టీడీపీ కీలకనేత రెడీ అయిపోయారట..బాబుపై కోపంతోనే?

ఆయన సీనియర్ నేత. దాని కంటే ముందు రాజకీయంగా డక్కామెక్కీలు తిన్న కుటుంబానికి చెందిన వారసుడు. విశాఖ అర్బన్ జిల్లావ్యాప్తంగా బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన కీలక [more]

Update: 2020-04-02 15:30 GMT

ఆయన సీనియర్ నేత. దాని కంటే ముందు రాజకీయంగా డక్కామెక్కీలు తిన్న కుటుంబానికి చెందిన వారసుడు. విశాఖ అర్బన్ జిల్లావ్యాప్తంగా బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన కీలక రాజకీయ నాయకుడు. జగన్ ప్రభంజనం ఓ వైపు, పవన్ మానియా మరో వైపు ఉన్నా కూడా గాజువాకలో అర లక్షకు పైగా ఓట్లు సాధించిన మొనగాడుగా ఉన్నారు. గాజువాక నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు టీడీపీలో ఇపుడు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆయన చంద్రబాబు తనకు గాజువాక గెలుపు విషయంలో అన్యాయం చేసారన్న బాధతో ఉన్నారు. ఆయన తండ్రి పల్లా సింహాచలం బలమైన కార్మిక నాయకుడు. దాంతో అన్ని విధాలుగా ధీటుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు మంచి రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు.

వైసీపీ గేలం….

పల్లా శ్రీనివాస్ ని తమ వైపునకు తిప్పుకోవాలని వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ అర్బన్ జిల్లాలో వైసీపీకి ఇంకా నాయకత్వ సమస్య అలాగే ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరవుతున్నా కూడా పార్టీలో గట్టి నాయకులుగా ఎవరూ ముందుకు రావడంలేదు. పైగా జగన్ విశాఖను రాజధానిగా విశాఖ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా వైజాగ్ లో ఎదురులేదనిపించుకోవాలని జగన్ చూస్తున్నారుట. దాంతో పల్లా శ్రీనివాసరావుకు తొలి పిలుపు వెళ్ళిందని ప్రచారంలో ఉంది.

కోటకు బీటలే….

పల్లా శ్రీనివాస్ వైసీపీలోకి కనుక వస్తే వైసీపీ జిల్లావ్యాప్తంగా బలపడుతుంది. అదే సమయంలో టీడీపీకి గట్టి దెబ్బ తగలడం ఖాయం. యాదవుల్లో బలమైన నేతగా ఉన్న పల్లా శ్రీనివాసరావు కుటుంబం జెల్ల కొడితే పసుపు పార్టీకి కళ్ళు పచ్చబారడం ఖాయమని అంటున్నారు. పల్లా సింహాచలానిది రాజకీయంగా నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేపధ్యం ఉంది. ఆయన కొడుకుగా 2009 ఎన్నికల్లో అప్పటి ప్రజారాజ్యం నుంచి తొలిసారి ఎంట్రీ ఇచ్చి విశాఖ ఎంపీగా పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ టీడీపీని నాడే మూడవ స్థానంలోకి నెట్టేశారు. ఆ దెబ్బ సైకిల్ పార్టీకి గుర్తుంది కాబట్టే ఆయన్ని దగ్గరకు తీసి 2014 ఎన్నికల్లో గాజువాక టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది.

విజయ మంత్రం…..

అయితే గాజువాక నుంచ్ పవన్ పోటీ చేయడంతో ఆయనకు మద్దతుగా చంద్రబాబు తెరవెనకు నడిపిన మంత్రాంగంతో పల్లా కుటుంబం మొత్తమే కాదు, యాదవులే టీడీపీకి బాగా యాంటీ అయ్యారు. వారు ఇప్పటికీ సర్దుకోలేకపోతున్నారు. పల్లాను పార్టీ మారమని పెద్ద ఎత్తున వత్తిడి చాలా రోజులుగా వస్తోంది. ఇదే సందుగా విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ మంత్రాంగం నడుపుతున్నారు. ఆయన వ్యూహం ఫలిస్తే మాత్రం భారీ వికెట్ టీడీపీ నుంచి పడిపోవడం ఖాయం. పల్లా శ్రీనివాసరావును తీసుకువస్తే ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన ప్రభుత్వ పదవి ఇస్తారని, 2024 నాటికి విశాఖ ఎంపీగా ఆఫర్ ఇస్తారని వినిపిస్తోంది. మొత్తానికి పల్లా శ్రీనివాసరావు కనుక కీలక నిర్ణయం తీసుకుంటే టీడీపీ వెల్లకిల్లాపడడం ఖాయమే.

Tags:    

Similar News