‘‘పైసా’’తో మోడీ ఢమాల్

Update: 2018-05-31 15:30 GMT

పైసా మే పరమాత్మ అని ఊరకనే అనరు. డబ్బు సంపాదించడానికి ఎంతగా తాపత్రయపడతారో, కోల్పోవాల్సి వచ్చినప్పడు అంతగానూ బాధపడతారు. పైసా అంటే డబ్బులు అనేది సర్వసాధారణ అర్థం. ఒక నాణెంగా చెల్లుబాటులోనే లేని నయా పైసా అధికార పార్టీకి ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కమలంలో కల్లోలం సృష్టిస్తుందని కలలో అయినా అనుకుని ఉండరు. రూపాయల్లో ధరలు పెంచి దోపిడీ చేస్తుంటే ఇది మామూలే కదా అని పెదవి విరిచి సరిపెట్టుకున్నారు. అంతర్జాతీయంగా ధర పడిపోయినప్పుడు అదనపు సుంకాలు వేసి జేబు కొట్టేస్తుంటే ఈ దగా నూ దులిపేసుకున్నారు. లీటరు పెట్రోలు కొట్టిస్తున్న ప్రతి సామాన్యుడూ సర్కారులు తమను కుళ్ల బొడుస్తున్నాయని తెలిసినా కిమ్మనకుండా మౌనం వహించాడు. కానీ పైసా తగ్గించి తమ జీవితాలను పరిహాసం చేస్తున్న తాజా ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీగా రేట్లు పెంచినప్పుడు కూడా జరగని రాజకీయ నష్టం భారతీయ జనతాపార్టీకి పైసా తగ్గింపు సమకూర్చి పెట్టింది. ఆయిల్ కంపెనీల అత్యుత్సాహం అసలుకే మోసం తెచ్చిపెట్టింది. కేంద్రం ఊహించని ఈ పరిణామం పొలిటికల్ సర్కిళ్లలో బాగా నలుగుతోంది. ప్రజలపై పరాచికంగా పైకి కనిపించినా బీజేపీ గుండెల్లో పైసా మోత మోగిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా సాగిన పెట్రో దోపిడీ మరొక్కసారి చర్చనీయమవుతోంది.

‘పైసా’చికం...

ఆర్థికంగా మోడీ ప్రభుత్వమంత అదృష్టశాలి ఎవరూలేరని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చేసరికి అంతర్జాతీయ మార్కెట్ లో బారెల్ పెట్రోలియం ఉత్పత్తుల ధర 146 డాలర్లు ఉండేది. సాధారణంగా వినియోగదారుడు కొనుగోలు చేసే లీటరు పెట్రోలు ధర 80 రూపాయలు ఉండేది. ఆ తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పడిపోతూ వచ్చాయి. 2015 జనవరి నాటికి బ్యారెల్ 62డాలర్లకు పడిపోయింది. ఆతర్వాత కాలంలో 35 నుంచి 40 డాలర్ల వరకూ కూడా ధర తగ్గిపోయింది. ఈ తగ్గుదల ను వినియోగదారునికి బదలాయించకుండా కేంద్రప్రభుత్వం అదనపు సుంకాలు, పన్నుల రూపంలో ఒడిసిపట్టేసింది. 2014లో ఏటా 98 వేల కోట్ల రూపాయలమేరకు ఉన్నపెట్రో ఎక్సైజ్ ఆదాయాన్ని 2017 నాటికి రెండు లక్షల 40 వేల కోట్లకు పెంచుకుంది. 2002లో వాజపేయి హయాంలోనే ధరల నియంత్రణ వ్యవస్థను ఎత్తివేశారు. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర తగ్గితే తగ్గించాలి. పెరిగితే పెంచాలి. ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. దీనికి వక్రభాష్యాలు చెప్పి ధరలు తగ్గినా అదనపు సుంకాలతో ప్రజలపైనే పైశాచికత్వాన్ని ప్రదర్శించింది కేంద్రప్రభుత్వం. ఎంతగానో రేట్లు పెరిగిపోతున్నాయంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల బ్యారెల్ ధర 72 డాలర్లు మాత్రమే. దీనిని భారత కరెన్సీలోకి మార్చుకుంటే లీటరు 31 రూపాయల సగటు పడుతుంది. ఇదంతా సామాన్యునికి అర్థం కాకుండా మాయ చేస్తోంది కేంద్రప్రభుత్వం. ప్రతి 100రూపాయల పెట్రోలు కొనుగోలులో కేంద్రరాష్ట్రప్రభుత్వాలకు చెల్లించే పన్నుల మొత్తం 51 రూపాయల వరకూ ఉంది. 100 రూపాయల డీజిల్ కొనుగోలులో 46 రూపాయలు పన్నులే. ప్రభుత్వం ఎలాగూ దాచిపెడుతోంది. విపక్షాలు సైతం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాయి.

ప్రధానికీ ఇరకాటం...

తాజాగా లీటరుపై పైసా తగ్గింపు అనేది సోషల్ మీడియాలో విస్తృత వ్యాప్తిలోకి రావడం ప్రధానికి సైతం ఇరకాటమే. ఎక్కువగా సోషల్ మీడియాను తన ప్రచారానికి వినియోగించుకునే మోడీకి దాని ప్రభావం ఎంత తీవ్రమైనదో తెలుసు. రేట్ల పెంపుదల, తగ్గింపులతో తమకు సంబంధం లేదని మంత్రులు ప్రకటనలు చేయవచ్చు.కానీ ప్రజలు విశ్వసించని స్థితి. కర్ణాటక ఎన్నికల సందర్బంగా దాదాపు 15 రోజులపాటు ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచకుండా ప్రభుత్వం కంట్రోల్ చేసింది. ఎన్నికల గడువు ముగిసిన వెంటనే రేట్లు పెరిగాయి. దీనిని బట్టి ఇంకా ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయనుకోవచ్చు. లీటరు పెట్రోలుపై పైసా తగ్గింపు అనేది ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చేయకపోయి ఉండవచ్చు. యథాలాపంగా చేసిన ఈ చర్య కేంద్రానికి ఎంతో డ్యామేజీ చేసి పెట్టింది. ప్రచారంలో మోనార్క్ అయిన ప్రధానికి పైసా దెబ్బ ఎంత ఘాటుగా తగులుతుందో తెలిసివచ్చింది.

సామాన్యుడి సరదా...

తనపై తానే జోకులు వేసుకుంటూ కష్టాలు, కన్నీళ్లలో ఆనందం వెతుక్కోవడం మధ్యతరగతి మనిషికి బాగా తెలుసు. ‘ పైసా తగ్గింది. పండగ చేసుకుందాం., ఈ రోజు పొదుపు అయిదు పైసలు.’ ఇలా రకరకాల రూపాల్లో ఒకరినొకరు ఆటపట్టించుకోవడం, మెసేజ్ లు షేర్ చేసుకోవడం విస్తృతంగా సాగింది. కేంద్రప్రభుత్వ విధానాలపై ఇటీవలికాలంలో ఇంతటి హాస్యం పంచిన ఘట్టం మరొకటి లేదోమో. పైకి ఎగతాళిగా నవ్వుకుంటున్నప్పటికీ లోలోపల ఏదో తెలియని ఉక్రోషం, ఆక్రోశం అంతరాంతరాల్లో మెలిపెడుతున్నట్లే ఉంది. ఎందుకంటే ఇది సామాన్యుడి నిత్యావసర సరుకు. ఇతర ధరల హెచ్చుతగ్గులకూ ప్రేరకం. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంచనా ప్రకారం దేశంలోని పెట్రోలు వినియోగంలో 60 శాతం వాటా ద్విచక్రవాహనదారులు వాడుతున్నదే. అందుకే వారిపైనే ఎక్కువ భారం నేరుగా పడుతోంది. అందులోనూ స్కూటర్లు, బైక్ లు వాడే వాళ్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే. 36 శాతం పెట్రోలును మాత్రమే కార్లు, ఇతర పెద్ద వాహనాలు వినియోగిస్తున్నాయి. తాను మధ్యతరగతి నుంచి వచ్చానంటూ చెప్పే మోడీ, అతని ప్రభుత్వమూ అదే తరగతి ప్రజలను ధరాభారంతో మోదేస్తున్నట్లే భావించాలి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News