ఎందుకిలా మాట మార్చాల్సి వచ్చిందో?

సమయం, సందర్భం లేకుండా వివిధ వేదికలపై భారత్ పై విద్వేషం వెళ్లగక్కడం దాయాది దేశమైన పాకిస్థాన్ కు వెన్నతో పెట్టిన విద్య. జమ్ము కశ్మీరును భారత్ లో [more]

Update: 2021-06-04 16:30 GMT

సమయం, సందర్భం లేకుండా వివిధ వేదికలపై భారత్ పై విద్వేషం వెళ్లగక్కడం దాయాది దేశమైన పాకిస్థాన్ కు వెన్నతో పెట్టిన విద్య. జమ్ము కశ్మీరును భారత్ లో అంతర్భాగంగా గుర్తించబోమని, అది వివాదాస్పద ప్రాంతమని ఆది నుంచి అదే పనిగా ఇస్లామాబాద్ పెద్దలు అల్లరి చేస్తున్న సంగతి కొత్తేమీ కాదు. కశ్మీర్ సమస్య తేలనంతవరకూ భారత్ తో సంబంధాలు మెరుగుపడే అవకాశం లేదని పాకిస్థాన్ విధాన నిర్ణేతలు ప్రేలాపనలు చేయడం తెలిసిందే. ఇస్లామాబాద్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ దేశ విధానం ఇదే. 370 వ అధికరణ రద్దు నాటి నుంచి పాకిస్థాన్ మరీ మొండిగా వ్యవహరిస్తోంది. మంకుపట్టు పడుతోంది. ఇదీ ఇప్పటివరకూ ఇస్లామాబాద్ విధానంగా ఉంది.

వైఖరి మార్చుకుని…..

తాజాగా పాకిస్థాన్ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ అధికరణ రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని పేర్కొనడం సంచలనం కలిగిస్తోంది. స్థానికంగా ‘సామా’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 370 అధికరణం గురించి తాము ఆందోళన చెందడం లేదని, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అక్కడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ ఆందోళన అంతా 35 ఏ అధికరణ గురించేనని మరింతగా స్పష్టీకరించారు. 370, 35ఏ అధికరణ మధ్య చాలా తేడా ఉందని ఖురేషి పేర్కొన్నారు. 370వ అధికరణం ప్రకారం కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది. రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు మినహా ఇతర అంశాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. 2019 ఆగస్టు మొదటివారంలో ఈ అధికరణను రద్దు చేశారు. దీని రద్దు వల్ల కశ్మీరుకు కొత్తగా, ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదన్నది పాకిస్థాన్ పెద్దల అభిప్రాయంగా ఉంది.

ముఖచిత్రాన్ని మార్చేస్తుందని….?

35ఏ అధికరణ రద్దు గురించే ఆందోళన చెందుతున్నట్లు పాకిస్థాన్ పేర్కొంటోంది. 370 వ అధికరణను తొలిరోజుల్లోనే రాజ్యంగంలో చేర్చారు. 35ఏ అధికరణను రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారా 1954లో రాజ్యాంగంలో జోడించారు. దీని ప్రకారం కశ్మీరులో శాశ్వత నివాసానికి సంబంధించి నిర్వచించే అధికారాన్ని శాసనసభకు కట్టబెట్టారు. ఈ అధికరణం ప్రకారం కశ్మీరేతరులు ఇక్కడ స్థిరాస్తులను సమకూర్చుకోవడం నిషిద్ధం. శాశ్వత నివాసాలను ఏర్పరచుకోరాదు. ఇళ్లు, భూములను కొనరాదు. ఈ నేపథ్యంలో 370 కన్నా 35ఏ అధికరణ రద్దు వల్లే కశ్మీరుకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని పాకిస్థాన్ వాదిస్తోంది. ఇతర రాష్టాల వారు కశ్మీరుకు రావడం వల్ల ఇక్కడి సామాజిక సమీకరణల్లో మార్పు వస్తుందని, స్థానిక పౌరుల ప్రాధాన్యం తగ్గి స్థానికేతరుల ప్రాబల్యం పెరుగుతందని, అంతిమంగా ఇది కశ్మీరు ముఖ చిత్రాన్నే మార్చి వస్తుందన్నది పాకిస్థాన్ పెద్దల అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

శాంతిభద్రతలు…..?

ఖురేషీ వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ కశ్మీరు గురించి పాకిస్థాన్ నేతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ప్రజల కన్నా భారత్ లోని కశ్మీరీల పరిస్థితి వందరెట్లు మెరుగ్గా ఉంది. ప్రజల ప్రాథమిక హక్కులకు పూర్తి రక్షణ ఉంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు రక్షా కవచంగా పనిచేస్తోంది. ఒక్క కశ్మీరులోనే కాదు దేశంలో ఎక్కడా మైనార్టీల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదు. ఈ అధికరణలు రద్దు చేసిన తరవాతే సరిహద్దు రాష్ర్టంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడింది. అవాంఛనీయ సంఘటలనకు చోటు లేకుండా పోయింది. ముష్కరుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో కిందిస్థాయిలో పాలన పగ్గాలు ప్రజల చేతికి అందాయి. పాకిస్థాన్ ఇప్పుడు శ్రద్ధ పెట్టాల్సింది కశ్మీరు గురించి కాదు. తన పరిధిలోని ఆక్రమిత కశ్మీరు గురించి. ఆ పాత్రను సమర్థంగా పోషిస్తే ఈ ప్రాంతంలో శాంతి వికసిస్తుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News