జగన్ కు వార్నింగ్ లు ఇలాగా?

నిజానికి సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాయి. ఒకరి పెద్దరికం మరొకరి మీద చూపించే పరిస్థితి ఎపుడూ ఎక్కడా కూడా ఉండదు. పెత్తందారీ [more]

Update: 2019-11-25 02:00 GMT

నిజానికి సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు కేంద్రం పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాయి. ఒకరి పెద్దరికం మరొకరి మీద చూపించే పరిస్థితి ఎపుడూ ఎక్కడా కూడా ఉండదు. పెత్తందారీ గిరి చేయడానికి కూడా అసలు వీలు ఉండదు. నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్తే అప్పట్లో అన్న నందమూరి తారక రామారావు మంచి మెజారిటీతో ఏపీలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని నాటి కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు పెడుతున్నపుడు ఆయన ఒక మాట అనేవారు, కేంద్రం మిధ్య అని. నిజంగా కేంద్రం మిధ్యనే. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిస్తేనే కేంద్రం. దానికి వేరే అస్థిత్వం లేదు. కానీ ఎపుడైతే జాతీయ రాజకీయాలు ఏకపక్షమవుతాయో అపుడు కేంద్రానికి ఎక్కడ లేని బలం వస్తుంది. నాడు దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ ది ఇదే తీరు అయితే ఆ పార్టీని విమర్శిస్తూ గద్దెనెక్కిన నేటి మోడీ నాయక‌త్వంలోని బీజేపీది అదే పోకడగా కనిపిస్తోంది. బలమైన కేంద్రం చెప్పుచేతల్లో రాష్ట్రాలు ఉండాలన్నది మోడీ బీజేపీ నీతిగా కనిపిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలు అందుకే మరి.

పీఎంఓ చూస్తోందట….

ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కామెంట్. నిజానికి పవన్ కి ప్రధాన మంత్రి కార్యాలయానికి సంబంధం ఏమిటి, ఆయన ఏపీలో ఒక పార్టీ నాయకుడు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ బీజేపీని చూపించి పవన్ ఈ మధ్య చాలా విధాలుగా జగన్ ని బెదిరించేలా మాట్లాడుతున్నారని అంటున్నారు. విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ మోడీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. ఆ తరువాత మరో చోట మీడియా సమావేశంలో మోడీ, అమిత్ షా కేంద్రంలో అత్యంత బలవంతులు, వారి కంటే మీరు ఎక్కువ అనుకుంటున్నారా అని జగన్ ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఇక అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే తాను ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తానని అప్పట్లో పవన్ వైసీపీ సర్కార్ ని హెచ్చరించారు. ఇపుడు ట్విట్టర్ లో పవన్ ట్వీట్ చేస్తూ ఏపీ పాలనను ప్రధానమంత్రి కార్యాలయం అంతా గమనిస్తోందని జగన్ ని బెదిరిస్తున్నారు. అంటే బీజేపీతో మిత్రునిగా ఉండేందుకు ఉబలాటపడుతున్న పవన్ కేంద్రంలోని ప్రభుత్వాన్ని తన వెనక ఉన్నట్లుగా చూపించుకుని ప్రజల మద్దతుతో బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్ సర్కార్ ని బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు.

కేంద్ర పెద్దలున్నారట….

ఇపుడు ఏపీ పొలిటీకల్ సీన్లోకి టీడీపీ మాజీ తమ్ముడు, కాషాయం పార్టీలో కొత్త పూజారి అయిన ఎంపీ సుజనా చౌదరి మళ్ళీ వచ్చారు. వస్తూనే ఆయన జగన్ మీద అనేక విమర్శలు గట్టిగా చేశారు. జగన్ కి పాలన చేతకాదని, ఆయన ఏపీని ఎక్కడికో తీసుకుపోతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీని రక్షించుకోవడం తమ ధర్మమ‌ని కూడా చౌదరి గారు అంటున్నారు. మరి ఏపీకి ఏమైందో ఏమో కానీ రక్షణ అవసరం అంటున్నారు. ఇవన్నీ అనేసిన ఈ పెద్దల సభ సభ్యుడు తాను కేంద్ర పెద్దలతో ఒ మాట్లాడే అన్నీ అంటున్నానని చెబుతున్నారు. అంటే తన వెనక కేంద్రం ఉందని, వారు చెబితేనే జగన్ మీద విమర్శలు చేస్తున్నానని చౌదరి నర్మగర్భంగా చెబుతున్నారన్న మాట. ఓ విధంగా ఇది జగన్ ని బెదిరించడానికే సుజనా కేంద్ర పెద్దల ప్రస్తావన తెచ్చాడని అంటున్నారు. అంటే జగన్ మీద కేంద్రం కోపంగా ఉందని, ఆయన మాట వినకపోతే ఏమైనా చేస్తామని చౌదరితో పాటు, పవన్ లాంటి వారు అంటున్నట్లే ఉంది. అవును కానీ ఏపీలో జనం ఎన్నుకున్న సర్కార్ ఉంది. ఇక్కడేమీ రాజకీయ సంక్షోభం లేదు, మరి చీటికీ మాటికీ కేంద్రం పేరు చెప్పి ఎందుకు బెదిరించాలనుకుంటున్నారో ఈ నాయకులే చెప్పాలి మరి.

Tags:    

Similar News