కౌశిక్ రెడ్డి ఎటూ కాకుండా పోయారా?

చిన్న వయసు. ఎంతో భవిష్యత్ ఉంది. రాజకీయంగా కూడా అండదండలున్నాయి. అన్నీ ఉంచుకుని తొలిదశలోనే తప్పటడగులు. కట్ చేస్తే ఇప్పుడు భవిష‌్యత్ అనేది ఎక్కడ అంటే వెతుక్కోవాల్సిన [more]

Update: 2021-07-13 06:30 GMT

చిన్న వయసు. ఎంతో భవిష్యత్ ఉంది. రాజకీయంగా కూడా అండదండలున్నాయి. అన్నీ ఉంచుకుని తొలిదశలోనే తప్పటడగులు. కట్ చేస్తే ఇప్పుడు భవిష‌్యత్ అనేది ఎక్కడ అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిగా మారారు. ఏ పార్టీలోనూ టిక్కెట్ దక్కే పరిస్థితి లేదు. తాను తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరాల్సిన పరిస్థితి కౌశిక్ రెడ్డి చేజేతులా తెచ్చుకున్నారు.

కాలం కలసిరాక…?

రాజకీయాల్లో ఏదీ అనుకున్న సమయానికి దక్కదు. కాలం కలిసొస్తేనే పదవులు నడిచొస్తాయి. దీనిని కౌశిక్ రెడ్డి మర్చిపోయినట్లున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ అభ్యర్థి కావడంతో ఎవరూ పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. కౌశిక రెడ్డి ముందుకు రావడం, కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడం జరిగిపోయింది.

తన బలమనుకుని భ్రమించి…

అయితే కాంగ్రెస్ బలంతో కౌశిక్ రెడ్డి ఆ ఎన్నికల్లో యాభై వేల ఓట్లను సాధించారు. రెండో ప్లేస్ లో నిలిచారు. అయితే ఇదంతా పార్టీ బలం కాదు తన బలం అనుకుని కౌశిక్ రెడ్డి భ్రమించారు. నియోజకవర్గంలో తాను లేకపోతే కాంగ్రెస్ లేదని భావించారు. అందుకే ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే ఆయనపై విమర్శలు అందుకున్నారు. పార్టీ లైన్ తెలుసుకోకుండా ఈటలపై విమర్శలు చేయడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయ్యారు.

ఎటూ కాకుండా..?

మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర బంధువు కావడంతో కాంగ్రెస్ టిక్కెట్ ఈసారి కూడా తనకేనని కౌశిక్ రెడ్డి అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డికి పగ్గాలు దక్కడంతో కొంత డైలమాలో పడ్డారు. అంతకుముందే మంత్రి కేటీఆర్ తో మంతనాలు జరపడం, టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు లీకులు రావడంతో కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ కొంత దూరం పెట్టింది. తనకు టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫర్మ్ అయిందన్న ఆడియో లీకు కావడంతో పార్టీ నుంచి బహిష్కరించింది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. కౌశిక్ రెడ్డి ఇటు కాంగ్రెస్ ను ఓడించాలన్న కసితో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాల్సిందే. చిన్న వయసులో పెద్ద అవకాశమొచ్చినా దానిని కౌశిక్ రెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోయారని, దూకుడు స్వభావం కొంపముంచిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News