ముందు ముందు మామూలుగా ఉండదట?

కరోనా…. ప్రస్తుతం ఈ పేరు చెబితేనే యావత్ ప్రపంచం ఉలిక్కి పడుతుంది. దీన్ని ఎదుర్కొనే మార్గం తెలియక తలపట్టుకుని కూర్చుంది. పేద, పెద్ద దేశమనే తేడా లేకుండా [more]

Update: 2020-04-12 16:30 GMT

కరోనా…. ప్రస్తుతం ఈ పేరు చెబితేనే యావత్ ప్రపంచం ఉలిక్కి పడుతుంది. దీన్ని ఎదుర్కొనే మార్గం తెలియక తలపట్టుకుని కూర్చుంది. పేద, పెద్ద దేశమనే తేడా లేకుండా మెుత్తం అంతర్జాతీయ సమాజం కరోనా దెబ్బకు కుదేలవుతోంది. ప్రపంచానికి, ఆధునికతకు, నాగరికతకు మార్గదర్శకమని చెప్పుకునే ఐరోపా సమాజం అతలాకుతలం అవుతోంది. ఈ ఖండంలోని ఇటలీ అత్యధిక మరణాలతో అల్లకల్లోలమవుతోంది. ప్రపంచంలో పేరుగాంచిన అమెరికా దిక్కుతోచని పరిస్ధితిలో ఉంది. ముందు జాగ్రత్త చర్యలతోనో, కొద్దికాలం తర్వాత తయారయ్యే వ్యాక్సిన్ తో కరోనాను ఎలాగోలా అధిగమించవచ్చు. కానీ మున్ముందు అంతర్జాతీయ సమాజం కుదేలవుతుందని ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత దిగజారుతుందా?

ఏ దేశానికి తగ్గ స్ధాయిలో ఆ దేశం ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఎంత సమయం పడుతుందో ఎవకూ అంచనా వేయలేకపోతున్నారు. ముందు ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలాగా అనే అంశంపై అందరుా దృష్టి సారించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రస్తుతం పెద్ద సవాల్ గా చెప్పవచ్చు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాన్ని ప్రపంచ బ్యాంక్ ముందుగానే పసిగట్టింది. ప్రపంచ దేశాల ఆర్ధకవ్యవస్ధలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొటాయని హెచ్చరిస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 10 కోట్లమంది ప్రజలు పేదరికంలోకి నెట్ట బడతారని అంచనా వేసింది. ఈ ఏడాది తుార్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు 3.5 కోట్లమంది, ఒక్క చైనాలోనే 2.5 కోట్లమంది పేదరికం నుంచి బయట పడతారని తాము తొలుత అంచనా వేశామని, కానీ కరోనా నేపద్యంలో పరిస్ధితులు మరింతగా దిగజారతాయని ప్రపంచ బ్యాంక్ అధ్యయనం హెచ్చరిస్తోంది.

కొత్తగా పేదరికంలోకి…..

అంతే కాక తుార్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు 10 కోట్లమంది ప్రజలు కొత్తగా పేదరికంలోకి నెట్టివేయబడతారని అంచనా వేసింది. తాజాగా 2020 ఏప్రిల్ లో వెలువరించిన నివేదికలో ప్రపంచబ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి, (IMF) సంస్ధతో పాటు ప్రపంచబ్యాంకు త్వరలో నిర్వహించనున్న వార్షిక సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. తుార్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో గతేడాది 5.8 శాతంగా ఉన్న ఆర్ధిక వృద్ధి రేటు ఈ ఏడాది కనీసం 2.1 శాతానికి పరిస్ధితులు మరింత దిగజారితే 0.5 శాతానికి తగ్గవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. చైనాలో గతేడాది 61 శాతంగా ఉన్న వృద్దిరేటు ఈ ఏడాది 2.3 శాతానికి, పరిస్ధితులు మరింతగా క్షీణిస్తే 0.1 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అయితే కరోనాను అధిగమించగలిగితే ఈ దేశాలు మళ్ళీ పుంజుకోగలవని స్పష్టం చేసింది.

ప్రపంచ బ్యాంకు సాయంతో….

అధ్యయనాలతోనే సరిపెట్టకుండా ఆ యా దేశాలను ఆదుకునేందుకు ప్రపంచబ్యాంకు చర్యలు చేపడుతోంది. కరోనాపై పోరుకు 25 దేశాలకు రు.74 వేల కోట్ల ఆర్ధిక సహాయం చేసేందుకు ఆమెాదం తెలిపింది. ఇందులో అత్యధికంగా మన దేశానికి రు.7 వేల కోట్లకు పైగా కేటాయించింది. మెుదటి దశ నిధులను త్వరలో విడుదల చేయనున్నట్లు బ్యాంక్ అద్యక్షుడు డేవిడ్ మల్ పాల్ తెలిపారు.మిగతా దేశాలకు వాటి అవసరాలను బట్టి నిధులు విడుదల చేస్తామని ఆయన వివరించారు. ఈ మహమ్మారిని అరికట్టే విషయంలో ప్రపంచ బ్యాంకు తనవంతు పాత్రను చిత్తసుద్ధితో పోషిస్తుందని తెలిపారు. మహమ్మారిని ఎదుర్కోవడం ఏ ఒక్క దేశానికి సొంతంగా సాధ్యపడదని, ఈ విషయంలో అన్ని దేశాలు కలసికట్టుగా కదలాలని ఆయన పిలుపివ్వడం ఆహ్వానించదగ్గ అంశం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News