ఇమ్రాన్ రెచ్చగొట్టడం మానుకోవడం లేదుగా?

జమ్ము కశ్మీర్ కు సంబంధించిన 370, 35ఏ అధికరణలను రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశమైన పాకిస్థాన్ కు దిక్కూదరి తోచడం లేదు. ఏం చేయాలో [more]

Update: 2020-10-04 16:30 GMT

జమ్ము కశ్మీర్ కు సంబంధించిన 370, 35ఏ అధికరణలను రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశమైన పాకిస్థాన్ కు దిక్కూదరి తోచడం లేదు. ఏం చేయాలో పాలుపోక ఇస్లామాబాద్ విపరీత చేష్టలకు పాల్పడుతోంది. అంతర్జాతీయ వేదికలపై నానాయాగీ చేసి హతాశురాలైంది. అరబ్ ప్రపంచంలో మద్దతు కోసం ప్రయత్నం చేసి ఆశాభంగానికి గురైంది. చివరికి కశ్మీర్ వేర్పాటువాద నాయకుడైన హురియత్ అధినేత గిలానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘నిషాన్ -ఇ- పాకిస్థాన్’ ప్రకటించి భారత్ ను రెచ్చగొట్టింది. ఇది మన దేశంలోని భారతరత్నతో సమానమైనది.

ఐదో రాష్ట్రంగా….

తాజాగా గిల్గిత్-బాల్టిస్టాన్ ను అయిదో రాష్ట్రంగా ప్రకటించనున్నట్లు పేర్కొని కుటిలత్వాన్ని చాటుకుంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు కశ్మీర్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గండపురి తెలిపారు. ఈ ప్రకటనతో భారత్ తో పాటు అంతర్జాతీయ సమాజం ఆశ్ఛర్యాన్ని వ్యక్తం చేసింది. ఆక్రమిత, వివాదాస్పద ప్రాంతంపై ఎలాంటి చర్చలు లేకుండా, ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారన్న భారత్ సూటి ప్రశ్నకు దాయాది దేశం నుంచి సమాధానం కరవైంది. ప్రస్తుతం పాక్ లో పంజాబ్, సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫక్తూన్ క్వా ప్రావిన్స్ లు ఉన్నాయి.

మన సరిహద్దుల్లో…..

మన దేశంలోని రాష్ట్రాలను పాక్ లో ప్రావిన్స్ లుగా పిలుస్తుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల బాల్టిస్టాన్ అయిదోది అవుతుంది. భారత్ లోని పంజాబ్ సరిహద్దుల్లో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ఉంది. ఇది దేశంలోని సంపన్న ప్రావిన్స్. దేశ రాజకీయాలను ఇది ప్రభావితం చేస్తుంటుంది. దీని రాజధాని లాహోర్ మన పంజాబ్ లోని అమత్ సర్ నగరానికి చాలా దగ్గరలో ఉంది. మరో పెద్ద ప్రావిన్స్ సింధ్. ఇక్కడ హిందూ జనాభా కూడా ఉంది. దీని రాజధాని కరాచీ నగరం దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. అరేబియా సముద్ర తీరాన విస్తరించిన ఈ నగరంలో స్టాక్ ఎక్స్ఛేంచి ఉంది. భారత్ లోని గుజరాత్ సరిహద్దుల్లో ఈ ప్రావిన్స్ విస్తరించి ఉంది. భుట్టోల కుటుంబ పార్టీ అయిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి ఇక్కడ మంచి పట్టుంది. ఖబైర్ ఫక్తూన్ క్వా ప్రధాని ఇమ్రాన్ సొంత ప్రావిన్స్.

వెనకబడిన ప్రాంతం….

విస్తీర్ణ పరంగా పెద్దదైన బలూచిస్థాన్ వెనకబడిన ప్రావిన్స్. గిల్గిత్ – బాలిస్టాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భాగం. దీనిని తొలిరోజుల్లో ఉత్తర ప్రాంతం (నార్తన్ ఏరియా) అని వ్యవహరించేవారు. 2009లో నాటి పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ (దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో భర్త, ప్రస్తుత పీపీపీ అధినేత బిలావల్ భుట్టో తండ్రి) పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించారు. గిల్గిత్- బాలిస్టాన్ కు పశ్చిమాన ఖైబర్ ఫక్తూన్ క్వా ప్రావిన్స్, ఉత్తరాన అఫ్ఠనిస్థాన్, తూర్పున చైనా, దక్షిణాన భారత్ ఉన్నాయి. గిల్గిట్ 14 జిల్లాలతో విస్తరించి ఉంది. జనాభా దాదాపు పన్నెండున్నర లక్షలు. 33 అసెంబ్లీ సీట్లున్నాయి. ముఖ్యమంత్రి మీర్ అఫ్జల్, గవర్నర్ హుస్సేన్ మక్సూల్. రాజధానినగరం గిల్గిత్. సుమారు 72,971 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇక్కడి ప్రజలు కూడా భారత్ ను వ్యతిరేకిస్తున్నారు. పాక్ లో అయిదో రాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు.

నేషనల్ అసెంబ్లీ, సెనేట్ లలో….

అయిదో రాష్ట్రంగా ఏర్పడటం ద్వారా ఈ ప్రాంతానికి పాక్ నేషనల్ అసెంబ్లీ (మన లోక్ సభ), సెనెట్ (మన రాజ్యసభ) లో ప్రాతినిథ్యం లభిస్తుంది. ప్రస్తుతం చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిథ్యం లేకపోవడం గమనార్హం. భారత్ లోని జమ్ము కశ్మీర్ కు మొన్నమొన్నటి దాకా స్వయం ప్రతిపత్తి ఉండేది. కేంద్ర చట్టసభల్లో మొదటి నుంచీ ప్రాతినిథ్యం ఉంది. ప్రత్యేకంగా శాసనసభ, శాసనమండలి కూడా ఉంది. గత ఏడాది 370, 35ఏ అధికరణల రద్దు తరవాత జమ్ము-కశ్మీర్, లడఖ్ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన విషయం విదితమే. కశ్మీర్ కు అసెంబ్లీ, సీఎం ఉంటారు. లడఖ్ పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. భారత్ పరిధిలోని కశ్మీర్ కు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కు గల తేడా ఇది. కశ్మీరీల పట్ల, వారి హక్కుల పట్ల, సంక్షేమం పట్ల భారత్ కు పూర్తి చిత్తశుద్ధి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ పట్ల ఆ దేశానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనడానికి ఇప్పటివరకూ జరిగిన చరిత్రే నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News