లక్ తప్ప ఇంకేదీ ఈమెను రక్షించలేదట

ఆమె అంత అదృష్టవంతురాలు వేరే ఎవరూ లేరు అనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లాలో ఒక సాధారణ టీచర్ గా ఉన్న ఆమె ఈ రోజు ఏపీకి [more]

Update: 2021-09-01 12:30 GMT

ఆమె అంత అదృష్టవంతురాలు వేరే ఎవరూ లేరు అనే చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లాలో ఒక సాధారణ టీచర్ గా ఉన్న ఆమె ఈ రోజు ఏపీకి ఉప ముఖ్యమంత్రి. ఆమె పాముల పుష్ప శ్రీవాణి. ఆమెకు రాజకీయ నేపధ్యం ఏమీ లేదు. ఆమెను కురుపాం రాజ వారసుడు పరీక్షిత్ రాజు వివాహం చేసుకున్న మీదటనే లక్ అలా నక్కను తొక్కేసింది. ఇక 2014 ఎన్నికల వేళ పాముల పుష్ప శ్రీవాణికి టికెట్ ఇస్తే గెలిచి వచ్చారు. అంతే కాదు నాడు టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆమె లొంగకుండా అయిదేళ్ళూ జగన్ తోనే నిలిచారు. ఫలితంగా జగన్ ఆమెకు 2019 ఎన్నికల్లో రెండవ సారి టికెట్ ఇచ్చారు. ఆమె గెలిచాక ఏకంగా ఉప ముఖ్యమంత్రినే చేశారు. జగన్ ఆప్యాయంగా చెల్లెమ్మ అని పిలిచే వారిలో ఆమె ముందు వరసలో ఉంటారు.

పట్టు సాధించకపోయినా…?

పాముల పుష్ప శ్రీవాణికి రాజకీయం కొత్త. భర్త పరీక్షిత్ రాజు కూడా పెద్దగా ఆరితేరిన వారు కాదు. ఆయన తండ్రి శత్రుచర్ల చంద్రశేఖర రాజుకు రాజకీయంగా విశేష అనుభవం ఉంది. కానీ ఆయనను ఈ దంపతులు దూరం పెట్టారో ఆయన దూరం అయ్యారో తెలియదు కానీ ఇపుడు గట్టి పట్టున్న శత్రుచర్ల ఫ్యామిలీయే పుష్పకు అసలైన శత్రువు అయింది. అంటే ఇంట్లో పోరాడుతూ బయట ప్రత్యర్ధులతో కూడా తలపడాలి. నిజానికి ఇది కష్టమైన పని. అందుకే పాముల పుష్ప శ్రీవాణి ఈ ఫీట్ లో డిఫీట్ అయ్యారనే అంటున్నారు. కురుపాం లో రెండు సార్లు గెలిచిన పాముల పుష్ప శ్రీవాణికి ఈసారి చుక్కలు కనిపించడం ఖాయమనే మాట ఉంది.

డేంజర్ బెల్స్…

గిరిజన శాఖా మంత్రిగా పుష్ప శ్రీవాణి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నా ఇప్పటిదాకా అరకు లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు గిరిజన నియోజకవర్గాలలో పర్యటించిన దాఖలాలు లేవు. అంతే కాదు ప్రభుత్వ పధకాల మీద వారికి అవగాహన కల్పించి మన్యం జనం పూర్తి ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకున్నారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. మరో వైపు ఆమె రాజకీయంగా యాక్టివ్ గా ఉండడంలేదు అన్న మాట ఉంది. భర్త పరీక్షిత్ రాజు జోక్యం కూడా పెరిగింది. మరో వైపు వైసీపీలోని ఇతర నాయకుల రాజకీయం కూడా ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. పాముల పుష్ప శ్రీవాణి వాటిని ధీటుగా ఎదుర్కోలేక తరచూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే రాజకీయాల‌లో ధీరత్వమే తప్ప బీరువుగా నిలిస్తే కుదిరేది కాదు. దానికి తోడు తాజాగా వచ్చిన ఒక సర్వేలో కురుపాం లో ఈసారి పుష్ప శ్రీవాణి ఓటమి ఖాయమని చెబుతోంది. దానితో పాటే మంత్రి పదవి కూడా ఊడుతుంది అంటున్నారు.

అదే కాపాడాలి…

పుష్ప శ్రీవాణి ఏదీ కావాలని అనుకుంటే వచ్చినవి కావు. ఆమె కంటే ఎందరో సీనియర్లు ఉండగా కేవలం ముప్పయ్యేళ్ళకే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. దాంతో ఆమె లక్ నే మళ్ళీ మళ్లీ నమ్ముకుంటున్నారు. జగన్ తన పట్ల అభిమానం చూపించి అయిదేళ్ళ పాటు మంత్రిగా ఉంచుతారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెల్లెమ్మకు అన్యాయం చేయరని కూడా నమ్ముతున్నారు. ఒక వేళ మంత్రి పదవి కనుక చేతిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని, మంత్రి హోదాలో పోరాడితే గెలుపు కూడా సాధ్యమేనని ఆమె అంచనా కడుతున్నారుట. మరి తిరిగి తిరిగి అంతా లక్ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పటికి రెండు సార్లు ఫేవర్ చేసిన లక్ మూడవసారి కూడా ఈ చెల్లెమ్మను వరిస్తే ఆమెకు ఇక తిరుగులేనట్లే

Tags:    

Similar News