తగవు ఎందాకా వెళుతుందో?

ఢిల్లీలో మాత్రం పళనిస్వామికి పెద్దగా పలుకుబడి లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ పళనిస్వామికి హస్తినలో పెద్ద నెట్ వర్క్ లేదు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ [more]

Update: 2019-08-19 16:30 GMT

ఢిల్లీలో మాత్రం పళనిస్వామికి పెద్దగా పలుకుబడి లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ పళనిస్వామికి హస్తినలో పెద్ద నెట్ వర్క్ లేదు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మాత్రం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తారన్న పేరుంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతోనూ పన్నీర్ సెల్వం నిత్యం టచ్ లో ఉంటారు. అమ్మ జయలలితకు వీరవిధేయుడిగా పేరుగాంచిన పన్నీర్ సెల్వం ఇప్పుడు అదే తరహాలో మోదీ, అమిత్ షాల వద్ద కూడా ఉన్నారన్నది అన్నాడీఎంకే నేతలే చెబుతున్న మాట.

హస్తినలో హంగామా…..

ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉండటం, తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ అగ్రనేతలను పన్నీర్ సెల్వం కలుస్తుండటాన్ని పళనిస్వామి వర్గం తప్పుపడుతుంది. లోక్ సభ కు జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో ఒకే ఒక్క సీటు గెలిచింది. తేని నుంచి గెలిచిన పన్నీర్ సెల్వం కుమారుడు రాఘవేంద్రకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని అప్పట్లో పన్నీర్ సెల్వం తెగ ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అన్నాడీఎంకే తరుపున ఎవరో ఒకరు కేంద్రమంత్రిగా ఉండాలని పన్నీర్ సెల్వం వాదిస్తుండగా, అవసరం లేదని పళనిస్వామి వర్గం బాహాటంగా చెబుతోంది.

రెండు వర్గాలుగా….

దీంతో అన్నాడీఎంకే లో రెండు వర్గాలుగా విడిపోయాయి. గత మూడేళ్లుగా పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నది అందరికీ తెలిసిందే. పన్నీర్ సెల్వం, పళనిస్వామి కలవడానికి కూడా బీజేపీ పెద్దలే కారణమని చెప్పక తప్పదు. దీంతో కేంద్రంతో సఖ్యతగా ఉండి మోదీ ఇమేజ్ ను ఉపయోగించుకుని శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్నది పన్నీర్ సెల్వం వర్గం వాదన. దానివల్ల ప్రయోజనం ఉండదని, ఒంటరిగానే వెళితే మంచిదని పళనిస్వామి వర్గం గట్టిగా చెబుతోంది.

పగ్గాల కోసమేనట….

ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తరచూ ఢిల్లీ పర్యటనలకు వెళుతుండటాన్ని పార్టీలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కలసి వచ్చారు. అన్నాడీఎంకే పగ్గాలు తనకే అప్పగించాలని అడిగేందుకు అమిత్ షాతో భేటీ అయినట్లు చెబుతున్నారు. పన్నీర్ సెల్వం వెంట ఆయన కుమారుడు ఎంపీ రాఘవేంద్ర తప్ప మరొకరు లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది. మొత్తం మీద పన్నీర్ సెల్వం పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం వాస్తవం. ఈ తగవు ఎందాకా వెళుతుందో చూడాలి.

Tags:    

Similar News