అమ‌ర్‌నాథ్ రెడ్డి జోరెంత‌….అంటే…??

చిత్తూరు జిల్లాలోని హాట్ సీట్ల‌లో ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డి నుంచి తెలుగుదేశం పార్టీ త‌రపున మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి కూడా [more]

Update: 2019-05-11 09:30 GMT

చిత్తూరు జిల్లాలోని హాట్ సీట్ల‌లో ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డి నుంచి తెలుగుదేశం పార్టీ త‌రపున మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి కూడా మ‌ళ్లీ విజ‌యం సాధించాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. ఇక‌, త‌మ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లి మంత్రి ప‌ద‌వి కూడా చేప‌ట్టిన ఆయ‌న‌ను క‌చ్చితంగా ఓడించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకుంది. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గంలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ల‌మ‌నేరులో వైసీపీని గెలిపించే బాధ్య‌త తీసుకున్నారు. ఇక్క‌డ జ‌న‌సేన పార్టీ ప్ర‌భావం కూడా కొద్దిగా ఉండే అవ‌కాశం ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్యే జ‌రిగింది. రెండు పార్టీల అభ్య‌ర్థులూ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌

ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ఎనిమిది ఎన్నిక‌లు జ‌రిగితే ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించింది. ఒక‌సారి కాంగ్రెస్ గెలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి అమ‌ర్‌నాథ్ రెడ్డి విజ‌యం సాధించినా ఆయ‌న‌కు టీడీపీ అభ్య‌ర్థి సుభాష్ చంద్ర‌బోస్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో కేవ‌లం 2,890 ఓట్ల స్వ‌ల్ప మెజారిటీతో బ‌య‌ట‌ప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌ల‌మ‌నేరుకు ప‌క్క‌నే ఉంది. పైగా ప‌ల‌మ‌నేరులోని ఓ మండ‌లం ఇంత‌కుముందు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఉండేది దీంతో టీడీపీ ఇక్క‌డ బ‌లంగా ఉంది. 2009లోనూ ఇక్క‌డ అమ‌ర్‌నాథ్ రెడ్డి టీడీపీ నుంచే విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గం బాగానే అభివృద్ధి చెందింది. ఇది ఆయ‌న‌కు ప్ల‌స్ పాయింట్ గా క‌నిపిస్తోంది. ప‌దేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌కు ఇక్క‌డ బ‌ల‌మైన అనుచ‌ర వ‌ర్గం, నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టుంది. అయితే, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు ఉండ‌టం ఆయ‌న‌కు మైన‌స్ గా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అమ‌ర్ నాథ్ రెడ్డిపై స్వ‌ల్ప తేడాతో ఓడిన సుభాష్ చంద్ర‌బోస్ కు ఈసారి టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డం ఆయ‌న ముందు రెబ‌ల్ గా నామినేష‌న్ వేసి చంద్ర‌బాబు బుజ్జ‌గింపుతో ఉప‌సంహ‌రించుకున్నారు. అయినా, ఆయ‌న వ‌ర్గం పూర్తిస్థాయిలో పార్టీ కోసం ప‌నిచేయ‌లేదు.

గ‌ట్టి పోటీ ఇచ్చిన వెంక‌ట‌య్య గౌడ్‌

అమ‌ర్ నాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోవ‌డంతో వైసీపీకి మొద‌ట్లో ఇక్క‌డ నాయ‌క‌త్వ‌లోపం క‌నిపించింది. త‌ర్వాత వెంక‌ట‌య్య‌గౌడ్ అనే బీసీ వ‌ర్గానికి చెందిన యువ‌నేత‌కు ఆ పార్టీ నియోజ‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చి ఆర్థికంగా ఎదిగిన ఆయ‌న‌కు మంచి పేరుంది. రెండేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌చారంలోనూ ఆయ‌న ముందున్నారు. అయితే, రాజ‌కీయాల‌కు కొత్త కావ‌డం, మొద‌టిసారే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవ‌డం ఆయ‌న‌కు స‌మ‌స్య‌గా మారింది. ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గంలో బీసీలు, రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం వారు గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. వైసీపీ బీసీ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో ఆ పార్టీ వైపు వారు మొగ్గు చూపుతార‌నే అంచ‌నాలు ఉన్నాయి. టీడీపీ అభ్య‌ర్థి రెడ్డి సామాజ‌క‌వ‌ర్గం వారే అయినా వైసీపీ వైపు ఆ సామాజ‌క‌వ‌ర్గం వారు ఎక్కువ‌గా సానుకూలంగా ఉన్నారు. మొత్తంగా సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు చూసుకుంటే వైసీపీ కూడా బ‌లంగానే క‌నిపిస్తున్నా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి, అమ‌ర్‌నాథ్ రెడ్డికి బ‌లంతో ఆ పార్టీకి విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అయితే, మొద‌ట ఊహించిన దాని కంటే వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట‌య్య‌గౌడ్ అమ‌ర్ నాథ్ రెడ్డికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో అమ‌ర్‌నాథ్ రెడ్డి గెలిచినా స్వ‌ల్ప మెజారిటీ మాత్రమే ద‌క్కవ‌చ్చు అనే అంచ‌నాలు ఉన్నాయి. పోలింగ్ స‌ర‌ళి ప‌రిశీలించాక వైసీపీలోనూ గెలుపుపై ఆశ‌లు పెరిగాయి.

Tags:    

Similar News