ఏక్ నిరంజన్… టాప్ టూ బాటమ్…?

ఒకపుడు రాజకీయాలకు వర్తమాన రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఒకనాడు ముఖ్యమంత్రి కానీ ప్రధాని కాని తన మంత్రివర్గానికి పెద్దగా ఉండేవారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఉండేది. [more]

Update: 2021-07-31 02:00 GMT

ఒకపుడు రాజకీయాలకు వర్తమాన రాజకీయాలకు చాలా తేడా ఉంది. ఒకనాడు ముఖ్యమంత్రి కానీ ప్రధాని కాని తన మంత్రివర్గానికి పెద్దగా ఉండేవారు. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఉండేది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తన విధులను తాము చక్కగా నిర్వర్తించేవారు. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు చూసుకుంటే వార్డులలో కౌన్సిలర్లు, గ్రామాలలో సర్పంచులు కూడా రాజకీయంగా కడు బలవంతులుగా ఉండేవారు. ఎపుడైతే గ్లామర్ పాలిటిక్స్ మొదలయ్యాయో ఎపుడైతే వ్యక్తిపూజ మొదలైందో నాటి నుంచే కేంద్రీకృత రాజకీయాలు కూడా ఆరంభమయ్యాయి.

అందరూ డమ్మీలే…?

నాయకుడి ఇమేజ్ మీద పార్టీ గెలుపు ఆధారప‌డుతోందిపుడు. మిగిలిన వారు అంతా ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఎవరు, ప్రధాని ఎవరు అని చూసి జనాలు ఓటు వేస్తున్నారు. అలాంటి ఎంపికను నయా పాలిటిక్స్ ట్రెండ్ తీసుకువచ్చింది. దీని వల్ల మేలు కంటే కీడే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు మేధావులు అంటారు. అదేలా అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా డమ్మీలు అయ్యేంటంతగా. ఎవరైనా కాస్తా ఆత్మ గౌరవం చూపబోతే వారిని బయటకు గెంటేస్తారు అంతే. అయితే దీని వల్ల సమిష్టి విధానాలు, అందరి ఆలోచనల మేళవింపు వంటివి పరిపాలనలో లేకుండా పోతున్నాయని అంటున్నారు.

ప్రతీ చిన్న దానికీ ….?

ఇక ప్రతీ చిన్న సమస్యకూ ఏకంగా ముఖ్యమంత్రిని, ప్రధానిని విమర్శిస్తున్నారు. వీరి మధ్యలో ఎన్నో అధికారిక విభాగాలు ఉంటాయి. కానీ వారినే అంటున్నారు. ఎక్కడో గ్యాంగ్ రేప్ జరుగుతుంది. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా అంటున్నారు. మరెక్కడో రెండు పక్షాల మధ్య తగాదాలు జరుగుతాయి. ఒకరు హత్య చేయబడతారు. ఇదంతా ఆ ముఖ్యమంత్రే చేయిస్తున్నాడు అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడో పల్లెలలలో జరిగే నేరాలకు బాధ్యత ఎలా వహిస్తాడు. కానీ నేరుగా విపక్షాలు విమర్శలు చేయడంతో ఆయన ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అవుతోంది. తాజాగా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి భవనానికి దగ్గరలో క్రిష్ణానది పుష్కర ఘాట్ వద్ద ఒక యువతి మీద అత్యాచారం జరిగితే జగన్ మీదనే అంతా విమర్శలు చేశారు.

అదే బెటర్ కదా…?

గతంలో కాంగ్రెస్ ఏలుబడిలో ఇలాంటి విమర్శలూ లేవు, సమస్యలు కూడా ఇంతలా లేవు. ప్రతీ వార్డు మెంబర్ కూడా తన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించేవారు. అలా అధికారాలు బదలాయించబడ్డాయి. దాని వల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇపుడు అంతా ముఖ్యమంత్రే చూసుకుంటారు అని ఎవరూ పట్టించుకోవడం లేదు. మంచి జరిగినా ముఖ్యమంత్రి కే పేరు వస్తోంది. దాంతో చెడ్డ కూడా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతోంది. దీని వల్ల దేవతా విగ్రహాలు ఎక్కడో మారుమూల ద్వంసం అయినా సీఎం దగ్గరుండి చేయించారు అంటున్నారు. ఇది రాజకీయ తలనొప్పి అయితే పాలనాపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటపుడు సమిష్టిగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇటు రాష్ట్రాలలో అటు దేశంలో కూడా వందల రోజుల తరబడి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇది ప్రజాస్వామిక లక్షణం కాదు. ఏక్ నిరంజన్ పోకడల నుంచి భారతీయ రాజకీయ వ్యవస్థ మార్పు తీసుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం ఉండదు.

Tags:    

Similar News