ఎవరిది గెలుపు… విశ్లేషణలయితే ఇలా?

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల కోసం విపక్షాలు కళ్లల్లో వత్తులు వేసుకుంటున్నాయి. దేశ రాజకీయ భవిష్యత్ ముఖచిత్రానికి ఇవి దర్పణం పట్టబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలను [more]

Update: 2021-05-01 15:30 GMT

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల కోసం విపక్షాలు కళ్లల్లో వత్తులు వేసుకుంటున్నాయి. దేశ రాజకీయ భవిష్యత్ ముఖచిత్రానికి ఇవి దర్పణం పట్టబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనేక సంస్థలు అందించాయి. అయితే గతంలో అనేక సందర్బాల్లో ఈ ఫలితాలు తారుమారైన ఉదంతాలున్నాయి. అందుకే కొంత సందేహం. పెట్టుకుంటూనే ఏమైనా జరగవచ్చనే అనుమానాలూ ఉన్నాయి. ఎగ్జిట్ ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటే నాలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పష్టత వచ్చినట్లే. అయితే ఎన్నిక మొత్తంలో అతి కీలకంగా భావించిన పశ్చిమబెంగాల్ ఎవరి పరం కాబోతోందనేదే మీమాంస. మిగిలిన రాష్ట్రాల ఫలితాలన్నీ ఒక ఎత్తు. పశ్చిమబెంగాల్ ఫలితం ఒక్కటే ఒక ఎత్తు. 2024లో బారత రాజకీయ రణరంగం ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆ రాష్ట్రం తేల్చబోతోంది. తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితులు నైతికంగా కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచాయని విపక్షాలు విశ్వసిస్తున్నాయి. తాజా ఫలితాలతో సాంకేతికంగా రాజకీయ సమరంలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ప్రజాతీర్పులో బీజేపీ వెనకంజ వేస్తే 2024లో సమీకరణలే మారిపోవడానికి మార్గం సుగమం అవుతుంది.

చివరి కోటలు…

దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీకి రాజకీయంగా ఇంకా పూర్తి అదుపులోకి రాని పెద్ద రాష్ట్రాలుగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ను చూడాలి. పశ్చిమబెంగాల్ లో సొంతంగానూ, తమిళనాడులో పొత్తు ద్వారానూ పాగా వేయాలని గడచిన కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కసరత్తు సాగిస్తోంది. తమిళనాట ఏఐఏడీఎంకే రూపంలో జీ హుజూర్ ప్రభుత్వం ఇప్పటివరకూ కొనసాగింది. పశ్చిమబెంగాల్ మాత్రం బీజేపీ అగ్రనాయకత్వానికే మమతా బెనర్జీ సవాల్ విసురుతోంది. తన రాజకీయ విస్తరణ సమరంలో ఈ రెంటినీ చివరి కోటలుగా బీజేపీ భావిస్తోంది. అసోం, పుదుచ్చేరి, కేరళ లలో రెండు తమ ఖాతాలోనే పడతాయని ఎగ్జిట్ అంచనాలతో ఆనందంగానే ఉంది. ఇది ముందుగా వేసుకున్న అంచనా యే. ఎగ్జిట్ పోల్స్ కూడా దానినే ధ్రువపరిచాయి. కేరళ పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే అక్కడ కనీసం పదిశాతం ఓట్లు , అయిదారు సీట్లు అయినా తెచ్చుకోగలిగితే భవిష్యత్తులో బీజేపీ బలపడటానికి అవకాశముంటుందని అంచనా. . కేరళ లో ఆనవాయితీ తప్పి మరోసారి ఎల్డీఎప్ గెలిచే చాన్సులున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అదే జరిగితే యూడీఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెసుకు ఎదురు దెబ్బే. 2024 నాటికి జాతీయ స్తాయిలో దాని ప్రాబల్యం మరింత కుచించుకుపోయి ప్రాంతీయ పార్టీల తరహాగానే ఉంటుంది. రీజనల్ పార్టీలతో పొత్తులకు అవి పెట్టే అనేకానేక షరతులను అంగీకరించాల్సి వస్తుంది. జాతీయ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ అనేక చోట్ల ఏదో ఒక ప్రాంతీయపార్టీ చాటున చేరక తప్పని స్థితి ఏర్పడబోతోంది

ఇంకా అయోమయమే…

అత్యంత ప్రతిష్టాత్మకంగా , బీకర సమరం సాగింది పశ్చిమబెంగాల్ లోనే. ఎనిమిది విడతల ఎన్నికలతో తృణమూల్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం బావించింది. ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ రాష్ట్రంలో తృణమూల్ కార్యకర్తల గూండాయిజం, వసూళ్లు పెరిగాయనేది వాస్తవం. వాటిని నియంత్రించి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలనే ఉద్దేశంతో కేంద్రం పెద్ద ఎత్తున సాయుధ బలగాలను రంగంలోకి దింపింది. కాల్పుల వరకూ సంఘటనలు దారి తీశాయి. మరోవైపు చావో రేవో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు మమతా బెనర్జీ. అటు మోడీ, అమిత్ షా ల ప్రచారం, ఇటు మమత ఎదురుదాడి మొత్తం బారతదేశాన్ని ఆకర్షించింది. మిగిలిన రాష్ట్రాల ఎన్నికల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకో లేదు. పశ్చిమబెంగాల్ దిక్సూచి కాబోతోందని అందరికీ తెలుసు. హోరాహోరీగా సాగిన పోరులో ఫలితం ఏమవుతుందో ఎగ్జిట్ ఫోల్స్ కూడా తేల్చి చెప్పలేకపోయాయి. పశ్చిమబెంగాల్ లో స్వాతంత్ర్య సమయంలో జాతీయ భావనల ప్రభావం ఎక్కువ. ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్తలూ అక్కడి నుంచే వచ్చారు. కమ్యూనిస్టుల అధికారంతో పశ్చిమబెంగాల్ జాతీయ వాద భావనల నుంచి సామ్యవాద జోన్ లోకి వెళ్లిపోయింది. మమతా బెనర్జీ కమ్యూనిస్టు ఏకచ్చత్రాధిపత్యాన్ని పటాపంచలు చేసి వామపక్షాలను నిర్వీర్యం చేసేశారు. దాంతో బీజేపీ తన సైద్దాంతిక అజెండాతో రంగ ప్రవేశం చేయడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. పశ్చిమబెంగాల్ మూలాలలో ఉన్న జాతీయతను మళ్లీ మరోసారి బీజేపీ విజయవంతంగా ప్రేరేపించగలిగింది. అందుకే అక్కడ బలమైన ఫోర్సుగా ఎదిగింది. కాంగ్రెసు, వామపక్సాల కూటమి నామమాత్రంగా మారిపోయింది. తృణమూల్ వర్సస్ బీజేపీగానే పోటీ సాగింది. మమత నెగ్గితే ఆమె కేంద్రంగా మారి విపక్షాలకు జాతీయస్థాయిలో అండ దొరుకుతుంది. బీజేపీయే ముందడుగు వేస్తే దానికి పోటీగా జాతీయ స్తాయి ప్రత్యామ్నాయం కనుమరుగు కావచ్చు.

తంబీల పట్టు…

తమిళనాడులో జాతీయ పార్టీలను నిలువరించడమే కాదు, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఏఐఏడీఎంకే ను తిరస్కరించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగానే చెప్పేశాయి. నిజానికి ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే పెద్దన్న పాత్ర. జాతీయ పార్టీలు ఏదో కూటమిలో చేరి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఇదే తంతు. బీజేపీ నరేంద్రమోడీ హయాంలో కి వచ్చిన తర్వాత తమిళనాడు పరిస్థితులను సైతం శాసించాలని చూశారు. శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు . తాము చెప్పినట్లు వినే పళని స్వామి, పన్నీరు సెల్వాలకు బాధ్యతలు అప్పగించారు. ఏఐఏడీఎంకే పెద్ద మెజార్టీతో లేకపోయినా కేంద్రం అండదండలతో పూర్తి కాలం అధికారంలో ఉండేలా చూశారు. అందువల్ల ఈసారి ఏఐడీఎంకే అధికారంలోకి వస్తే పూర్తిగా పగ్గాలు కేంద్రం అధీనంలో ఉన్నట్లే లెక్క. అయితే తమిళ తంబీలు ఏఐఏడీఎంకే పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా డీఎంకేకే పట్టంగట్టినట్లుగా ఎగ్జిట్ పోల్ష్ చెబుతున్నాయి. అంటే మరోసారి జాతీయ పార్టీలకు ఇక్కడ సీన్ లేదని చాటిచెప్పడమే. ప్రాంతీయ పార్టీల టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పేసినట్లే. వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ వర్సస్ ఎగ్జాక్ట్ ను ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయో చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News