జనాభాతోనే జయిస్తారా..?

ప్రజల్లో ఉండే భావనలు ఆధారంగా చేసుకుంటూ గెలుపు సాధించడమనేది బీజేపీ మౌలిక సూత్రాల్లో ఒకటి. గతంలో సిద్ధాంతపరమైన పార్టీగా చెప్పుకునే కమలదళం అధికారంలోకి వచ్చాక క్రమేపీ దారి [more]

Update: 2021-08-03 16:30 GMT

ప్రజల్లో ఉండే భావనలు ఆధారంగా చేసుకుంటూ గెలుపు సాధించడమనేది బీజేపీ మౌలిక సూత్రాల్లో ఒకటి. గతంలో సిద్ధాంతపరమైన పార్టీగా చెప్పుకునే కమలదళం అధికారంలోకి వచ్చాక క్రమేపీ దారి తప్పుతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ లో దీనికి సంబంధించిన ప్రయోగం పెద్ద ఎత్తున చర్చనీయమవుతోంది. జనాభా నియంత్రణకు చట్టం చేయడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతోంది. రాజకీయ పదవులకు, సంక్షేమ పథకాలకు ఇద్దరు పిల్లలను మించిన కుటుంబాలను దూరంగా ఉంచాలనేది ఈ కొత్త విధానంలోని లక్ష్యం. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో హఠాత్తుగా జనాభా నియంత్రణ గుర్తుకు వచ్చింది. అందుకే రాజకీయ ప్రత్యర్తులు అనుమానాస్పద చూపులు సారిస్తున్నారు. ఎన్నికల నాటికి జనాభా నియంత్రణను ప్రధాన ప్రచారాస్త్రం చేసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ యోచన చేస్తున్నారు. హిందూ , ముస్లిం వర్గాల వారీగా సమీకరణకు ఇది అత్యంత సులభమైన మార్గంగా ఉపయోగపడుతుందనేది రాజకీయ ఎత్తుగడ. అయితే రాష్ట్రంలో అభివద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడకుండా కేవలం ఇటువంటి ప్రయోగాల వల్ల ప్రజల మెజార్టీ దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంజయ్ గాంధీ చలవతో…

స్వాతంత్ర్యానంతరం దేశంలో జనాభా వృద్ధి రేటు విపరీతంగా పెరిగింది. రెండు వేల సంవత్సరం వరకూ ఆ వృద్ధి రేటు పెరుగుతూనే వచ్చింది. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పడుతోంది. తీవ్రమైన పేదరికం, అసమానతలు ఉన్న సమాజంలో జనాభాను నియంత్రించకపోతే ప్రమాదకరమని తొలిసారిగా ఎమర్జెన్సీ కాలంలో కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందిరాగాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ అప్పట్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రజలు ఇటువంటి నియంత్రణ చర్యలపట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెసు ఘోరంగా ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. ప్రజలు స్వచ్ఛందంగా సన్నద్ధం కాకుండా వ్యక్తిగత అంశాల్లో ప్రభుత్వ అతి జోక్యం చెడు ఫలితాలకు దారి తీస్తుందనేందుకు ఇదొక ఉదాహరణ. నియంత్రణ పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ రాజకీయంగా పార్టీ చేదు ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది. దేశంలో నాలుగున్నర దశాబ్దాల తర్వాత యోగి ఇటువంటి ప్రయోగం చేపడుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందనే భావన కంటే ప్రజలలో కలిగించే అలజడే ప్రధానమైన ప్రచారాంశమవుతోంది.

మత భావనల కోసమే…

భారత దేశంలో ఇటీవల వెలువడిన అనేక పరిశోధనలు దంపతుల సంతానోత్పత్తి సామర్త్యం పడిపోతోందని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే నగరాల్లో పిల్లలను కనే సగటు వయసు నలభై సంవత్సరాలకు చేరిపోయింది. ఇది మరింతగా కుచించుకుపోయే ప్రమాదం ఉందని అంచనాలు వేస్తున్నారు. రకరకాల కారణాలతో పట్టణాల్లో వివాహ వయసును స్త్రీపురుషులు పెంచుకుంటున్నారు. గ్రామాల్లో మాత్రమే నిర్దిష్ట వయసు దాటకుండా వివాహాలు చేసుకుంటున్నారు. అందువల్లనే జనాభా పెరుగుదలలో కొంతమేరకు బ్యాలెన్సి్ ఉంటోంది. ఈ స్థితిలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇద్దరికి మించి పిల్లలను కనేందుకు దంపతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒక్కరితోనే సరిపెట్టుకునేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటువంటి చట్టాల వల్ల సత్ఫలితాల కంటే చెడు పరిణామాలే ఎక్కువ ఉంటాయని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇటువంటి బలవంతపు నియంత్రణకు ప్రయత్నించి చైనాకు ఇప్పుడు కనువిప్పు కలిగింది. భవిష్యత్తులో తమ జనాభా కుదించుకుపోతోందని చైనా భయపడుతోంది. ఎక్కువ మంది పిల్లలను కనమంటూ పౌరులను అభ్యర్థిస్తోంది. మనదేశంలో కూడా రానున్న 20 సంవత్సరాల కాలంలో జనాభా వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చని అంచనా. అటువంటి స్థితిలో ఎన్నికల తరుణంలో కుటుంబ నియంత్రణ చట్టం అనేది సామాజిక వర్గాల వారీ ఓటరు విభజనకు ఉద్దేశించిందనే భావన పెరుగుతోంది.

ఓవైసీ.. వచ్చేసే…

హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే ఎం.ఐ.ఎం అధినేత ఓవైసీకి బీజేపీ చక్కని బాటలు వేస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలనేది ఓవైసీ ఆలోచన. బీహార్ లో మినహా ఇంతవరకూ ఎక్కడా పట్టు దొరకలేదు. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ సమాజ్ వాదీ పార్టీ ముస్లిం ఓట్లను టార్గెట్ చేసుకుంటూ ఇప్పటికే స్తిరపడింది. అయినా కుటుంబ నియంత్రణ చట్టాలవంటి వాటి పట్ల గట్టిగా పోరాటం చేయగల స్థితిలో లేదు. హిందూ ఓట్లు దూరమవుతాయనే భయం ఆ పార్టీని వెన్నాడుతోంది. ఈ దశలో దీనిపై గట్టిగా స్పందించడం ద్వారా మైనారిటీ వర్గాలను ఆకట్టుకోవచ్చని ఓవైసీ చూస్తున్నారు. ముస్లిం ఓట్లు సమాజ్ వాదీకి వెళ్లకుండా కొంతమేరకైనా ఎం.ఐ.ఎం ఒడిసి పట్టగలిగితే ఆమేరకు బీజేపీకి లాభం చేకూరుతుంది. ఎం.ఐ.ఎం. యూపీలో కొంత స్థిరపడితే కమలం పార్టీ దానిని బూచిగా చూపుతూ శాశ్వతంగా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. అందుకే భవిష్యత్ అవసరాలు, వాస్తవికత వంటివాటిని పక్కన పెట్టి తక్షణ రాజకీయం కోసం బీజేపీ తెగిస్తున్నట్లు కనిపిస్తోంది. యూపీలో నిన్నామొన్నటివరకూ ఎన్నికల అంశంగా ఉన్న రామమందిర నిర్మాణ సమస్య తీరిపోవడంతో కొత్త అవసరాలు పుట్టుకొచ్చాయి. అందులో భాగమే ఇటువంటి ఆపద్దర్మ చట్టాలు అని చెప్పక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News