పాపం జగన్…!!

హానీమూన్ అంటేనే అదో రొమాంటిక్ ఫీల్. పెళ్ళి అనే పెద్ద బరువు నెత్తి మీద పడి పూర్తయిన తర్వాత సేదతీరడానికి కాస్త టైం. అంటే ఇక మళ్లీ [more]

Update: 2019-08-14 03:30 GMT

హానీమూన్ అంటేనే అదో రొమాంటిక్ ఫీల్. పెళ్ళి అనే పెద్ద బరువు నెత్తి మీద పడి పూర్తయిన తర్వాత సేదతీరడానికి కాస్త టైం. అంటే ఇక మళ్లీ ఇలాంటి ఛాన్స్ రాదు అని చెప్పేందుకు ముందుగా హానీమూన్ వచ్చేస్తుంది. ఇకపై బాధ్యతలు మీదపడి ఏమైపోతారోనని ముందే భయపెట్టకుండా చేసుకున్న తెలివైన సదుపాయం ఇది. ఈ హానీమూన్ అన్నది ప్రతీ రంగంలో ఉంటుంది. ఓ కొత్త ఉద్యోగి ఆఫీస్ లో అడుగుపెట్టిన వెంటనే నెత్తిన మొత్తం పెట్టేయరు. మెల్లగా సర్దుకోవ‌డానికి టైం ఇస్తారు. అలాంటిది అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు మంత్రిగా కూడా అనుభవం లేదు. పైగా కొత్త రాష్ట్రం. చిందరవందరగా ఉన్న ఆర్ధిక పరిస్థితి. ఒక ఇల్లు చక్కదిద్దుకోవాలంటేనే కొంత టైం పడుతుంది. అలాంటిది పదమూడు జిల్లాల రాష్ట్రం. భౌగోళికంగా బాగా విస్తరించి ఉన్న ప్రాంతం. ఏపీకి సీఎం అయిన జగన్ కి ఆ ఆనందం ఒక్క క్షణం కూడా లేకుండా విపక్షాలు చేస్తున్నాయిగా. ఇపుడు సరదా తీరిందా అన్నట్లుగా కసి మొత్తం చూపిస్తున్నారుగా.

ఇక్కడా కూడా యూ టర్నే ….

జగన్ ముఖ్యమంత్రి ఎన్నికైన వెంటనే టీడీపీ సమావేశంలో చంద్రబాబు అన్న మాటలు అనుకూల మీడియాలో పెద్ద అక్షరాలతో వచ్చాయి. జగన్ కి ఆరు నెలల టైం ఇద్దాం. మంచి మెజారిటీతో గెలిచారు. జగన్ మీద జనం మోజు బాగా ఉందని ఫలితాలు చాటి చెప్పాయి. తప్పులైనా ఒప్పులైనా కొంతకాలం వేచి ఉండడమే బెటర్ అని బాబు దిశానిర్దేశం చేశారు. అది చదివిన వారు బాబు మంచి పని చేశారని అనుకున్నారు. కానీ కనీసం పక్షం రోజులు కూడా గడవకుండానే బాబు మొదలెట్టేశారు. జగన్ ని తూర్పారా పడుతూ రంగంలోకి దిగిపోయారు. ఇక చినబాబు ట్విట్టర్ ద్వారా కూత పెడుతూనే ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తొలి అసెంబ్లీలో గిల్లి కజ్జాలు పెట్టుకుని పాత అసెంబ్లీని గుర్తుకుతెచ్చారు. ఇదేమంటే జగన్ కి నిజానికి టైం ఇద్దామనుకున్నాం, కానీ రాక్షస పాలనని చూసి జనాలకు అండగా ఉందామని నోరు విప్పాల్సివస్తోందని సమర్దించుకున్నారు చంద్రబాబు. అంటే యూ టర్న్ ఇక్కడ కూడా తీసుకున్నారన్న మాట. ఇక లేటెస్ట్ గా చంద్రబాబు ప్రకటన ఏంటంటే రొడ్డెక్కి పోరాడుతామని. అంటే రెడీ ఫర్ ఫైట్ అన్న మాట.

ఆరు నెలల సమయమట….

ఇక కాషాయం శిబిరం తీరు ఇందుకు భిన్నంగా లేదు. ఆరు నెలల సమయం జగన్ కి ఇవ్వాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్న మాటను కూడా పార్టీ నాయకులు పట్టించుకున్నట్లుగా లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పూనకం వచ్చినట్లుగా మీడియా ముందు ప్రతీ రోజూ రెచ్చిపోతున్నారు. జగన్ వల్లే ఏపీ నాశనం అవుతోందని పెద్ద నోరు చేస్తుకుంటూంటే కొత్తగా చేరిన టీడీపీ ఎంపీలు ఇంకా రచ్చ చేస్తున్నారు. అంటే విమర్శలు చేయకపోతే తప్ప తాము జనంలో ఉండలేమనో, లేక జగన్ మరింతగా బలపడతారనో వీరి బాధగా ఉందనిపిస్తోంది.

పవన్ సయితం…..

వీరిలా ఉంటే రాజకీయాలకు కొత్త అయిన పవన్ కళ్యాణ్ సైతం ఇదే బాటలో ఉన్నారు. ఆయన ఇప్పటికి కొన్ని సార్లు పార్టీ సమీక్ష పేరుతో మీడియా ముందుకు వచ్చారు. ఆయన జగన్ కి వంద రోజుల సమయం ఇచ్చారు. కానీ అదే ప్రకటన చేసిన మరు క్షణమే మీడియాతో మాట్లాడుతూ జగన్ ను టార్గెట్ చేశారు. అంతకు ముందు అమెరికా టూర్లో జగన్ ని జైల్ నుంచి వచ్చిన నేతగా అపహాస్యం చేశారు. ఇపుడు ఆంధ్రాలో పెట్టిన పార్టీ సమావేశంలో జైలుకు వెళ్లాడు కాబట్టే జగన్ పాదయాత్ర చేశాడని కొత్త లాజిక్ బయటకు తీశారు. జగన్ హామీలు అమలుచేయలేదని కూడా ద్వజమెత్తారు. ఇంతకీ జగన్ అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయిందని. ఆయన హామీలు తీర్చకుండా పారిపోవడానికని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ‌ మాఫీని తీర్చకుండానే గద్దె దిగిపోయిన చంద్రబాబు సైతం హామీల గురించి నీతులు చెబుతున్న వేళ జగన్ కి హానీమూన్ కాదు ప్రతి నిత్యం యుధ్ధమేనంటే సరిపోతుందేమో.

Tags:    

Similar News