తీరని రాజకీయ పంచాయతీ…?

దశలవారీగా పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్నాయి. మరో అంకమే మిగిలి ఉంది. ఆ తర్వాత మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇలా వరసగా వచ్చే నెల చివరికి స్థానిక ఎన్నికల [more]

Update: 2021-02-19 15:30 GMT

దశలవారీగా పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్నాయి. మరో అంకమే మిగిలి ఉంది. ఆ తర్వాత మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇలా వరసగా వచ్చే నెల చివరికి స్థానిక ఎన్నికల తంతు ముగిసేందుకు రంగం సిద్దమవుతోంది. ఏడాది కాలంగా ఈ ఎన్నికలపై సాగిన రగడకు తెర పడుతున్నప్పటికీ రాజకీయం మాత్రం చల్లారడం లేదు. నిజానికి పంచాయతీలు పార్టీ రహిత ఎన్నికలు. కానీ పార్టీల సానుభూతి పరులు, కార్యకర్తలు, నేతలు, మద్దతు దారులే బరిలో నిలుస్తున్నారు. ఇరు పార్టీల్లోని ప్రధాన నాయకులు రాజకీయ వేడి సద్దుమణగకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యానం చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం అన్నీ తానే అన్నట్లుగా తాడోపేడో తేల్చుకోవాలన్నంత కసి కనబరుస్తున్నారు. సహజంగానే అంతా అనుకున్నట్లుగానే అధికార పార్టీకి సానుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇది అందరూ ఊహించినదే. గ్రామసీమలలో ఎంతో కొంత అభివృద్ధి సాగాలన్నా, ప్రెసిడెంటు మాట అధికారులు వినాలన్నా అధికారపక్షంలో ఉండటమే మేలన్న ఒక అనధికార ఒడంబడిక చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టో విడుదల చేసి అభాసు పాలయ్యింది. భారీ ప్రచారాన్ని మాత్రం పొందగలిగింది.

ఏకపక్షం కాదు..

పంచాయతీల్లో తన పట్టు నిరూపించుకునేందుకు అధికార వైసీపీ మద్దతు దారులు ఎంతవరకైనా తెగిస్తారనే ప్రచారం ముందుగా సాగింది. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గట్టి నియంత్రణ చర్యలనే చేపట్టింది. ఫలితంగా చాలా చోట్ల ప్రత్యర్థులుగా ప్రధాన పార్టీల మద్దతు దారులు పోటీ పడే వాతావరణం నెలకొంది. ఏకగ్రీవాలు 16 నుంచి 17 శాతానికే పరిమితమయ్యాయి. ఏకపక్షంగా తొంభై శాతం సీట్లు వస్తాయనుకున్న వైసీపీ ఆ స్థాయి విజయాలను నమోదు చేయలేదు. టీడీపీ సగటున సీట్లు, ఓట్ల పరంగా 24శాతం సాధించినట్లు తటస్థ పరిశీలకుల అంచనా. మరో 3శాతం మేరకు బీజేపీ, జనసేన కూటమి ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే వైసీపీ పద్దులో 73శాతం పంచాయతీలు కైవసమయ్యాయి. కానీ ఇందులో 16శాతం ఏకగ్రీవాలను పక్కనపెట్టాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, ఒత్తిడులు కారణంగా అధికారపార్టీకి అనుకూలంగా అవాంఛనీయమైన ధోరణి తోనే ఏకగ్రీవాలు సాగాయి. వైసీపీ ప్రాబల్యాన్ని రాజకీయంగా అంచనా వేసే క్రమంలో బేరీజు వేస్తే ఏకగ్రీవాలను మినహాయించాలి. నికరంగా 57 శాతం పంచాయతీల్లో ఎటువంటి శషభిషలు లేకుండా వైసీపీ ప్రజాస్వామ్య బద్ధంగా విజేతగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాగిన పంచాయతీ ఫలితాలతో పోలిస్తే తన బలాన్ని నాలుగు రెట్టు చేసుకోగలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే గ్రామప్రాంతాల్లో పట్టు పెరిగినట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ అధికార పార్టీలో ఆత్మవిశ్వాస స్థాయి తగ్గింది. అసలు పోటీయే ఉండదనుకున్న వేల గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవడం , గట్టి పోటీ ఇవ్వడాన్ని అధికారపార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

ఎదురీత తప్పదు..

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తన ఓటమిని అధికార పార్టీ వైసీపీ అక్రమాలకు, ఎన్నికల కమిషన్ వైఫల్యాలకు ముడిపెట్టి తప్పించుకోవాలని చూస్తోంది. నిజానికి తెలుగుదేశం ఆశించినదానికంటే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలనే రాబట్టింది. 40శాతం సీట్లలో టీడీపీ బలమైన పోటీనిచ్చి, 22 శాతం వరకూ దక్కించుకోగలిగింది. ఓట్ల పరంగా చూస్తే మొత్తమ్మీద 24 శాతం పైగానే రాబట్టగలిగింది. ఇదేమంత చిన్న విషయం కాదు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ప్రజాప్రతినిధులు ..ఇలా అనేక రకాలుగా వ్యవస్థీకత యంత్రాంగాన్ని వైసీపీ ఏర్పాటు చేసుకుంది. అధికారపార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెబితే సంక్షేమ , అభివ్రుద్ధి పథకాలకు గండి పడుతుందనే సంకేతాలను సమర్థంగానే పంపగలిగారు. ఇవన్నీ కలిసొచ్చి వైసీపీ మంచి విజయాలను నమోదు చేసుకుంది. ఇంతప్రతికూల పరిస్థితుల్లోనూ టీడీపీ మంచి ప్రదర్శననే ఇవ్వగలిగింది. ఏదేమైనా ఈ రెండు పార్టీలు బ్యాలెన్స్ సరి చేసుకోవాలనేది గ్రామీణ ఓటరు తీర్పు ఫలితంగా కనిపిస్తోంది. టీడీపీకీ ఎదురీత మరింత కాలం తప్పేలా లేదు. వైసీపీ కాలరెగరేసుకుని భవిష్యత్తు అంతా తనదేనని క్లెయిం చేసుకునే వాతావరణమూ లేదు.

మినీ కూటమే..

జట్టుకట్టిన బీజేపీ, జనసేన ల ప్రభావం ఇంకా గ్రామసీమలపై పడలేదు. ప్రధాన ప్రత్యర్థులుగా వైసీపీ, టీడీపీలే ఉండబోతున్నాయనేది స్పష్టమైంది. పవన్, కమలాల జోడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి త్రుతీయ పక్షమే. ఈరెండు పార్టీల మధ్యనే ఓట్ల చీలిక ఉండబోతోంది. జనసేన, బీజేపీ కూటమి ప్రత్యామ్నాయ ప్రత్యర్థిగా రూపుదాల్చనంతవరకూ టీడీపీ , వైసీపీల మద్యనే తటస్థ వర్గాలు చాయిస్ తీసుకుంటాయి. కొత్త ఓటర్లను, తటస్ళులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనుకుంటున్న ఈ కూటమికి పంచాయతీ ఫలితాలు పెద్దగా రుచించేలా లేవు. రానున్న మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా సమర్థ ప్రచార ప్రణాళికతో ముందుకు వెళ్లడం మంచిది. లేకపోతే ఇవే ఫలితాలు పునరావ్రుతమవుతాయి. సార్వత్రిక ఎన్నికలకు క్షేత్రస్థాయి బలాలను సిద్దం చేసుకునేందుకు స్థానిక ఎన్నికలు దోహదం చేస్తుంటాయి. టీడీపీ, వైసీపీలకు గ్రామీణ స్థాయి నాయకత్వాలకు లోటు లేదు. బీజేపీ, జనసేనలు ఈ లోపాన్ని పూరించుకోవాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికల వంటి సందర్బాలు పార్టీ నిర్మాణానికి ఉపకరిస్తాయి. ప్రజల్లో పలుకుబడి కల నాయకులను సులభంగా పట్టుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి జనసేన, బీజేపీలకు ఆ చాన్సు మిస్పయినట్లే కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News