ఇక బేఫికర్….!!!

తమిళనాడు ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకే సర్కార్ ను ముప్పు నుంచి తప్పించినట్లే చెప్పుకోవాలి. తమిళనాడులో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు [more]

Update: 2019-05-24 18:29 GMT

తమిళనాడు ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకే సర్కార్ ను ముప్పు నుంచి తప్పించినట్లే చెప్పుకోవాలి. తమిళనాడులో పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి కొంత ఊరట నిచ్చాయి. పళనిస్వామి, పన్నీర్ సెల్వం సర్కార్ మరికొంత కాలం మనుగడ సాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఇక బేఫికర్ అన్నట్లు ఊపిరి పీల్చుకుంది అన్నాడీఎంకే.

ఊపిరి పీల్చుకున్నారు….

తమిళనాడులో పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. 39 పార్లమెంటు స్థానాలకు, 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కేవలం ఒకే ఒక్క స్థానంతో అన్నాడీఎంకే సరిపెట్టుకుంది. డీఎంకే 36 స్థానాలను దక్కించుకుంది. ఇక ఉప ఎన్నికల ఫలితాల విషయానికొస్తే అన్నాడీఎంకే తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. పార్లమెంటు స్థానాలు పోయినా ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో గెలవడంతో పళనిసర్కార్ ప్రమాదం నుంచి తప్పించుకుంది.

మ్యాజిక్ ఫిగర్ చేరి….

తమిళనాడులో మొత్తం 234 శాసనసభ స్థానాలుండగా అందులో 111 మంది సభ్యుల బలం ఉంది. ఉప ఎన్నికల్లో తేడా వస్తే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 117 గా ఉంది. అయితే తొమ్మిది స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకోవడంతో మ్యాజిక్ ఫిగర్ ఒక్క స్థానం అధికంగా పదిలంగా ఉంది. అయితే అన్నాడీఎంకేలో ఇప్పటికీ అసంతృప్తి పెల్లుబుకుతోంది. అనేకమంది ఎమ్మెల్యేలు పళని, పన్నీర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండేళ్ల పాటు పళనిస్వామి ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్టాలిన్ ఆశలకు గండి…..

ఉప ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ డీఎంకే పదమూడు స్థానాలను దక్కించుకుంది బలమైన ప్రతిపక్షంగా మారింది. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడటంతో సర్కార్ కు ఇప్పట్లో వచ్చిన ప్రమాదమేమీలేదు. మరోవైపు టీటీవీ దినకరన్ పార్టీ పార్లమెంటు, ఉప ఎన్నికల్లో చతికలపడింది. కమల్ హాసన్ పార్టీని తమిళులు ఆదరించలేదు. దీంతో డీఎంకే పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ చేసేసినా, ఉప ఎన్నికల ఫలితాలు నిరాశపర్చాయి. స్టాలిన్ ఆశలకు గండికొట్టాయి. మరోవైపు పళని, పన్నీర్ లు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News