ఆల్ ఫ్రీ…. పళనిస్వామి.. కొత్త ఎత్తుగడ

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో పళినిస్వామి తన ఎన్నిక మ్యానిఫేస్టో విడుదల చేశారు. దాదాపు అంతా ఉచిత పథకాలను పళనిస్వామి ప్రకటించారు. [more]

Update: 2021-03-27 17:30 GMT

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో పళినిస్వామి తన ఎన్నిక మ్యానిఫేస్టో విడుదల చేశారు. దాదాపు అంతా ఉచిత పథకాలను పళనిస్వామి ప్రకటించారు. తమిళనాడులో అన్ని సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉండటంతో సహజంగా ఉండే వ్యతిరేకత కారణంగా అన్నాడీెఎంకే ఈసారి అధికారంలోకి రావడం కష్టమేనన్న అంచనాలు విన్సిస్తున్నాయి.

కష్ట సమయమని తెలిసినా….?

ఇప్పటికే కూటమిలోని పార్టీలు అన్నాడీఎంకేను విడిచి వెళుతున్నాయి. సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పళనిస్వామి టిక్కెట్ ఇవ్వలేకపోయారు. వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు అన్నాడీఎంకేను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. విజయ్ కాంత్ కు చెందిన డీఎండీకే కూడా కూటమిని విడిచి వెళ్లిపోవడం పళనిస్వామికి కోలుకోలేని దెబ్బ. అయినా పళనిస్వామి మాత్రం తాను ధైర్యంతోనే ముందుకు వెళుతున్నారు.

సర్వేలు చేయించుకుని….

తన పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని వివిధ సర్వేల ద్వారా పళనిస్వామి తెలుసుకున్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన మూడేళ్లలోనే జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిని మరింత అడ్వాంటేజీగా మార్చుకునేందుకు పళనిస్వామి మ్యానిఫేస్టో ను విడుదల చేశారు. ఇందులో విపక్ష డీఎంకే కంటే ఒక అడుగు ముందు ఉండేలా పళనిస్వామి హమీలు గుప్పించారు.

అన్నీ ఉచితమే…..

రేషన్ కార్డులున్న వారందరికి ఉచితంగా వాషింగ్ మెషీన్లు ఇస్తామన్నారు. ఆరు గ్యాస్ సిలిండర్లను ఏడాదికి ఉచితంగా ఇస్తామని పళనిస్వామి చెప్పారు. రేషన్ సరుకులను ఇంటివద్దకే చేరుస్తామన్న హామీ ఇచ్చింది. ఇళ్లులేని పేదలకు అమ్మ ఇల్లమ్ పథకం కింద ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని పళనిస్వామి పేర్కొన్నారు. ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు 1500 జమచేస్తామని చెప్పారు. ఇలా అన్నీ ఉచితాలు ప్రకటించారు. దాదాపు 126 హామీలతో పళనిస్వామి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ఉచిత హామీలు పళనిస్వామిని ఈ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయో? లేదో? చూడాలి.

Tags:    

Similar News