సాంబారులా ఉందట పళని పాలన…తమిళనాడు టాక్

అంత చరిష్మా లేకపోయినా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం పాలనలో మంచిమార్కులే కొట్టేశారు. జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ఆయన మూడున్నరేళ్లలో బాగానే చేశారని [more]

Update: 2021-03-17 18:29 GMT

అంత చరిష్మా లేకపోయినా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం పాలనలో మంచిమార్కులే కొట్టేశారు. జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను ఆయన మూడున్నరేళ్లలో బాగానే చేశారని ప్రత్యర్థి పార్టీలు సయితం అంగీకరిస్తున్నాయి. జయలలిత, కరుణానిధి హయాంలో అవినీతీ ఆరోపణలు ఎక్కువగా విన్పించేవి. అలాగే వ్యక్తిగత విమర్శలు కూడా ఎక్కువగా ఉండేవి. అభివృద్ధి కంటే వారు సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి పెట్టేవారు.

ఊహించని రీతిలో…..

కానీ పళనిస్వామి తనకు ఇమేజ్ లేకపోయినా ముఖ్యమంత్రిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారన్నది తమిళనాట విన్పిస్తున్న టాక్. పళనిస్వామి ఊహించని రీతిలో ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత మరణం తర్వాత, శశికళ జైలు పాలయ్యాక అసలు అన్నాడీఎంకే అధికారంలో ఉంటుందని ఎవరూ ఊహించ లేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పళనిస్వామి మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారు.

అభివృద్ధి వైపే…..

తమిళనాడులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మెట్రో వంటి ప్రాజెక్టులకు నిధులను తెచ్చుకోగలిగారు. జలవివాదాలను పరిష్కరించుకోగలిగారు. ఇక కీలకమైన కరోనా సమయంలోనూ పళనిస్వామి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని కితాబుఇస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో గతంలో కంటే పళనిస్వామి పాలనకే ప్రజలు ఎక్కువ మార్కులు వేస్తున్నారు.

అధికారాన్ని కాపాడుకుంటూనే….

డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉన్నప్పటికీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా పళని స్వామి చూసుకోగలిగారు. దినకరన్ కొంత ఇబ్బంద ిపెట్టినా ఉప ఎన్నికల్లో అవసరమైన స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఇది ఎంతవరకూ పనిచేస్తుందన్నది చెప్పలేం కాని, పళనిస్వామి అంటే తమిళుల్లో సాఫ్ట్ కార్నర్ బాగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అది ఎంత మేరకు ఈ ఎన్నికల్లో ప్రభావంచూపుతుందన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News