అప్పుడేమో….ఇప్పుడేమో…?

శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చాక ఏపీ రాజధాని అమరావతిపై పెద్ద ఎత్తునే చర్చ నడిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన తరువాత హైదరాబాద్ మార్క్ అభివృద్ధి [more]

Update: 2019-08-26 06:30 GMT

శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చాక ఏపీ రాజధాని అమరావతిపై పెద్ద ఎత్తునే చర్చ నడిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన తరువాత హైదరాబాద్ మార్క్ అభివృద్ధి మాకొద్దు బాబు అంటూ చంద్రబాబు కు అన్ని వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజల అభీష్టం, గత అనుభవాల రీత్యా ప్రభుత్వం నడుచుకుంటుందనే అంతా భావించారు. అయితే పదేళ్ళు అధికారానికి దూరం గా ఉండటం వల్ల ఆర్ధికంగా చితికిపోయిన టిడిపి కి ఎపి రాజధాని అమరావతి అంశం అక్షయ పాత్రలా తగిలింది. దాంతో అక్కడ ఇక్కడ అంటూ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలో ముందే అనుకుని కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ బుట్టదాఖలు చేసింది గత ప్రభుత్వం.

టిడిపి వైఖరిపై విరుచుకుపడ్డ విపక్షాలు …

టిడిపి సర్కార్ అధికారంలో వున్నప్పుడు విపక్షాలన్ని రాజధాని అమరావతి అవకతవకలపై పెద్ద ఎత్తునే విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా బిజెపి శ్రేణులు వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి అంటూ ఉద్యమాలే చేశాయి. ఇక జనసేన రాజధాని లో బలవంతపు భూసేకరణ పై పోరాటమే చేసింది. రైతులనుంచి బలవంతంగా పంటలు పండే భూములు తీసుకుంటే నే ఉన్నా రంటూ జనసేనాని పవన్ పలు గ్రామాలు పర్యటించారు. పవన్ భరోసా తో చాలా గ్రామాలకు చెందిన రైతులు ల్యాండ్ పూలింగ్ లో తమ పొలాలు ముందుకు ఇచ్చేది లేదని ఎదురుతిరిగారు. ఇలా సాగిన నాటి ప్రస్థానానికి నేడు తెరదించేశాయి విపక్షాలు. రాజధాని అమరావతి కొనసాగింపుపై వైసిపి సర్కార్ ఆలోచనలో పడిందన్న వార్తలు వెలువెడ్డాయో ఇంకా ప్రభుత్వం అధికారికంగా తన నిర్ణయం ప్రకటించకుండానే తమ పాత నిర్ణయాలపై యూటర్న్ తీసుకుని పోరాటానికి నడుం కట్టడం మరో చర్చకు తెరతీసింది.

యు టర్న్ కి రీజన్స్ ఇవేనా …?

విపక్షాలు ప్రస్తుతం తమ పాత వైఖరికి భిన్నంగా యూటర్న్ తీసుకోవడానికి కారణాలు అనేకం అని విశ్లేషకులు చెబుతున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఉద్యమాలు చేసేందుకు సరైన అంశాలు లేకుండా పోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మైలేజ్ పెరుగుతుందని భావించి రాజధాని అమరావతి కోసం పోరాడటానికి పోటీ పడుతున్నారు. ఈ అంశం ద్వారా అన్ని పక్షాలు టిడిపి తో ఇప్పుడు చేతులు కలపడానికి ఆస్కారం లభించింది.

వైసిపి వ్యూహంతో ఖంగుతింటారా …?

విపక్షాల ఎత్తుగడలను గమనించిన జగన్ సర్కార్ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్లనుందని తెలుస్తుంది. ప్రజల మనసు ఎరిగి ప్రాంతాల వారీగా మినీ రాజధానులను ఏర్పాటు చేసి ఒకే దెబ్బకు టిడిపి, బిజెపి, జనసేన లకు చెక్ పెట్టడానికి చూస్తుంది అధికారపార్టీ. తమిళనాడు తరహాలో అధిక జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే వ్యూహాన్ని ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ప్రచారం మొదలు పెట్టింది. ఇది ఏ మేరకు ఏ పార్టీకి లబ్ది చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News