పవన్ దారి తప్పారు...జగన్ ది కిరాయి యాత్ర....!

Update: 2018-10-04 06:30 GMT

పంచుమ‌ర్తి అనురాధ‌. గ‌తంలో విజ‌య‌వాడ మేయ‌ర్‌గా ప‌నిచేసిన ఆమె పార్టీలో నిబ‌ద్ద‌త క‌లిగిన మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న ఆమెకు పార్టీలో కీల‌క ప‌ద‌వులు, చ‌ట్ట స‌భ‌ల‌కు ఎంపిక‌య్యే ఛాన్స్ ఊరిస్తూ వ‌స్తున్నా ఆ క‌ల మాత్రం తీర‌డం లేదు. పార్టీ త‌ర‌పున మీడియాలోనూ, చ‌ర్చ‌ల్లోనూ బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తూ బ‌ల‌మైన మ‌హిళా నేత‌గా ఉన్న అనూరాధ త‌ర‌చుగా విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతూ.. ఆమె పార్టీని, ప్ర‌భుత్వానికి అండ‌గా నిలుస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఆమెకు అసెంబ్లీ సీటు వ‌స్తుందా ? తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె మ‌నోభావాలు ఏమిటో తెలుగుపోస్ట్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో తెలుసుకుందాం..

తెలుగుపోస్ట్ : చ‌ట్ట స‌భ‌ల‌కు పోటీ చేసే ఛాన్స్ రావ‌డం లేదు. ఎలా ఫీల‌వుతున్నారు ?

అనురాధ: రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ పరంగా నా వంతు పాత్ర పోషిస్తున్నాను. పార్టీ తరుపున చట్ట సభలకు పోటీ చేసే అవకాశం 2019లో వస్తుందని బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబుగారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నాకు ఇస్తారు.

తెలుగుపోస్ట్ : బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మీరు .. ప్ర‌స్తుతం బీసీలు టీడీపీ వైపే ఉన్నార‌ని న‌మ్ముతున్నారా ?

అనురాధ: ఈ రోజు బీసీలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో కీలకస్థానాల్లో ఉన్నారంటే అది టీడీపీ వల్లే. టీడీపీ వాళ్లకు ఇచ్చిన ఫ్లాట్‌ఫామ్‌తోనే ఈ రోజు బీసీలు అన్ని విధాలా ముందంజ‌లో ఉన్నారు. బీసీలు టీడీపీకి ఎప్పుడూ కంచుకోటగా ఉన్నారు, ఫ్యూచ‌ర్‌లోనూ ఉంటారు. చంద్రబాబుగారు సైతం తన క్యాబినెట్‌లో ఏకంగా ఎనిమిది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడమే బీసీల పట్ల టీడీపీకి ఎంత ప్రేమ ఉందో చెబుతోంది.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌భావం టీడీపీపైనే ఉంటుందా?

అనురాధ: వచ్చే ఎన్నికల్లో పవన్‌ ప్రభావం టీడీపీ మీదే ఉంటుందన్న విషయాన్ని ఏ మాత్రం ఏకీభవించను. అందులో ఒక శాతం కూడా వాస్తవం లేదు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన పంచాయ‌తీ ఎన్నికల్లోనూ, ఆ త‌ర్వాత జ‌రిగిన మున్సిపాలిటీలు, మండల ప్రజాపరిష‌త్‌, జ‌డ్పీటీసీ ఎన్నికల్లో మాకు 48 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు పవన్‌ పార్టీ అసలు పేప‌ర్ వ‌ర్క్ ద‌శ‌లోనే ఉంది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ స‌పోర్ట్ చేశాక జ‌రిగిన సాధార‌ణ ఎన్నికల్లో ఓట్లు త‌గ్గాయి. దీనిని బట్టీ పవన్‌ ప్రభావం ఏ మాత్రం టీడీపీపై ఉండదని స్పష్టం అవుతుంది. న‌వ్యాంధ్ర సమర్ధుడు అయిన చంద్రబాబుగారి వల్లే అభివృద్ధి చెందుతుందని... పవన్ త‌నంతట తాను స్వయంగా వచ్చి టీడీపీకి మద్దతు ప్రకటించారు. కాని ఇప్పుడు పవన్‌ దారి తప్పారు. ఎప్పుడైతే పవన్‌ బీజేపీ కనుసన్న‌ల్లో పని చెయ్యడం ప్రారంభించారో అప్పుడే పవన్‌ వ్యక్తిత్వం కోల్పోయాడు. పవన్‌ను జనాలు నమ్మడం మానేశారు.

తెలుగుపోస్ట్ : గతంలోనే మీరు టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. ఫ‌లించ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల ప‌రిస్థితి ఏంటి ?

అనురాధ: గత ఎన్నికల్లో నేను టిక్కెట్‌ కోసం ట్రై చేశానన్నది అవాస్తవం. వచ్చే ఎన్నికల్లో గ్యారెంటీగా నాకు సీటు వస్తుందన్న నమ్మకం ఉంది.

తెలుగుపోస్ట్ : చంద్ర‌బాబు దృష్టిలో మీకు క్లీన్ ఇమేజ్ ఉన్నా మీకు ఛాన్స్ ఎందుకు రావ‌డం లేదు ?

అనురాధ: 2009 ఎన్నికల్లో మంగళగిరి సీటును నాకు ఇవ్వాలనుకున్నా... పొత్తులో భాగంగా క‌మ్యూనిస్టులకు ఇచ్చారు. గత ఎన్నికల్లో సైతం మంగళగిరి సీటు ఆఫర్‌ చేసినా విజయవాడ సిటీ రాజకీయాలతో మమేకమైనందున అక్కడ నుంచి పోటీ చేసేందుకు సుముఖ‌త వ్యక్తం చెయ్యలేదు. ఈ సారి ఎక్క‌డ పోటీ ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకోను.

తెలుగుపోస్ట్ : విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్‌గా మీరు ప‌నిచేశారు. అప్ప‌టికీ ఇప్ప‌టికీ రాజ‌కీయాల్లో మార్పు క‌నిపిస్తోందా ?

అనురాధ: నేను మేయర్‌గా చేసినప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. నాడు ప్రజలు, నాడు సిన్సియార్టితో పాటు హార్డ్‌ వర్క్‌ నిబంధనతో ప‌ని చేసే నాయకులకు చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వారు అవినీతిని ఓ పేటెంట్‌గా తగిలించుకుని 12 ఛార్జ్‌ షీట్లు ఉన్నా, ప్రతి శుక్రవారం జైలుకు వెళ్తున్నా... తామేదో సమాజాన్ని మార్చేస్తామని ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్ప‌దంగా ఉంది. ఇలాంటి వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక సమాజమే భ్రష్టు పట్టిపోయింది. రాజకీయ నాయకులకు ఉన్న విలువ‌, గౌరవం తగ్గిపోయాయి. తెలుగుదేశం మాత్రమే విలువలకు కట్టుబడిన రాజకీయం చేసింది. మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ టిక్కెట్ల నుంచి ఇతర‌త్రా రాజకీయాన్ని మొత్తం ఓ బిజినెస్‌గా మార్చేశాయి.

తెలుగుపోస్ట్ : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుంచి మీరు పోటీ చేయాల‌ని భావిస్తున్నారు ?

అనురాధ: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుగారి ఆదేశం మెరకే పోటీ చేస్తాను. ఆయన ఎక్కడ నుంచి బరిలో ఉండమన్నా అక్కడే పోటీలో ఉంటాను.

తెలుగుపోస్ట్ : మంగ‌ళ‌గిరి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా ? మీరు అప్పుడు స్థానికేత‌రురాలు అవుతారు క‌దా ?

అనురాధ: చంద్రబాబు గారి అభిప్రాయాన్ని గౌరవించి ఆయన ఎక్కడ పోటీ చెయ్యమంటే అక్కడ చేస్తాను. విజయవాడకు మంగళగిరి నాన్‌లోకల్‌ అవుతుందనుకోలేం. ఇందంతా రాజధాని ప్రాంతమే. మంగళ‌గిరి నియోజకవర్గానికి విజయవాడకు మధ్యలో క‌న‌క‌దుర్గ వార‌ధి మాత్రమే అడ్డు. అక్కడ మా సామాజికవర్గం బలంగా ఉంది. ఇదంతా నాకు అనుకూలం అవుతుంది. మా నాయనమ్మ వాళ్లది మంగళగిరియే. దీంతో అక్కడ బంధుత్వాలు, పరిచయాలు బాగా ఉన్నాయి. అక్కడ నాన్‌లోకల్‌ అన్న ఫీలింగే నాకు లేదు.

తెలుగుపోస్ట్ : జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది ? మీరేమంటారు?

అనురాధ: జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర పంతానికి నడవడమే తప్ప... ఆయన వద్దకొచ్చి ప్రజా సమస్యలు చెప్పుకున్న వాళ్లే లేరు. ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వాళ్లు ముందుగా ప్రిపేర్‌ చేసిన ప్లానింగ్‌ ప్రకారమే ఆ పాదయాత్ర జరుగుతుంది. గురువారం కిలోమీటరు నడిచి... శుక్రవారం రెస్ట్‌ తీసుకునేదాన్ని పాదయాత్ర అనలేం. ప్రజల్లో ఆదరణ లేకుండా మనుషులను కిరాయికి తెప్పించుకుని జనాలుగా క్రియేట్‌ చేసుకుంటూ న‌డిచే దాన్ని పాద‌యాత్ర అంటారా ? అని ఆయ‌నే చెప్పాలి. శుక్రువారం జైల్‌కు ఎందుకు వెళ్తున్నానో ప్రజలకు చెప్పకుండా దొంగాట ఆడుతున్న జగన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారు. నాడు రుణమాఫి అమలు చెయ్యలేన‌ని చేతులు ఎత్తేసిన జగన్‌ ఇప్పుడు ఎన్నో అమలు కాని హామీలు ఇస్తున్నాడు. 22మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తే మనల్ని నమ్ముకున్నవారు మనల్ని ఎందుకు కాదంటున్నారు అని ఆత్మవిమర్శ చేసుకునే స్టేజ్‌లో కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి లేరంటే అతను ఎంత దిగజారిపోయిన మనస్థత్వంతో ఉన్నాడో అర్థం అవుతుంది. జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతోనే ఇంట్లో కూర్చోలేక రోడ్లు మీద తిరుగుతున్నారే తప్పా దానిని పాదయాత్రగా చూస్తామా ? చెప్పండి.

తెలుగుపోస్ట్ : బీసీ డిక్ల‌రేష‌న్‌కు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇది జ‌రిగితే.. టీడీపీ ఓట్లు చీలవంటారా?

అనూరాధ‌: బీసీలు అంటేనే జగన్‌ ఫామిలీకి ఆది నుంచి గిట్టదు. జగన్‌ తాత రాజారెడ్డి బొగ్గుగనుల విషయంలో బీసీ వర్గానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని దారుణంగా చంపించాడు. ఈ కేసులో ఆయన ప్రధాన ముద్దాయి. సుబ్బయ్య కేవలం బీసీ అనే నాడు కక్ష కట్టి రాజారెడ్డి హత్య చేయించారు. వైసీపీ పెట్టాక అసలు బీసీ ప్లీనరీ అనేదే జరపకపోవడం బట్టీ చూస్తేనే బీసీలపై జగన్‌కు ఎంత క‌ప‌ట ప్రేమ ఉందో తెలుస్తోంది. చంద్రబాబు గతంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు పనిముట్లు ఇప్పించి.. వారు స్వయం ఉపాధి పొందేలా చేస్తే తర్వాత అదే ఆదరణ పథకాన్ని ఎత్తివేశారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీ సబ్‌ప్లాన్‌తో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు వాళ్లు బీసీల డిక్లరేషన్‌ అని ఏదో హడావిడి చేస్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు.

తెలుగుపోస్ట్ : జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం త‌న‌దేన‌ని అంటున్నారు ?

అనూరాధ‌: గతంలో రాజన్న రాజ్యం వస్తుందని జగన్‌ చెప్పుకుని తిరిగారు. రాజన్న రాజ్యంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం పేట్రేగాయి. ఇప్పుడు మళ్ళీ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలిస్తే రేపు ఆంధ్రాలో అదే పరిస్థితి పున‌రావృతం అవుతుంది. ఇలాంటి ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు కోరుకుంటారా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం తిరుగులేని మెజార్టీతో ఘ‌న‌విజయం సాధిస్తోంది.

తెలుగుపోస్ట్ : ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే రూ.20 కోట్ల‌కు త‌క్కువ అయితే క‌ష్టం అన్న టాక్ ఉంది ? మీ ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉందా ?

అనూరాధ‌: డబ్బుతో రాజకీయం అనేది వైసీపీలో జరుగుతుంది గాని టీడీపీకి డబ్బుతో రాజకీయం అవసరం లేదు. ఎంతో మంది సామాన్యులను సైతం చట్ట సభలకు పంపి మంత్రులను చేసిన ఘ‌న‌త ఎన్టీఆర్‌, చంద్రబాబులదే. 40 సంవత్సారాల సుదీర్ఘ రాజకీయంలో చంద్రబాబుగారికి ఎంత క్రేజ్‌ ఉందో చూస్తూనే ఉన్నాం. తాజాగా యూఎన్‌ఓలో ఆయనకు లభించిన అపూర్వ ఆదరణే ఇందుకు నిదర్శనం. ఇలాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా అడ్డు పడుతున్నా ఒంటి చేతితో ఆయన ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇలా అభివృద్ధి జరుగుతున్నప్పుడు డబ్బుతో కూడిన రాజకీయాలు టీడీపీకి అవసరం లేదు.

తెలుగుపోస్ట్ : మీ రాజ‌కీయాల‌కు మీ ఫ్యామిలీ స‌పోర్టు ఎలా ఉంది ?

అనూరాధ‌: నేను రాజకీయాల్లో కొనసాగడం వెనుక మా కుటుంబం సపోర్ట్‌ ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ సపోర్ట్‌ లేకపోతే 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగలేను. మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు.

తెలుగుపోస్ట్ : ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ‌గా ఉంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది ? ఏమంటారు?

అనూరాధ‌: బురద చల్లాలన్న దురుద్ధేశం తప్ప బీజేపీకి మరొకటి లేదు. అవినీతి జరిగిందనప్పుడు ఆధారాలు చూపించమంటే పారిపోతున్నారుగా... అవినీతిపై అరోపణలు చేశారు, మరి ఆధారాలు ఎక్కడ చూపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజే పట్టిసీమలో అవినీతి జరగలేదని పట్టిసీమ భేష్‌ అని మెచ్చుకున్నారు. పోల‌వ‌రంలో అవినీతి అంటూ ప్రత్యేక కమిటీ వేసి కూడా బీజేపీ బొక్కబోర్లా పడింది. ఏదైనా మాట్లాడేముందు దానికి తగిన ఆధారం చూపించాలి. ఆధారాలు చూపిస్తే స‌మాధానం చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆధారాలు లేకుండా పసలేని ఆరోపణలు చెయ్యడం కంటే మానుకోవడం మేలు.

తెలుగుపోస్ట్ : తాజాగా ఏపీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటిదీ రాద‌ని అంటున్నారు. దీనిపై మీరేమంటారు ?

అనూరాధ‌: వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎవరితో జతకట్టినా 140 సీట్లు సాధించి మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం నవ్యాంధ్రలో వ‌రుస‌గా రెండోసారి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమణస్వీకారం చేస్తారు.

Similar News