబీలూ, లాలూచీలూ అన్నీ వేరేగా ఉంటాయి. ఇక ప్రాంతీయ పార్టీలకైతే [more]

Update: 2020-07-29 12:30 GMT

ఎంపీలతోనే ఏ పార్టీకైనా తలనొప్పులు వస్తాయి. నిజానికి వీరంతా గెలిచిన తరువాత ఢిల్లీలో ఉంటారు. వారి లాబీలూ, లాలూచీలూ అన్నీ వేరేగా ఉంటాయి. ఇక ప్రాంతీయ పార్టీలకైతే తమ ఎంపీలతో ఎపుడూ సమస్యలే ఉంటాయి. అందునా కేంద్రంలో బలమైన పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రాంతీయ పార్టీలకు తమ ఎంపీలను కాపాడుకోవడం కత్తి మీద సామే. ఇక్కడ పార్టీ టికెట్, అధినేత బొమ్మతో గెలిచిన వారు హస్తినకు చేరగానే తామే మొనగాళ్ళు అనుకుంటారు. పైగా ఈనాటి ఎంపీలలో మెజారిటీ వ్యాపారాల్లో ఉన్నవారు, బిగ్ షాట్స్ కావడం వల్ల వారికి కేంద్రంతోనే పనులు ఎక్కువగా ఉంటాయి. దాంతో గెలిపించిన జనం కానీ, టికెట్ ఇచ్చిన పార్టీ కానీ అలా వెనక్కివెళ్ళిపోతాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ రకమైన విష రాజకీయాలు యధేచ్చగా సాగుతున్నాయి.

తలెగరేస్తున్నారు….

వైసీపీ విపక్షంలో ఉన్నపుడు తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే అందులో నలుగురు ఎంపీలు గోడ దూకేశారు. వారంతా కూడా తమ సొంత ప్రయోజనమే చూసుకున్నారని అందరికీ తెలిసిందే. ఇక వైసీపీ ఇపుడు అధికారంలోకి వచ్చినా కూడా నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు రూపంలో తిరుగుబాటు గొంతు వినిపిస్తోంది. ఆయన కూడా వందల కోట్ల కుబేరుడు, ఎన్నెన్నో వ్యాపారాలతో అలరారే బిగ్ షాట్. ఆయన ఎంపీ కావాలనుకున్నది కూడా అందుకోసమేనని అంటారు. ఆ విధంగా రాజు గారి తలనొప్పి వైసీపీకి ఉంది. ఇంకా ఇలాంటి వారు ఎంతమంది పార్టీలో ఉన్నారో ముందు ముందు చూడాలి.

పరిమళాలేవీ ….

ఇక వైసీపీలో కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన నలుగురిలో అపుడే ఒక ఎంపీ మిస్ అయ్యాడా అన్న టాక్ అటు హస్తినలో, ఇటు ఏపీలో వినిపిస్తోంది. ఆయన వ్యక్తిగత‌ కారణాలతో ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డి పెద్దల సభలో బుద్ధిగా ప్రమాణం చేస్తే పరిమళ్ నత్వాని మాత్రం హాజరు కాకపోవడం అపుడే చర్చ రేపుతోంది. ఈ పరిమళ్ నత్వాని వైసీపీ సభ్యుడు కానే కాడు, చివరి నిముషంలో కేంద్ర పెద్దల పంపున, అంబానీ ద్వారా విమానం ఎక్కి జగన్ ఇంటికి వచ్చి రాయబేరాల ద్వారా ఎంపీ టికెట్ దక్కించుకున్న పెద్ద మనిషి. ఆయన్ని జగన్ ఎంపిక చేయడం వెనక బీజేపీ ఉందని అంటారు. అయితే తాను మాత్రం ఏపీకి, జగన్ కి అండగా ఉంటానని గత నెలలో నెగ్గిన తరువాత కూడా పరిమళ్ నత్వానీ కమ్మగానే కబుర్లు చెప్పారు.

డౌటేనా…..

అయితే సొంత రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఏళ్ళకు ఏళ్ళు పార్టీలో ఉంటున్న వారే గోడ దాటేస్తున్న దౌర్భాగ్యపు రోజుల్లో ఎక్కడో పరాయి రాష్ట్రానికి చెందిన వారు ఏపీకి, పార్టీకి ఎంతవరకూ కట్టుబడతారు అన్నది డౌటేనని అంటున్నారు. గతంలో టీడీపీ తరఫున గెలిచిన ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా గొప్ప మాటలెన్నో చెప్పి చివరకు పరార్ అయ్యారు. ఇక పరిమళ్ నత్వానీని తీసుకుంటే ఆయన అపర కుబేరుడు. వ్యాపార సామ్రాజ్యాలు బాగా విస్తరించిన వాడు. ఆయన ఎంపీ అయితే ఏపీకి ఏమైనా ఫలితం ఉంటుందని అంతా ఆశించారు.

రూట్ సెపరేటేనా …?

అయితే కరోనా టైంలోనే కళ్ళు తెరిపించారాయన. ఎక్కడా కూడా ఆయన అయిపూ అజా లేదు, అప్పటికి రాజ్య సభ ఎన్నికలు కూడా జరగలేదు, ఆయన గెలవలేదు, అయినా కూడా నత్వానీ ధీమా అలాంటిది మరి. ఆర్ధికంగా ఇబ్బందులో ఉన్న ఏపీకి చిల్లి గవ్వ కూడా నత్వాని విరాళంగా విదల్చలేదని విమర్శలు ఉన్నాయి. ఇపుడు ఆయన ఎంపీ అయిపోయారు. ఆయన్ని ఆరేళ్ళ పాటు ఎవరూ ఏమీ చేయలేరు కూడా. అందుకే తాను వైసీపీ కండువాను పక్కన పడేసినట్లున్నారని అంటున్నారు. వైసీపీ ఎంపీలతో పాటు కాకుండా విడిగా ప్రమాణం చేస్తానని భావిస్తున్నారు. అంటే ఇకపై ఆయన దోవ ఆయనదన్నమాట. ఇలా చిక్కడు దొరకడు అన్న టైప్ లో నత్వానీ మరో రఘురామ‌రాజులా మారుతున్నారని అనుమానించడంతో తప్పులేదుగా.

Tags:    

Similar News