ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా పల్లా?

విశాఖ సిటీకి ఏపీలో ఉన్న ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలిసిందే. విశాఖ విభజన ఏపీలో మెగా సిటీ. అంతే కాదు. రాజకీయంగా కూడా ఇపుడు అత్యంత ప్రాధాన్యత [more]

Update: 2021-01-03 06:30 GMT

విశాఖ సిటీకి ఏపీలో ఉన్న ప్రాధాన్యత ఎంతో అందరికీ తెలిసిందే. విశాఖ విభజన ఏపీలో మెగా సిటీ. అంతే కాదు. రాజకీయంగా కూడా ఇపుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరం. పేరుకు అమరావతి అని అంటున్నా రాజకీయాలు హీటెక్కేది అంతా విశాఖలోనే. అటువంటి విశాఖ మీద వైసీపీ గట్టిగానే ఫోకస్ ఉంచింది. విశాఖలో వీకెండ్ భూ ఆపరేషన్లు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తున్నాయి. చంద్రబాబు ఏలుబడిలో భూ దందాలు జరిగాయని టీడీపీ మీద వైసీపీ గట్టిగా ఆరోపణలు చేస్తోంది. ఇక టీడీపీ నాయకులను కూడా మామూలుగా టార్గెట్ చేయడంలేదు. ఈ నేపధ్యంలో విశాఖ సిటీకి టీడీపీ ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అధినేత చంద్రబాబు కీలక‌ బాధ్యతలు అప్పగించారు.

మెత్త మెత్తగానే …..

పల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం పరంగా రాజకీయ నేపధ్యం దృష్ట్యా దూసుకుపోతారని అంతా భావించారు. పైగా విద్యాధికుడుగా కూడా ఉన్న ఆయన సిటీలో క్లాస్ ని మాస్ ని ఏకం చేసి టీడీపీకి కొత్త క్రేజ్ తీసుకువస్తారని కూడా తమ్ముళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ కొత్త కమిటీలు ప్రకటించి మూడు నెలలు అయింది కానీ పల్లా శ్రీనివాసరావు పార్టీ తరఫున భారీ ఎత్తున ఒక్క ఆందోళనా కార్యక్రమం కూడా విశాఖ సిటీలో చేపట్టలేదని అంటున్నారు. పైగా ఆయన మీడియాకు కూడా నల్ల పూస అయిపోయారు. ఇక విశాఖ సిటీ ఆఫీస్ కి కూడా రాకుండా గాజువాకలోనే ఉంటున్నారు. వైసీపీ సర్కార్ ని విమర్శించాలన్నా కూడా మెత్త మెత్తగానే మాట్లాడుతున్నారు. దీంతో తమ్ముళ్ళ అంచనాలు అన్నీ తల్లకిందులు అవుతున్నాయి.

గంటాతో మొదలెట్టి …..

విశాఖలో టీడీపీ ఊడలను పెకిలించే కార్యక్రమానికి వైసీపీ దిగిపోయింది. పొలిటికల్ గా బిగ్ ఫిగర్ అనుకునే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మొదలుపెట్టి ఇపుడు గట్టి ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణ బాబునే టార్గెట్ చేస్తోంది. మధ్యలో దక్షిణ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యా సంస్థల మీద దాడులు చేస్తే ఆయన సరెండర్ అయి వైసీపీకి జై కొట్టేశారు. ఇంకో ఎమ్మెల్యే గణబాబు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఈ సమయంలో సిటీ ప్రెసిడెంట్ గా అందరికీ నేనున్నాను అంటూ కచ్చితమైన భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పల్లా శ్రీనివాసరావుకు ఉందని అంటున్నారు. కానీ ఆయన మాత్రం పెద్దగా సీరియస్ గా వీటిని తీసుకోకపోవడం వల్ల మొత్తం టీడీపీ డీ మోరలైజ్ అవుతోంది అన్న మాట వినిపిస్తోంది.

చిన రాజప్పే దిక్కా …?

విశాఖ జిల్లా పార్టీ ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పే ఎట్టకేలకు విశాఖకు దిక్కు అయ్యేట్లుగా సీన్ కనిపిస్తోంది. విశాఖలో తమ్ముళ్ళకు ఏ ఇబ్బంది వచ్చినా చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన విశాఖ టూర్ పెట్టుకుంటున్నారు. మీడియా ముఖంగా వైసీపీని కడిగేసి మమ అనిపించేస్తున్నారు. ఆ సమయంలో మాత్రం పల్లా శ్రీనివాసరావు వాయిస్ వినిపిస్తున్నారు. ఆ మీదట ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగైతే టీడీపీలో పెద్ద నాయకులు అంత నయానో భయానో వైసీపీకి సరెండర్ కాక తప్పదని కూడా అంటునారు. చంద్రబాబు పెట్టుకున్న ఆశలు, అంచనాల మేరకు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికీ పనిచేయలేకపోతున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఆయన సైకిల్ జోరు పెంచేది ఎపుడో చూడాల్సిందే.

Tags:    

Similar News