ఆయనకు బంప‌ర్ ఆఫ‌ర్.. అందుకుంటే ఐదేళ్లు తిరుగేలేదుగా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చి త‌లుపు తడుతుందో ఎవ‌రూ చెప్పలేరు. వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటే అప్పటిక‌ప్పుడే రాజులు కావొచ్చు. వ‌దులుకుంటే సైనికులుగా బ‌తుకీడ్చడం త‌ప్ప మిగిలేది [more]

Update: 2020-04-02 03:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చి త‌లుపు తడుతుందో ఎవ‌రూ చెప్పలేరు. వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటే అప్పటిక‌ప్పుడే రాజులు కావొచ్చు. వ‌దులుకుంటే సైనికులుగా బ‌తుకీడ్చడం త‌ప్ప మిగిలేది ఏదీ ఉండ‌దు. దాదాపు నాయ‌కులు అంద‌రూ కూడా వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు. ఇప్పుడు ఇలాంటి బంప‌ర్ ఆఫ‌ర్ ఒక‌టి విశాఖప‌ట్నం గాజువాక మాజీ ఎమ్మెల్యే , టీడీపీకి చెందిన నాయ‌కుడు, బీసీల్లో బ‌ల‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌ల్లా శ్రీనివాస‌రావుకు వ‌చ్చింది. ప్రస్తుతం ఈ ఆఫ‌ర్ ఆయ‌న చుట్టూ తిరుగుతోంది. అయితే ఆయ‌న మాత్రం త‌ట‌ప‌టాయిస్తున్నారు.

రెండో ప్లేస్ లో….

గ‌తంలో టీడీపీలో ఉన్న ప‌ల్లా శ్రీనివాస్ కుటుంబం 2009లో ప్రజారాజ్యంలోకి జంప్ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో ప‌ల్లా శ్రీనివాస్ విశాఖ నుంచి ప్రజారాజ్యం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో గంటా బ్యాచ్‌తో పాటు టీడీపీలోకి వ‌చ్చిన ప‌ల్లా శ్రీనివాస్ టీడీపీ నుంచి గాజువాక ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి టీడీపీలో కొన‌సాగుతున్న ప‌ల్లా శ్రీనివాస్ గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గాజువాక‌లో త్రిముఖ పోరు నెల‌కొన‌డంతో ఓట్లు చీలి ఓడిపోయారు. ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన నాగిరెడ్డి విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఇక్కడ‌నుంచి పోటీ చేయ‌డంతో ఓట్లు చీలిపోయి ప‌ల్లా శ్రీనివాస్ రెండో ప్లేస్‌లో నిలిచారు.

పల్లాను పార్టీలో చేర్చుకుని….

విశాఖ న‌గ‌రంలో వైసీపీ వీక్‌గా ఉండ‌డంతో మేయ‌ర్ పీఠం కైవ‌సం చేసుకునేందుకు వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి ఎన్నో ప్రయ‌త్నాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోనూ, న‌గ‌రంలోనూ ప‌లువురు మాజీల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ న‌గ‌రంలో బలంగా ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన ప‌ల్లా శ్రీనివాస్ ను పార్టీలోకి చేర్చుకోవాల‌ని వైసీపీ ప్రయ‌త్నిస్తోంది. త‌ద్వారా విశాఖ పార్లమెంటు ప‌రిధిలోని యాద‌వుల ఓట్లను వైసీపీకి చేరువ చేయడంతో పాటు విశాఖ మేయ‌ర్ పీఠంపై వైసీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌న్నదే విజ‌యసాయి రెడ్డి టార్గెట్‌.

స్థాయికి తగిన పదవే…

ఈ నేప‌థ్యంలోనే ప‌ల్లా శ్రీనివాస్ ను పార్టీలోకి రావాల‌ని ఆహ్వానిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు కీల‌క‌మైన ఆఫ‌ర్ ఇచ్చారు. అదే విశాఖ న‌గ‌ర మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌ని చెబుతున్నార‌ట‌. నిజానికి ఇది ప‌ల్లా శ్రీనివాస్ స్థాయికి కీల‌క‌మైన ప‌ద‌విగానే చెబుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న ఒప్పుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుంటే వ‌చ్చే ఐదేళ్లు ఆయ‌న‌కు తిరుగులేద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఎలాగూ టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేద‌ని సో.. వైసీపీలోకి వెళ్తే మంచి భ‌విత ఉంటుంద‌ని ఆయ‌న అనుచ‌రులు కూడా అంటున్నారు. కానీ ప‌ల్లా శ్రీనివాస్ మాత్రం ఇంకా ఎలాంటి డెసిష‌న్ తీసుకోలేదు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో మ‌రోసారి చ‌ర్చలు జ‌రుగుతున్నాయ‌ట‌. గంటా శ్రీనివాస‌రావు వ‌ర్గానికి చెందిన ప‌ల్లా శ్రీనివాస్ ఇప్పుడు కాదంటున్నా.. స‌మ‌యం చూసుకుని జంప్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు విశాఖ రాజ‌కీయ నేత‌లు మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News