ఒక్క ఓటు... ఎంత పనిచేస్తుందంటే....???

Update: 2018-12-10 17:30 GMT

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. అది ప్రజాకంటక పాలనను అంతమొందిస్తుంది. ప్రజారంజక పాలనకు పట్టం కడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదే. ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేస్తే దాని పరిణామాలు, ప్రభావం తీవ్రంగా ఉంటాయి. ఆ ఒక్క ఓటు నాయకుడి తలరాతను నిర్ణయిస్తుంది. ఆ ఒక్క ఓటే విజేతగా నిలబెడుతుంది. అందలం ఎక్కిస్తుంది. ఆ ఒక్క ఓటే పరాజితగ పక్కన పెడుతుంది. అధికారానికి అందనంత దూరానికి నెట్టేస్తుంది. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఓటు మహత్యం ఏంటో తెలుస్తుంది.

ప్రాధాన్యం ఏంటంటే......

ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన, గెలిచిన వారి వివరాలు చూస్తే ఓటుకున్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. పోలింగ్ సమయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటునూ వేయించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రస్తుతం మెజారిటీలు కూడా వేల నుంచి వందల్లోకి పడిపోతున్న నేపథ్యంలో ఓటు విలువ రాజకీయనాయకులకు స్పష్టంగా తెలిసి వస్తోంది. అందువల్లే ప్రచారం ఒక ఎత్తు, పోలింగ్ రోజున తన మద్దతుదారులు, సానుభూతి పరులను పోలింగ్ కేంద్రానికి రప్పించడం, ఓటు వేయించడం ఒక ఎత్తు. ఈ విషయంలో ఎంతటి గొప్ప నాయకుడయిన భారీ మూల్యం చెల్లించక తప్పదని చరిత్ర సోదాహరణంగా తెలియజేస్తుంది.ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళదాం.....

ఇవే ఉదాహరణలు....

2004లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్ ఎస్ అభ్యర్థి ఎ.ఆర్ కృష్ణమూర్తి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. సంతెమరహళ్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ధారువ నారాయణ విజేతగా నిలిచారు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, నారాయణకు 40,752 ఓట్లు లభించాయి. నాటి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక్కలింగ నాయకుడు ఎస్.ఎం. కృష్ణ ముఖ్యమంత్రి అయ్యారు. నాటి ఎన్నికల్లో కృష్ణమూర్తి తన డ్రైవర్ ను ఓటు వేయకుండా ఆపారు. అలా చేయకుంటే కృష్ణమూర్తి ఆనాడు కర్ణాటక శాసనసభలోకి అడుగుపెట్టి ఉండేవారు. 2008లో రాజస్థాన్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. నాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సి.పి. జోషి నాథ్ వారా నియోజకవర్గంలో ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. జోషీకి 62,215 ఓట్లు రాగా, ఆయన పై పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ కు 62,216 ఓట్లు లభించాయి. నాటి ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కును వినియోగించుకుని ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. జోషి ఓటమి ఫలితంగా నాడు ఆయన ముఖ్యమంత్రి పదవిని పొందలేకపోయారు. అప్పట్లో ఆ అవకాశాన్ని అశోక్ గెహ్లాట్ దక్కించుకున్నారు. జోషీ గెలిచి ఉంటే పీసీసీ అధ్యక్షుడి హోదాలో సహజంగా సీఎం పదవికి గట్టి పోటీదారు అయి ఉండేవారు. 2015లో పంజాబ్ లోని మొహలీ నగర పాలక సంస్థలోని డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్వీందర్ కౌర్, అకాళీదళ్ అభ్యర్థి నిర్మల్ కౌర్ పై ఒక్క ఓటు తేడాతో గెలిచారు.

వాజ్ పేయి కూడా.....

1999లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి లోక్ సభ విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోయారు. నాటి కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వాజ్ పేయి అనివార్యంగా ఓడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఒడిశా ముఖ్యమంత్రిగా లోక్ సభకు గెలిచిన గమాంగ్ ఓటు విషయమై సందిగ్దత నెలకొంది. నాటి లోక్ సభ స్పీకర్, అమలాపురం ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన బాలయోగి గిరిధర్ గమాంగ్ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వడంతో వాజ్ పేయికి పరాభవం తప్పలేదు. 13 నెలల వాజ్ పేయి ప్రభుత్వం పతనమైంది. అనంతరం ఎన్నికలకు వెళ్లిన వాజ్ పేయి మరింత మెజారిటీతో లోక్ సభలోకి తిరిగి వచ్చారు. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు.

ఆంధ్రప్రదేశ్ లో కూడా......

తక్కువ ఓట్లతో గెలిచిన ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో చోటు చేసుకున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆళ్లకు 88,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి గంజి చంద్రమౌళికి 88,965 ఓట్లు వచ్చాయి. 1989లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయనకు 2,99,109 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి అప్పల నరసింహానికి 2,99,100 ఓట్లు లభించాయి. 1991లో కూడా అదే నియోజకవర్గం నుంచి కొణతాల లోక్ సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ హయాంలో కొంతకాలం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఓటు ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్న ఈ సంఘటనలు ప్రస్తుత అభ్యర్థులు తెలుసుకున్నారా? లేదా? అన్నది రేపటి ఫలితాల్లో తేలనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News