వర్కవుట్ కాదని వదిలేసినట్లుందే

ఆయ‌న అతి పిన్న వ‌య‌సులోనే అదృష్టం కొద్దీ మంత్రి అయ్యారు. అయితే, ప్రజ‌ల్లో మాత్రం త‌నకు ప్రత్యేక స్థానం సంపాయించుకోలేక పోయారు. క‌నీసం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి [more]

Update: 2019-07-27 06:30 GMT

ఆయ‌న అతి పిన్న వ‌య‌సులోనే అదృష్టం కొద్దీ మంత్రి అయ్యారు. అయితే, ప్రజ‌ల్లో మాత్రం త‌నకు ప్రత్యేక స్థానం సంపాయించుకోలేక పోయారు. క‌నీసం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి ఓట్లు కూడా రాబ‌ట్టుకోలేక పోయారు. ఆయ‌నే కిడారు శ్రావ‌ణ్ కుమార్‌. 2014లో వైసీపీ త‌ర‌ఫున అర‌కు నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన కిడారి స‌ర్వేశ్వర‌రావు అనంతర కాలంలో చంద్రబాబు ఆప‌రేష‌న్‌కు చిక్కుకుని వైసీపీకి బై చెప్పి సైకిల్ ఎక్కారు. అయితే, ఆయ‌న పార్టీ మారిన స‌మ‌యంలో కోట్ల రూపాయ‌లు తీసుకున్నార‌ని, గిరిజ‌నులు వ‌ద్దని చెప్పినా.. మైనింగ్ కార్యక‌లాపాల‌ను ద‌గ్గరుండి చేయిస్తున్నార‌ని ఆరోపిస్తూ.. మావోయిస్టులు నడిరోడ్డుపై ప‌ట్టప‌గ‌లు ఆయ‌న‌ను కాల్చి చంపారు.

మంత్రివర్గంలోకి తీసుకుని…..

ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చి స‌ర్వేశ్వర‌రావు పెద్ద కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ కు రాజ‌కీయంగా, చిన్న కుమారుడికి డిప్యూటీ క‌లెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కిడారి శ్రావణ్ కుమార్ ఏకంగా మంత్రి ప‌ద‌విని అందుకున్నారు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు మాసాల ముందుగానే ఆయ‌న మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. రాజ్యాంగంలోని వెసులుబాటును అందిపుచ్చుకున్న చంద్రబాబు ఎలాంటి ఉప ఎన్నిక‌ల‌కు అవ‌కాశం లేకుండా… క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండానే శ్రావ‌ణ్‌ను త‌న మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే అర‌కు టికెట్ ఇచ్చారు.

నోటాకు పడిన ఓట్లు కూడా….

తండ్రి మావోయిస్టుల‌ చేతుల్లో హ‌త‌మైన నేప‌థ్యంలో ఆ సెంటిమెంట్ వ‌ర్కవుట్ అవుతుంద‌ని భావించిన చంద్రబాబు.. వెనుకా ముందు కూడా ఆలోచించ‌కుండా కిడారి శ్రావణ్ కుమార్ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే, తాజా ఎన్నిక‌ల్లో కిడారి శ్రావణ్ కుమార్ కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ప్రజ‌ల్లో సానుభూతి ఓట్లు కాదు క‌దా సాధార‌ణ ఓట్లు కూడా రాబ‌ట్టుకోలేక పోయారు. అర‌కులో నోటాకు ప‌డిన ఓట్లు కూడా కిడారి శ్రావణ్ కుమార్ కు రాలేదు. దీంతో నాలుగో ప్లేస్‌తో స‌రిపెట్టుకుని డిపాజిట్లు సైతం కోల్పోయారు.

రాజకీయాలకు దూరంగా…..

ఇలా ఓ మంత్రి స్థానంలో ఉన్న నాయ‌కుడు డిపాజిట్లు కోల్పోయిన ప‌రిస్థితి రాష్ట్రంలో ఒక్క కిడారి శ్రావణ్ కుమార్ కు మాత్రమే ఎదురైంది. అయితే, ఇప్పుడు ఆయ‌న ఎక్కడా క‌నిపించ‌డం లేదు. పార్టీ కార్యక్ర‌మాల్లో కానీ, కేడ‌ర్‌లో మ‌నో ధైర్యం నింపేందుకు కానీ ఎక్కడా కిడారి శ్రావణ్ కుమార్ ప్రయత్నించ‌డం లేదు. ఓడిపోయాక నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కే మొఖం చూపించ‌లేదు. పైగా అధినేత చంద్రబాబుకు కూడా అందుబాటులో లేకుండా కిడారి శ్రావణ్ కుమార్ పోయారు. దీంతో భ‌విష్యత్తులో ఆయ‌న అసలు పార్టీలో ఉంటారా? ఉండ‌రా ? అనే చ‌ర్చ తెర‌మీద‌కి వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News