దాయాదికి అంత దమ్ముందా…?

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు , రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం తేలికైన [more]

Update: 2019-08-08 16:30 GMT

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు , రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతీయంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం తేలికైన పనే. కానీ అంతర్జాతీయంగా ఎదురయ్యే ఇబ్బందుల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఈ విషయంలో స్థూలంగా అంతర్జాతీయ సమాజం భారత్ వైపే ఉన్నట్లు కనపడుతున్నప్పటికీ పాకిస్థాన్ నానాయాగీ చేయడం ఖాయం. అంతేకాకుండా ఇతర దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపడం అనివార్యం. ఇప్పటికే అరకొరగా ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తాయి. సమీప భవిష‌్యత్తులోనూ గాడిన పడే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. అంతర్జాతీయంగా భారత్ ను దోషిగా చూపేందుకు పాక్ కు అవకాశం లభించి నట్లవుతుంది. అయినా అంతిమంగా భారత్ వాదనకే అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉంటుందన్నది వాస్తవం.

దోషిగా చూపేందుకు….

భారత ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. భారత్ తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించాలని, ఇరు దేశాల మధ్యగల ద్వైపాక్షిక ఒప్పందాలను పున: సమీక్షించాలని, పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న కాశ్మీరీల సంఘీభావ దినంగా పాటించాలని పాక్ నిర్ణయించింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసింది. లాహోర్ భారత్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసింది. బాలివుడ్ సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ అజయ్ బిసా రియాను బహిష్కరించింది. ఢిల్లీలో బాధ్యతలను స్వీకరించాల్సి ఉన్న తమ రాయబారి మొయిన్ ఉల్ హక్ ను అక్కడికి పంపరాదని నిర్ణయించింది. ఇకపై తమ రాయబారులు ఎవరూ ఢిల్లీలో ఉండరని, ఇస్లామాబాద్ లో ఉన్న భారత రాయబారులను వెనక్కు పంపిస్తామని పాక్ ప్రకటించింది. అంతర్జాతీయంగా భారత్ ను దోషిగా చూపేందుకు గల అవకాశాలను అన్వేషిస్తోంది. కాశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. కాశ్మీర్ కు గల ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా భారత్ తనకు తాను హాని చేసుకుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

అంతర్జాతీయ సమాజం నుంచి…..

ద్వైపాక్షిక అంశాలను పక్కన పెడితే అంతర్జాతీయంగా భారత్ ను ఇరుకునపెట్టే, ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఇస్లామాబాద్ కు లేవన్నది విశ్లేషకుల వాదన. ఇప్పటి వరకూ ఏ ఒక్క దేశం కూడా భారత్ చర్యను ఖండించలేదు. అరబ్ దేశాలు, పాక్ అనుంగు మిత్రదేశం చైనా స్పందనలు పొడిపొడిగానే ఉన్నాయి. ఏకపక్షంగా పాక్ ను వెనకేసుకు రావడం గాని, భారత్ పై ధ్వజమెత్తడం గాని అవి చేయలేదు. ఇక పెద్దన్న అమెరికా సంగతి సరేసరి. కాశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. ఇది ఒకరకంగా ఆయనకు భంగపాటు. లేని పెద్దరికాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించిన అగ్రరాజ్యాధినేత కు భారత్ వ్యూహం తెలియక బొక్క బోర్లా పడ్డారు. 60వ దశకంలో చైనాతో యుద్ధం తర్వాత మధ్యవర్తిత్వానికి అమెరికా, బ్రిటన్ లు ప్రయత్నించాయి. కానీ కాశ్మీర్ లోయను భారత్ ఎన్నటికీ వదులుకోదని నెహ్రూ ప్రకటించడంతో ఆ దేశాలు మిన్నకుండిపోయాయి. బౌద్ధదేశం భూటాన్ పూర్తిగా భారత్ వైపే ఉంది. హిమాలయ పర్వత రాజ్యం నేపాల్ కు భారత్ పై ఒకింత అసంతృప్తి ఉన్నప్పటికీ కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు. ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని ప్రకటించడం ద్వారా శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తన వైఖరిని తెలియజేశారు. కర్ర విరగకుండా పాము చావకుండా అన్న చందాన చైనా స్పందన ఉంది. కాశ్మీర్ సమస్యను ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఒకపక్క సుద్దులు చెబుతోంది. మరోపక్క ఈ విషయంలో అమెరికా సహా వివిధ దేశాలు చేసే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

పెద్ద పెద్ద మాటలతో…

అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా ప్రతిస్పందన లేనప్పటికీ పాక్ మాత్రం పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోంది. పుల్వామా తరహా దాడులను మరిన్ని జరగవచ్చని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. రెండు దేశాల మధ్య యుద్ధం జరగవచ్చు. యుద్ధంలో ఎవరూ గెలిచే పరిస్థితి ఉండదు. దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని పాకిస్థాన్ పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సహా అన్ని వేదికలపై పోరాడతానని ఇమ్రాన్ ప్రతిన చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, ప్రపంచదేశాల అధినేతలను కలుస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యస్ ఎర్డోగన్ లతో మాట్లాడారు. వారి నుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదు. కాశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని మాత్రమే మలేషియా ప్రధాని పేర్కొన్నారు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. కాశ్మీరీల స్వీయ నిర్ణయానికి మద్దతు ఇస్తామని టర్కీ అధ్యక్షుడు తెలిపారని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అయితే టర్కీ అధ్యక్షుడు మాత్రం తనకు తాను ఎటువంటి ప్రకటన చేయకపోవడం విశేషం. మొత్తం మీద వచ్చే నెలలో న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య ప్రతినిధి సభలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తాలని పాక్ యోచిస్తోంది. ఇప్పటి వరకూ అనేక మార్లు అంతర్జాతీయ వేదికలపై భంగపాటుకు గురైన పాక్ కు మళ్లీ అలాంటి అనుభవం ఎదురవ్వడం అనివార్యం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News