బిశ్వభూషణుడు తొందరపడరట ?

ఏడాది క్రితం ఏపీకి గవర్నర్ గా ఒడిషాకు చెందిన పెద్దాయన బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఇక్కడ యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. గవర్నర్ వయసు 86 ఏళ్ళు, [more]

Update: 2020-07-20 00:30 GMT

ఏడాది క్రితం ఏపీకి గవర్నర్ గా ఒడిషాకు చెందిన పెద్దాయన బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఇక్కడ యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. గవర్నర్ వయసు 86 ఏళ్ళు, సీఎం జగన్ ఆయన అనుభవానికి, వయసుకూ కూడా చాలరు, దాంతో ఇది మంచి సమతుల్యం అనుకున్నారు. ఇక ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీల నుంచి వచ్చినాయన. దాంతో జగన్ కి ఆయన నుంచి అడ్డంకులు ఏవైనా వస్తాయా అన్న భయం కూడా కొత్తలో ఏర్పడింది. కానీ అలా కాకుండా ఏడాదిగా జగన్ కి బాగానే సహకరిస్తున్నారు. ఏపీ సర్కార్ ఈ బిల్లు పంపినా, ఆర్డినెన్స్ చేసినా రాజముద్ర వేస్తున్నారు. ఇపుడు మాత్రం ఆయనకు కొంత సంక్లీష్టమైన పరిస్థితే ఎదురయ్యేలా ఉంది.

అతి కీలకం …

మూడు రాజధానుల బిల్లు ఇపుడు గవర్నర్ కోర్టులో ఉంది. గవర్నర్ రాజముద్ర కోసం ఎదురుచూస్తోంది. ఇది వైసీపీకి ప్రతిష్టాత్మకమైన వ్యవహారం. జగన్ సర్కార్ ఏడు నెలలుగా ఈ బిల్లు మీదనే దృష్టి పెట్టి ఉంది. మరో వైపు విపక్షం మొత్తంగా ఈ బిల్లుని అడ్డుకుంటోంది. శాసనమండలిలో ఒకసారి అడ్డుకుని సెలెక్ట్ కమిటీ దాకా కధ నడిపిన టీడీపీ రెండవసారి అసలు చర్చ కూడా జరగకుండా చేసింది. దాంతో ఇపుడు రాజ్యాంగం ప్రకారం ఆటోమెటిక్ గా బిల్లు ఉభయ సభల ఆమోదం పొందినట్లుగా భావించి వైసీపీ చట్టం కోసం గవర్నర్ వద్దకు బిల్లు పంపింది. దాంతో ఈ బిల్లు మీద తన సంతకం పెట్టాలంటే గవర్నర్ కూడా చాలా ఆలోచించాల్సిందేనని అంటున్నారు.

అనుభవమేనా…?

గవర్నర్ కి వైసీపీ సర్కార్ మీద నమ్మకం కాస్తా ఒక ఘటనతో తగ్గిందని అంటారు. పెద్దగా కసరత్తులేవీ చేయకుండా పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కి గవర్నర్ రెండవ మాట లేకుండా సంతకం పెట్టేశారు. అది హై కోర్టులో సవాల్ చేస్తే అడ్డంగా కొట్టేశారు. దాని వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట ఎంత వచ్చిందో గవర్నర్ కి కూడా అంతేలా ఇబ్బంది వచ్చింది. దీంతో ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతీ బిల్లును ఒకటికి పదిసార్లు చూడాలని గవర్నర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

సాగదీస్తారా…?

ఇపుడు మూడు రాజధానుల బిల్లు విషయంలో గవర్నర్ అసలు తొందరపడరని అంటున్నారు. ఆయన కొంత సమయం తీసుకుని మరీ మొత్తానికి మొత్తం ఆకళింపు చేసుకుంటారని కూడా రాజ్ భవన్ వర్గాల భోగట్టా. అసలు శాసనమండలి ఒకసారి సెలెక్ట్ కమిటీ అన్న తరువాత దానికి ఉన్న అధికారం ఎంతవరకూ ఉంటుంది. ఇక ఏ చర్చా లేకుండా వాయిదా పడిన తరువాత ఆటోమేటిక్ గా బిల్లు ఆమోదం పొందినట్లుగా భావించవచ్చా అన్న న్యాయ సందేహాలు కూదా గవర్నర్ ముందు ఉన్నాయని అంటున్నారు. అలాగే మూడు రాజధానుల విషయంలో కోర్టులో కూడా కేసులు ఉన్నాయి. అలాగే అధికార విపక్షాలు రెండూ ఈ విషయంలో పంతం మీద ఉన్నాయి. దాంతో గవర్నర్ ఆచీ తూచీ వీటి మీద నిర్ణయం తీసుకుంటారని, తొందర మాత్రం అసలు పడరని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News